Burning Topic: కాల్పులతో దద్దరిల్లిన దక్షిణాఫ్రికా.. అసలు ఏం జరుగుతోంది?
Burning Topic: దక్షిణాఫ్రికాలో జోహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్‌లలో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో 27 మంది మృతి, 26 మందికి గాయాలు. అమెరికాలోనూ కాల్పుల కలకలం.
Burning Topic: కాల్పులతో దద్దరిల్లిన దక్షిణాఫ్రికా.. అసలు ఏం జరుగుతోంది?
Burning Topic: దక్షిణాఫ్రికాలో ఇటీవలి కాలంలో పెరిగిపోయిన గన్ కల్చర్ శాంతి భద్రతలకు ముప్పుగా మారిపోయాయి. తాజాగా కొద్ది గంటల వ్యవధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. జొహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్ నగరాల సమీపంలోని టౌన్‌షిప్‌లలో జరిగిన సామూహిక కాల్పుల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరో 26 మంది గాయపడ్డారు. జొహన్నెస్‌బర్గ్‌కు సమీపంలోని వెడెలా టౌన్‌షిప్‌లో రాత్రి వేళ ఎనిమిది మంది ఏకే-47 రైఫిళ్లు, పిస్టళ్లతో ఓ బార్‌కు చేరుకున్నారు. ముందు బయట ఉన్నవారిపై కాల్పులు జరిపిన దుండగులు ఆ తర్వాత లోపలికి వెళ్లి అక్కడున్న వారిపైనా కాల్పులు కొనసాగించారు. ఈ దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 13 మంది పురుషులు, నలుగురు మహిళలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మరో 15 మంది తుపాకీ గుళ్లకు గాయపడ్డారు.
దుండగులు కాల్పుల అనంతరం బాధితులను తనిఖీ చేసి వారి మొబైల్ ఫోన్లు తీసుకున్నారు. ఆ తర్వాత రెండు వాహనాలకు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. జొహన్నెస్‌బర్గ్ ఘటన జరిగిన నాలుగు గంటల తర్వాత కేప్‌టౌన్ సమీపంలోని ల్వాండ్లే టౌన్‌షిప్‌లో మరో కాల్పుల ఘటన జరిగింది. తెల్లవారుజామున 1 గంట దాటిన తర్వాత ఓ దుకాణంలోకి పలువురు దుండగులు ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు.
ఈ దాడిలో ఎంతమంది పాల్గొన్నారనే దానిపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. అయితే పలువురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. రెండు ఘటనల్లోనూ ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. నిందితుల కోసం పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.ఐదు రోజుల క్రితమే డర్బన్ సమీపంలో జరిగిన మరో కాల్పుల్లో 11 మంది మృతి చెందారు. దీంతో వరుస కాల్పులు దక్షిణాఫ్రికాలో ఆందోళన కలిగిస్తున్నాయి.
తాజా తుపాకీ కాల్పుల ఘటనలో నిందితుల కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. టెక్నాలజీ సహాయంతో కొందరు అనుమానితుల చిత్రాలను గుర్తించామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ప్రకటించారు. దక్షిణాఫ్రికా పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ రెండు దాడుల వెనుక వేర్వేరు గ్యాంగ్‌లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
జోహన్నెస్‌బర్గ్ బార్ కాల్పుల ఘటన అక్రమంగా బంగారం తవ్వకాలు జరిపే 'జామా-జామాస్' ముఠాల మధ్య నడుస్తున్న గ్యాంగ్ వార్ కారణమని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా, దుండగులు బాధితుల మొబైల్ ఫోన్లు దోచుకెళ్లడం వల్ల ఇది దోపిడీ కోణం కూడా కావచ్చని భావిస్తున్నారు. మరోవైపు కేప్ టౌన్ సమీపంలో జరిగిన కాల్పుల వెనుక మద్యం వ్యాపారంలో ఉన్న తీవ్రమైన పోటీ, ఈర్ష్య కారణం కావచ్చని స్థానిక పోలీస్ కమిషనర్ తెలిపారు.
దక్షిణాఫ్రికాలో చట్టబద్ధమైన, అక్రమమైన తుపాకుల లభ్యత విస్తృతంగా ఉండటంతో కాల్పుల ఘటనలు తరచూ జరుగుతున్నాయి. వీటిలో అనేక ఘటనలు గ్యాంగ్‌ల మధ్య విభేదాలు, అక్రమ వ్యాపారాలపై ఆధిపత్య పోటీతో ముడిపడి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక హత్యల రేటు ఉన్న దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటిగా నిలుస్తోంది. సుమారు 6.2 కోట్ల జనాభా ఉన్న దక్షిణాఫ్రికాలో రోజుకు సగటున 60 మంది హత్యకు గురవుతున్నట్లు నివేదిక పేర్కొంది. దక్షిణాఫ్రికాలో నిరుద్యోగ రేటు చాలా ఎక్కువ.
ఉపాధి లేకపోవడంతో చాలామంది యువకులు సులభంగా డబ్బు సంపాదించేందుకు నేరాల వైపు మళ్లుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక అసమానతలు ఉన్న దేశాల్లో ఇది ఒకటి. సంపన్నులకు, మురికివాడల్లో ఉండే అత్యంత పేద ప్రజలకు మధ్య ఉన్న వ్యత్యాసం హింసకు దారితీస్తోంది. నేరగాళ్లను పట్టుకోవడంలో, వారికి శిక్ష పడేలా చేయడంలో అక్కడి న్యాయవ్యవస్థ చాలా బలహీనంగా ఉంది.
మరోవైపు అమెరికాలోని ఓ క్లబ్‌లో జరిగిన గొడవ హింసకు దారితీసింది. అమెరికాలోని మిచిగన్ రాష్ట్రం డెట్రాయిట్ పశ్చిమ ప్రాంతంలో ఈటన్ అవెన్యూ, ప్రెస్ట్ స్ట్రీట్ సమీపంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు పురుషులు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
కాల్పులకు ముందు ఘటన జరిగిన ప్రదేశంలో గొడవ జరిగింది. అనంతరం కొందరు తుపాకీతో హింసకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించి. పోలీసులకు కొన్ని ఆధారాలు, సమాచారం లభించాయి. అయితే దర్యాప్తు దృష్ట్యా వాటిని బహిర్గతం చేయలేదు. అనుమానితుడి వివరాలు పోలీసులు వెల్లడించలేదు. కాల్పులకు దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతోంది. కాగా కాల్పులకు సంబంధించి సమాచారం ఉన్నవారు పోలీసులకు తెలియజేయాలని డెట్రాయిట్ మేయర్ మేరీ షెఫీల్డ్ కోరారు.




