Burning Topic: ట్రంప్‌ పై వరుస హత్యాయత్నాలకు కారణం అదేనా?

Burning Topic: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వరుస హత్యాయత్నాలు! వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో కాల్పుల కలకలం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 April 2026 7:32 AM IST
Burning Topic
X

Burning Topic: ట్రంప్‌ పై వరుస హత్యాయత్నాలకు కారణం అదేనా?

Burning Topic: అమెరికా ఫస్ట్ అనే నినాదంతో రెండోసారి ఆ దేశ అధ్యక్షుడిగా విజయబావుటా ఎగురవేసిన డొనాల్డ్ ట్రంప్‌పై వరుస హత్యాయత్నాలు, భద్రతా వైఫల్యాలు తీవ్ర సంచలనాన్ని రేపాయి. తాజాగా ఈ నెల 26న వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్ అనే దుండగుడు 5 నుంచి 8 రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం వినగానే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే స్పందించి ట్రంప్‌తోపాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటన జరిగిన వెంటనే తేరుకున్న ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. సీక్రెట్ సర్వీస్‌తోపాటు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది ధైర్యంగా పనిచేశారని ప్రశంసించారు. అంతకుముందు 2024 జూలై 13న పెన్సిల్వేనియాలోని ఒక ప్రచార ర్యాలీలో 20 ఏళ్ల థామస్ క్రూక్స్ జరిపిన కాల్పుల్లో బుల్లెట్ ట్రంప్ కుడి చెవిని తాకుతూ వెళ్ళింది. ఈ ఘటనలో ఒక ప్రేక్షకుడు మరణించగా, నిందితుడిని సీక్రెట్ సర్వీస్ హతమార్చింది. అదే ఏడాది సెప్టెంబర్‌లో.. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్‌పై ర్యాన్ రౌత్ అనే వ్యక్తి రైఫిల్‌తో కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే అప్రమత్తమైనా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆ షూటర్‌ను అరెస్ట్ చేశారు. అయితే వరుసగా జరుగుతున్న ఈ దాడులు సీక్రెట్ సర్వీస్ వైఫల్యాలేనన్న వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. దీనిపై అమెరికా చట్టసభ సభ్యులు లోతైన విచారణలు ప్రారంభించారు. అంతేకాక భద్రతా ప్రోటోకాల్స్‌లో మార్పులు కూడా చేపట్టారు. ట్రంప్ తనపై జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్యంపై దాడులుగా అభివర్ణించగా, భద్రతా వ్యవస్థల పటిష్టతపై ప్రజల్లో ఆందోళన పెరిగింది.

ఈ దాడికి పాల్పడిన నిందితుడు అలెన్ గురించి అవాక్కయ్యే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కాల్పులకు పది నిమిషాల ముందే తన కుటుంబ సభ్యులకు ఒక మేనిఫెస్టో పంపాడని, అందులో తన లక్ష్యాలను స్పష్టంగా రాసుకున్నాడని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అందులోభాగంగానే.. ట్రంప్‌ను అంతం చేసేందుకు పక్కా స్కెచ్ వేశాడు. చేతిలో మూడు తుపాకులతో.. వైట్‌హౌస్ విందులోకి చొచ్చుకెళ్లాడు. ఈ కాల్పులకు బరితెగించాడు. అంతేకాక ట్రంప్‌తో పని చేస్తున్న ప్రభుత్వ అధికారులు అందరినీ హత్య చేసేందుకు స్కెచ్ వేశాడు. అలెన్ రాసిన లేఖ ద్వారా విషయాలు స్పష్టమవుతున్నాయి. ట్రంప్‌తో కలసి పని చేస్తున్న వారంతా తన టార్గెట్ అని చెప్పుకొచ్చిన అలెన్.. ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ మాత్రం తన టార్గెట్ కాదని చెప్పాడు. కాగా.. ఆ విందులో పాల్గొన్న అతిథులు కూడా నేరస్థులే అంటూ చెప్పుకొచ్చాడు. పైగా.. వేరే ఎవరైనా పీడించబడుతున్నప్పుడు చూస్తూ ఊరుకోవడం క్రైస్తవ ధర్మం కాదు.. అది నేరస్థులకు సహకరించడమే అవుతుందని అలెన్ వాదిస్తున్నాడు. ట్రంప్ ఏలుబడిలో నేరస్థుల వల్ల పిల్లలు, ఆడ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని.. అందుకే తాను ఈ మార్గాన్ని ఎంచుకున్నాననీ చెప్పుకొచ్చాడు.

అయితే షూటర్ అలెన్ ఆరోపణలను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తన కుటుంబ సభ్యులకు రాసిన లేఖలో ఒక పీడోఫైల్, రేపిస్ట్, దేశద్రోహి తన నేరాలతో అమెరికాకు మసిపూయడాన్ని ఎంతమాత్రం అంగీకరించబోననీ నిందితుడు అలెన్ చెప్పుకొచ్చాడు. అమెరికాకు మళ్లీ కొత్త నాయకత్వం వచ్చేనాటికి.. ట్రంప్ వంటి అసమర్థత, పిచ్చితనం తదితర పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నట్లు నిందితుడు ఆ లేఖలో రాసుకొచ్చాడు. కాల్పులకు పాల్పడిన వెంటనే అలెన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. అతణ్నికాలిఫోర్నియాలోని టోరెన్స్ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. ఇంజినీరింగ్‌ డిగ్రీతోపాటు కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసినట్టు చెబుతున్నారు. అలెన్‌కు వైద్య పరీక్షలు పూర్తి చేసి.. కోర్టులో హాజరుపర్చనున్నారు. అతడి నేపథ్యం, ఉద్దేశ్యం వంటి అంశాలపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. హోటల్‌లో గెస్ట్‌గా ఉన్నాడా? లేదా బయటనుంచి వచ్చాడా? అన్న అంశాలపై కూడా విచారిస్తున్నట్టు సమాచారం. అయితే హిల్టన్‌ హోటల్‌లో కాల్పుల వెనుక నిందితుడి ఉద్దేశాన్ని గుర్తించటంపై దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయని తెలుస్తోంది. దాడికి ముందు చేసిన ముందస్తు హెచ్చరికలను భద్రతాదళాలు విస్మరించాయా అనే విషయాన్ని అంచనా వేసేందుకు నిందితుడి లేఖను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారట.

ఇలా ఉంటే.. హిల్టన్‌ హోటల్‌లో కాల్పుల ఘటన అమెరికాలో అగ్ర నేతల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడి భద్రతను పర్యవేక్షించే సీక్రెట్‌ సర్వీసు ఏజెంట్లతోపాటు పోలీసులు వందల సంఖ్యలో మోహరించినా ట్రంప్‌ విందు సమావేశం వద్దకు ఒక వ్యక్తి తుపాకులు, కత్తులతో ఎలా రాగలిగాడన్నది మిస్టరీగా మారింది. రక్షణ ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేదని సీక్రెట్‌ సర్వీసు ఏజెంట్లు చెబుతున్నప్పటికీ.. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైనదిగా భావించే భద్రతా యంత్రాంగంలోనూ లొసుగులు ఉన్నాయన్నది విమర్శల వాదన. వైట్‌హౌస్‌ కరెస్పాండెంట్స్‌ అసోసియేషన్‌ విందు ఎన్నో ఏళ్లుగా హిల్టన్‌ హోటల్‌లోనే నిర్వహించడం ఆనవాయితీ. ఈ సమయంలో హోటల్‌లోకి సాధారణ అతిథులను కూడా అనుమతిస్తుంటారు. భద్రతను చాలావరకూ బాల్‌రూమ్‌కే పరిమితం చేస్తుంటారు. అయితే ఈ విందుతో సంబంధంలేని సాధారణ అతిథులను పెద్దగా తనిఖీ చేయడంలేదన్న విమర్శలూ జోరందుకున్నాయి. అయితే విందు కార్యక్రమానికి హాజరైన ట్రంప్‌కి బహుళ అంచెల భద్రతను కల్పించామని సీక్రెట్‌ సర్వీసు అధికారులు వాదిస్తున్నారు. షూటర్ అలెన్‌.. వెలుపలి భద్రతా వలయాన్ని కొంతమేర దాటినట్లు చెబుతున్నారు. నిందితుడు హిల్టన్ హోటల్‌లో బస చేశాడని, అందువల్లే ఆయుధాలతో అక్కడికి చేరుకోగలిగాడనీ అనుమానిస్తున్నారు. కాగా.. ట్రంప్‌పై దాడి జరిగిన ఇదే హిల్టన్‌ హోటల్‌లో 1981 మార్చి30న ఆనాటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్‌పై కూడా హత్యయత్నం జరిగింది. ఆ ఘటన జరిగిన దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిపైనా అదే తరహాలో హత్యాయత్నం జరగడం.. తీవ్ర చర్చకు దారి తీసింది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story