Off The Record: రేవంత్ కీలక నిర్ణయం.. వారసత్వ ఉద్యోగాలు లేనట్టే?

Off The Record: సింగరేణిలో కారుణ్య నియామకాలు రద్దు కానున్నాయా? వారసత్వ ఉద్యోగాల విషయంలో కార్మికుల ఆందోళనలు, మెడికల్ బోర్డులో అవినీతి ఆరోపణలు

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 April 2026 6:42 AM IST
Off The Record
X

Off The Record: రేవంత్ కీలక నిర్ణయం.. వారసత్వ ఉద్యోగాలు లేనట్టే?

Off The Record: సింగరేణిలో కారుణ్య నియామకాలను ఎత్తివేస్తారని జోరుగా ప్రచారం సాగుతుంది. గతేడాది మార్చి నుంచి మెడికల్ బోర్డును యాజమాన్యం నిలిపివేయడమే ప్రస్తుత కలకలానికి కారణం. కారుణ్య నియామకాల పేరుతో.. 2018 నుంచి అనారోగ్యం బారిన పడిన కార్మికులను మెడికల్ ఇన్వాలిడేషన్ చేసి వారి స్థానంలో వారసులకు సింగరేణి ఉద్యోగాలు ఇస్తోంది యాజమాన్యం. వీటి ద్వారా దాదాపు కొత్తగా 15వేల మంది కార్మిక వారసులు ఉద్యోగాల్లో చేరారు. ఐతే మెడికల్ బోర్డు నిర్వహణపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో గత ఏడాది నుంచి కారుణ్య నియామకాలకు చెక్ పడింది. 12 నెలలుగా మెడికల్ బోర్డు నిలిచిపోయింది. మధ్యలో రెండుసార్లు మెడికల్ బోర్డు నిర్వహించినా.. ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అవకాశం కల్పించారు. దీంతో ఏడాదిగా బోర్డుకు వెళ్లలేని కొందరు కార్మికులు, వారి సర్వీసు పూర్తి చేసుకొని ఉద్యోగ విరమణ పొందారు. ఫలితంగా వారి కుటుంబంలో ఒకరు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మెడికల్ బోర్డులపై అనేక ఆరోపణలు వచ్చాయి. లంచంగా డబ్బు తీసుకుని ఆరోగ్యంగా ఉన్న కార్మికులకు సైతం

మెడికల్ అన్‌ఫిట్‌ సర్టిఫికేట్ ఇచ్చినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఇలా అక్రమ కారుణ్య నియామకాల వల్ల సింగరేణిపై ఆర్థిక భారం పడుతోందని ఇటీవల శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. దీనిపై ఏసీబీ, విజిలెన్స్ విచారణ చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో కారుణ్య నియామకాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ బోర్డులో అవినీతికి తోడు, కొన్ని గనులు మూత పడుతుండటం, కొత్త ప్రాజెక్టులు లేకపోవడం కూడా తాజా పరిస్థితికి కారణాలుగా చెబుతున్నారు.

సింగరేణి సంస్థ గత కొన్నాళ్ళుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. వేల కోట్ల లాభాలు వస్తున్నట్టు ప్రకటించడమే కానీ.. నిర్వహణ కోసం నిధుల కొరతను ఎదురుకుంటోంది. అవసరాల కోసం అప్పులు చేస్తోంది. సంస్థకు 50వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. దీనికి తోడు గత ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి కూడా తగ్గింది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కారుణ్య నియామకాలు జరపడం తలకు మించిన భారంగా యాజమాన్యం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు గతంలో కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు సైతం విధులకు డుమ్మా కొడుతున్నారు. ఇది ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది.

గైర్హాజరును తగ్గించేందుకు యాజమాన్యం కార్మికుల కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. అన్నింటికీ మించి భూ గర్భ గనుల వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి తీవ్ర నష్టాలు వస్తుండటంతో కార్మికుల సంఖ్య ఎంత తగ్గితే అంత మేలన్న భావనతో యాజమాన్యం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

రెగ్యులర్ మెడికల్ బోర్డు నిర్వహణ లేకపోవడంతో సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంస్థలో అసలు కారుణ్య నియామకాలు ఉంటాయా..? నిలిచిపోతాయా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ బోర్డు పెట్టాలని, అవినీతి పేరుతో అసలు కారుణ్య నియామకాలకే

ఎసరు పెడుతున్నారని, దీనివల్ల అసలైన అర్హులకు అన్యాయం అన్యాయం జరుగుతుందని కార్మిక సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. అలాగే కారుణ్య నియామకాల వల్ల.. ఉద్యోగాల్లో చేరి పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న వారిపై విచారణ జరిపితే కార్మికవర్గం నుంచి తిరుగుబాటు వస్తుందని పేర్కొంటున్నాయి. మెడికల్‌ బోర్డు నిర్వహించకపోవడానికి, సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను నిలిపివేయడానికి ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం చేస్తున్న కుట్రగా పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. మెడికల్‌ అన్‌ఫిట్‌ కేసుల్లో ఎవరైనా అనర్హులు ఉద్యోగాలు పొందితే దానికి కార్మికుల కంటే సింగరేణి మెడికల్‌ బోర్డు, యాజమాన్యమే దోషిగా నిలబడాల్సి ఉంటుందని సంఘాలు వాదిస్తున్నాయి. ఇది కాస్త కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, వ్యతిరేకతకు దారి తీస్తోంది.

కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా?.. లేక సింగరేణి యాజమాన్యం నిర్ణయాలు గుదిబండగా మారనున్నాయా అనేది వేచి చూడాలి.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story