BIG STORY: సీజేపీ కి కేంద్రం బిగ్ షాక్!

BIG STORY: ఆక్స్‌ఫర్డ్ కార్యక్రమం కోసం లండన్ వెళ్తుండగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తనను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని సౌరవ్ దాస్ ఆరోపణ. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 Nov 2026 8:31 AM IST
BIG STORY
X

BIG STORY: సీజేపీ కి కేంద్రం బిగ్ షాక్!

BIG STORY: సౌరవ్‌ దాస్‌ ఇటీవల తెరమీదకు వచ్చిన యువ కెరటం. కాక్రోచ్ జనతా పార్టీ సహ కన్వీనర్ గా ఆయన దేశమంతా పాపులర్. అంతేకాదు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అనేక ఆందోళనా కార్యక్రమాల్లో సౌరవ్ దాస్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

కాగా కేంద్ర ప్రభుత్వంపై సౌరవ్‌ దాస్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్‌ వెళ్లాల్సి ఉండగా, ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.

ఢిల్లీ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగిందన్నారు ఆయన.తెల్లవారుజామున 1 గంటకు బయలుదేరాల్సిన విమానం ఎక్కేందుకు సిద్ధమైన సమయంలో అధికారులు తనను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆయన వరుస పోస్టులు పెట్టారు.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నిర్వహించే ప్యానెల్‌ చర్చలో పాల్గొనేందుకు తనకు ఆహ్వానం అందిందని సౌరవ్​ దాస్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్‌ బయలుదేరుతుండగా ఇమ్మిగ్రేషన్‌ తనిఖీల సమయంలో తన పాస్‌పోర్ట్‌ను ఫ్లాగ్‌ చేసినట్లు తెలిసిందన్నారు.

దీంతో తన ప్రయాణానికి ఆటంకం ఏర్పడిందని సౌరవ్‌ దాస్‌ వెల్లడించారు. విద్యావంతుల మధ్య మేధోపరమైన చర్చ జరపడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఈ సందర్బంగా ఆయన ప్రశ్నించారు.అయితే, ఈ ఘటన తనను వెనక్కి లాగలేదని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో లండన్‌, పారిస్‌తో పాటు ఇతర ప్రాంతాలకు కూడా వెళ్తానని సౌరవ్ పేర్కొన్నారు.

అంతేకాదు...తాను నీరవ్‌ మోడీ లేదా విజయ్‌ మాల్యా అయి ఉంటే బాగుండేదని సౌరవ్​ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకెళ్లాల్సిందని ఆయన కామెంట్ చేశారు. బ్యాంకులను కోట్లాది రూపాయల మేర మోసం చేసి ఉంటే ఈ ప్రభుత్వం తనను ఎంతో సులభంగా దేశం దాటి వెళ్లనిచ్చేదని సౌరవ్ దాస్ ఎద్దేవా చేశారు.

అంతేకాదు.. మంత్రుల తీరు కారణంగా క్యాబినెట్ విస్తరణను కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేయలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రివర్గ విస్తరణకు వీలు కల్పిస్తూ రాజీనామాలు చేయాలని కొంతమంది మంత్రులను ప్రధాని మోడీ ఆదేశిస్తే....అందుకు సదరు మంత్రులు అంగీకరించడం లేదని సౌరవ్ దాస్ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే స్పందించారు. సౌరవ్‌ దాస్‌కు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం రావడం అధికారంలో ఉన్నవారిలో అసూయకు కారణమైందని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆయన వ్యాఖ్యానించారు.

విద్యావంతుల గొంతులను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీజేపీ నాయకులు ఆరోపించారు. అంతేకాదు సీజేపీ పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రతీకారానికి దిగిందని దీప్కే ఆరోపించారు. కాగా ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన ఘటనపై సౌరవ్ దాస్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్