BIG STORY: బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు!

BIG STORY: ఎమర్జెన్సీ సమయంలో జరిగిన అకృత్యాలపై ఇందిరా గాంధీ పశ్చాత్తాపం వ్యక్తం చేశారని, ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పారని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ వెల్లడించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 Nov 2026 10:45 AM IST
BIG STORY
X

BIG STORY: బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు!

BIG STORY: ఆధునిక భారతదేశ చరిత్రలో ఎమెర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. మొత్తం 21 నెలల పాటు మనదేశంలో ఆత్యయిక పరిస్థితి అమలైంది. భారత రాజకీయ ముఖచిత్రంపై ఎమెర్జెన్సీ పెను ప్రభావాన్ని చూపించింది. భారతదేశ ప్రజాస్వామ్య ప్రయాణాన్ని పూర్తిగా పట్టాలు తప్పించడానికి జరిగిన ప్రయత్నమే ఆత్యయిక పరిస్థితి విధించడం అనేది జగమెరిగిన సత్యం.

ఎమెర్జెన్సీలో దేశవ్యాప్తంగా అనేక దారుణాలు జరిగాయి. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిన దారుణాలు మరింత ఎక్కువగా జరిగాయి. ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో ఫ్యామిలీ ప్లానింగ్‌ను బలవంతంగా అమలు చేశారు. ఇందులో భాగంగా వైద్యాధికారులకు నెలకు ఇన్ని అంటూ కోటా ఫిక్స్ చేశారు. దీంతో వివాహం కాని అబ్బాయిలకు కూడా బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేశారు.

ఎమెర్జెన్సీ లో జరిగిన దారుణాల్లో తుర్క్‌మన్ గేట్ ఉదంతం ఒకటి. తుర్క్‌మన్ గేట్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు ఉంటారు. ఢిల్లీ నగరంలోని తుర్క్‌మన్ గేట్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో అనధికార నిర్మాణాలున్నాయన్నది సర్కార్ చెప్పిన సాకు.

ఈ నేపథ్యంలో ఈ కూల్చివేతలకు అధికారులు పకడ్బందీగా ప్లాన్ చేశారు. అయితే తన నివాసాల కూల్చివేతకు తుర్క్‌మన్ గేట్ ప్రాంత వాసులు అంగీకరించలేదు. కూల్చివేతల కోసం తీసుకువచ్చిన బుల్ డోజర్లను అడ్డుకున్నారు. దీంతో స్థానికులను పోలీసుల సాయంతో బలవంతంగా అక్కడ్నుంచి తొలగించారు ప్రభుత్వ అధికారులు.

దారుణాలకు నిలయంగా మారిన ఎమెర్జెన్సీ కి సంబంధించి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తొలిసారి స్పందించారు. ఎమెర్జెన్సీ సమయంలో జరిగిన అకృత్యాలపై మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాతి కాలంలో పశ్చాత్తాపం వ్యక్తం చేశారని ఆమె వెల్లడించారు. అంతేకాదు సదరు ఘటనలకు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారన్నారు. తాజాగా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనియా ఈ విషయాలు వెల్లడించారు.

ఎమర్జెన్సీ అనగానే ప్రజలకు సంజయ్‌గాంధీ గుర్తుకొస్తారన్నారు. అయితే ఎమర్జెన్సీకి సంజయ్‌గాంధీ ఒక్కరినే బాధ్యుడిగా చూడకూడదని సోనియా గాంధీ స్పష్టం చేశారు.అప్పట్లో ఇందిరాగాంధీపై సీనియర్‌ నేతల నుంచి కూడా ఒత్తిడి ఉండేదన్నారు.

ఎమెర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య హక్కులు నిలిపివేశారని సోనియా అంగీకరించారు. హేబియస్‌ కార్పస్‌ హక్కును కూడా రద్దు చేశారన్నారు.అయితే అప్పటి పరిస్థితులు ఇందిరాగాంధీని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయని వివరించారు. హింసాత్మక ఆందోళనలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా రవాణా వ్యవస్థపై దాడులు జరిగాయని గుర్తుచేశారు.

ప్రభుత్వ అధికారులు, సాయుధ దళాలు ఆదేశాలను ధిక్కరించాలన్న పిలుపులు కూడా వచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎమెర్జెన్సీ విధించాలన్న నిర్ణయానికి ఇందిరా గాంధీ వచ్చారన్నారు. అయితే ఆ తరువాత పరిస్థితులను అర్థం చేసుకున్న ఇందిర...1977 మార్చిలో లోక్ సభ ఎన్నికలకు పిలుపునిచ్చారన్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్