Burning Topic: అట్టుడుకుతున్న దక్షిణాఫ్రికా..అక్రమ వలసదారులను తరిమి కొడుతున్న ఆఫ్రికన్లు

Burning Topic: దక్షిణాఫ్రికాలో అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా నిరసనలు హింసాత్మకంగా మారాయి. జోహన్నెస్‌బర్గ్, డర్బన్, కేప్ టౌన్ నగరాలు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 July 2026 6:25 AM IST
Burning Topic
X

Burning Topic: అట్టుడుకుతున్న దక్షిణాఫ్రికా..అక్రమ వలసదారులను తరిమి కొడుతున్న ఆఫ్రికన్లు

Burning Topic: దక్షిణాఫ్రికాలో అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. జోహన్నెస్‌బర్గ్, డర్బన్, కేప్ టౌన్ నగరాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లో ఆందోళనలు చేపట్టారు. ఘనా, మలావి, జింబాబ్వే, మొజాంబిక్, నైజీరియా దేశాలకు చెందిన వారిపై దాడులు జరగడం, ఇళ్లను తగులబెట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో ఆయా దేశాలు తమ పౌరులను వెనక్కి రప్పించుకుంటున్నాయి. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, అధిక నేరాల రేటు, ఆర్థిక అసమానతలకు అక్రమ వలసదారులే కారణమని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు ఆ ఆందోళనలను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

దక్షిణాఫ్రిగా గత కొన్ని వారాలుగా అట్టుకుతోంది. అక్కడ అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. దక్షిణాఫ్రికా ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలన్నింటికీ వీరే కారణమని మార్చ్ అండ్ మార్చ్, ఆపరేషన్ డుడులా, ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ తదితర సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల మలావి దేశానికి చెందిన ఒక పౌరుడి హత్యతో ఉద్రిక్తతలు పెరిగాయి.

దక్షిణాఫ్రికాలో సరైన పత్రాలు లేని వలసదారులందరూ జూన్ 30వ తేదీ నాటికి దేశం విడిచి వెళ్ళిపోవాలని డిమాండ్ చేస్తూ గడువు కూడా విధించాయి. అయితే ఇలాంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని, గడువు విధించడం సమంజసం కాదని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా తిరస్కరించారు. మరోవైపు గడువు తేదీ ముగియడంతో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్, డర్బన్, కేప్ టౌన్ తదితర ప్రధాన నగరాల్లో వేలాది మందితో ప్రదర్శనలు నిర్వహించారు.

ఆఫ్రికా ఖండంలోనే సంపన్న దేశాలలో ఒకటిగా ఉన్న దక్షిణాఫ్రికాకు పొరుగు దేశాల నుండి మెరుగైన ఉపాధి కోసం పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులు వస్తున్నారు. ఘనా, మలావి, జింబాబ్వే, మొజాంబిక్, నైజీరియా లాంటి సాటి ఆఫ్రికా దేశాలకు చెందిన వారు చిన్నా చితకా పనులు చేసుకొని ఇక్కడ పొట్టపోసుకుంటారు. దక్షిణాఫ్రికా ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో నిరుద్యోగ రేటు దాదాపు 33 శాతానికి చేరుకుంది.

అక్రమంగా వచ్చే వలసదారులు తక్కువ వేతనాలకే పని చేయడానికి సిద్ధపడటంతో, స్థానిక వ్యాపారాలు వారిని చేర్చుకుంటున్నాయని, దీనివల్ల తమకు ఉపాధి అవకాశాలు దక్కడం లేదని స్థానిక యువత ఆరోపిస్తోంది. తమ దేశంలో ద్రవ్యోల్బణం, పెరిగిన నిత్యావసరాల ధరలు, పేదరికం వల్ల ఇబ్బంది పడుతున్న స్థానిక నల్లజాతి శ్రామిక వర్గం.. తమ కష్టాలకు వలసదారులనే సులభమైన లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నారు.

దక్షిణాఫ్రికాలో పెరుగుతున్న జనాభా కారణంగా స్థానిక ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు వంటి ప్రజా వనరులపై విపరీతమైన భారం పడుతోంది. చికిత్స కోసం ఆసుపత్రుల్లో గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం, నివాస గృహాల కొరత వంటి సమస్యలకు అక్రమ వలసదారులే కారణమని నిరసనకారులు భావిస్తున్నారు. కాగా ప్రభుత్వంలో ఉన్న అవినీతి, తగిన పెట్టుబడులు లేకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

దేశంలో శాంతిభద్రతల సమస్యలు, ముఖ్యంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, లూటీలకు కొందరు అక్రమ వలసదారులే కారణమని స్థానికులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో "ఆపరేషన్ డుడులా", "మార్చ్ అండ్ మార్చ్" సంస్థలు ఏర్పడి, వలసదారులను దేశం విడిచి వెళ్లాలంటూ గడువు విధించి ఉద్యమాలను ఉధృతం చేశాయి. మొజాంబిక్, ఘనా దేశాలకు చెందిన పౌరులపై దాడులు, ఇళ్లను తగులబెట్టడంతో ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి.

దక్షిణాఫ్రికాలో ఏర్పడ్డ హింస, బెదిరింపుల నుండి తప్పించుకోవడానికి ఇప్పటికే చాలా మంది విదేశీయులు పారిపోయారు. ఈ ఉద్రిక్త పరిస్థితులను గమనించి పొరుగు దేశాలు తమ పౌరులను వెనక్కి రప్పిస్తున్నాయి. నైజీరియా తన 269 మంది పౌరులను విమానాల్లో తరలించింది. ఘానా, మలావి, మొజాంబిక్, జింబాబ్వే కూడా తమ పౌరులను విమానం, బస్సు ద్వారా స్వదేశానికి రప్పిస్తున్నాయి.

ఆందోళనకారులు విధించిన గడువు ముగియండంతో వేలాది మంది వలసదారులు తమ భద్రతకు భయపడి, కొన్ని వారాలుగా తాత్కాలిక శిబిరాలలో ప్రాసెసింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. అనేక ప్రాంతాల్లో వలసదారులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళడానికి బస్సులను ఆశ్రయిస్తున్నారు. గతంలో జరిగిన విదేశీయుల వ్యతిరేక దాడుల నేపథ్యంలో ఎలాంటి హింస చెలరేగకుండా ప్రభుత్వం జోహన్నెస్‌బర్గ్, డర్బన్ తదితర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించింది.

దక్షిణాఫ్రికాలో 1994లో శ్వేతజాతీయుల మైనారిటీ పాలన ముగిసిన సమయంలో, మెరుగైన జీవితం కోసం ఆశిస్తూ చాలా మంది ఆఫ్రికన్ వలసదారులు దక్షిణాఫ్రికాకు తరలివచ్చారు. అధికారిక గణాంకాల ప్రకారం దక్షిణాఫ్రికాలో మూడు మిలియన్లకు పైగా చట్టబద్ధమైన విదేశీ పౌరులు ఉన్నారు. పత్రాలు లేకుండా దేశంలో ఉన్నారని భావిస్తున్న ఇంకా చాలా మంది వలసదారులను నమోదు చేయకపోవడం వివాదాస్పదంగా మారింది.

జనవరి నుండి దేశంలో అక్రమంగా ఉన్నందుకు సుమారు 50,000 మంది వలసదారులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కొన్ని రాజకీయ శక్తులు ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వలసదారులపైకి మళ్లిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల ఓట్లను ఆకర్షించడానికి వలస వ్యతిరేక సెంటిమెంట్‌ను రాజకీయ నాయకులు ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారు.

కాగా దక్షిణాఫ్రికాలో విదేశీయులపై పెరుగుతున్న హింస, విదేశీయులకు ఇచ్చిన అల్టిమేటం నేపథ్యంలో, ఆ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ కంపెనీలకు ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికా భారతీయ కార్పొరేషన్లకు ఒక ముఖ్యమైన మార్కెట్. టాటా గ్రూప్, మహీంద్రా & మహీంద్రా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు ఆ ప్రాంతంలో తమ కార్యకలాపాలను విస్తరించాయి.

ఈ కంపెనీలు స్థానిక ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తాయి. కార్యకలాపాల వాతావరణంలో అస్థిరత ఏర్పడితే, కార్యకలాపాల్లో జాప్యం, భద్రతా ఖర్చులు పెరగడం, సిబ్బంది భద్రతకు ముప్పు పొంచి ఉంది. ప్రస్తుత హింస వలస సంఘాలపై కేంద్రీకృతమైనప్పటికీ, దీర్ఘకాలిక అస్థిరత విస్తృత వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీసి, భారతీయ సంస్థలు ఆధారపడే వాణిజ్య మార్గాలను, సరిహద్దు వాణిజ్య కార్యకలాపాలను ప్రభావితం చేయవచ్చు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story