Burning Topic: చరిత్ర సృష్టించిన ఎలన్ మస్క్ .. అంతరిక్షంలో సంచలనం!

Burning Topic: స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ భూకక్ష్య దిశగా సక్సెస్. నెక్ట్స్ జనరేషన్ స్టార్‌లింక్ వి3 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఈ ప్రయోగం అద్భుతం!

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 Sept 2026 7:00 AM IST
Burning Topic
X

Burning Topic: చరిత్ర సృష్టించిన ఎలన్ మస్క్ .. అంతరిక్షంలో సంచలనం!

Burning Topic: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో కీలక ప్రయోగం చేపట్టింది. తన భారీ రాకెట్ ‘స్టార్‌షిప్‌’ ను తొలిసారి భూకక్ష్య దిశగా ప్రయోగించింది. స్టార్‌లింక్‌కు సంబంధించిన 26 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతోపాటు భూమి చుట్టూ రాకెట్‌ ఆరు చక్కర్లు కొట్టేలా ఈ ప్రయోగాన్ని చేపట్టింది.

అమెరికా టెక్సాస్‌ నుంచి స్టార్‌షిప్‌ నింగిలోకి దూసుకెళ్లింది. కాసేపటికే వ్యోమనౌక నుంచి సూపర్‌ హెవీ బూస్టర్‌ విడిపోయింది. అనంతరం రాకెట్‌ భూకక్ష్యవైపు తన ప్రయాణాన్ని కొనసాగించింది. చంద్రుడిపై మానవసహిత యాత్రకు ‘నాసా’ సిద్ధమవుతున్న వేళ.. చేపట్టిన ఈ ప్రయోగం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇది స్టార్‌షిప్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. అంగారక గ్రహం, చంద్రునివైపు నడిపించే దిశగా వేసిన అతిపెద్ద అడుగుగా చెబుతున్నారు. ఈ మేరకు అంతరిక్ష పరిశోధనా రంగంలోనే ఎవరూ వెళ్లని కొత్త తీరాలకు ప్రయాణం మొదలైందని తెలిపారు. మొత్తం 407 అడుగుల ఎత్తు ఉండే స్టార్ షిప్‌లో 2 ప్రధాన భాగాలు ఉన్నాయి.

దిగువన ఉండే సూపర్ హెవీ బూస్టర్, పైభాగంలోని షిప్ రెండింటినీ పూర్తిగా, మరింత వేగంగా తిరిగి వినియోగించుకునేలా స్పేస్‌ఎక్స్ రూపొందిస్తోంది. రాకెట్‌ను తిరిగి వినియోగించే సామర్థ్యాన్ని అంతరిక్ష ప్రయోగాల భవిష్యత్తు రంగంలో అత్యంత కీలకమైన సాంకేతికతగా కంపెనీ చెబుతోంది. ఈ ప్రయోగంలో తొలిసారిగా 26 స్టార్‌లింక్ V3 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు.

ఇవి స్టార్‌లింక్ నెట్‌వర్క్‌కు నెక్ట్స్ జనరేషన్ ఉప్రగహాలు. వీటి సామర్ధ్యాన్ని గణనీయంగా మెరుగుపరిచిచారు. ఒక్కో వీ3 ఉపగ్రహం 1 TBPS డౌన్‌లింక్, 160 Gbps అప్‌లింక్ సామర్థ్యాన్ని అందించేలా రూపొందించారు. స్టార్‌లింక్ V2 తో పోలిస్తే డౌన్‌లింక్ సామర్థ్యం సుమారు 10 రెట్లు, అప్‌లింక్ సామర్థ్యం 22 రెట్లు పెరుగుతుందని కంపెనీ తెలిపింది.

దీని ద్వారా ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ వేగం, సేవలు మరింత మెరుగుపడే అవకాశం ఉందని స్పేస్‌ఎక్స్ ప్రకటించింది స్టార్ షిప్ నుంచి విడిపోయిన తర్వాత స్టార్‌లింక్ V3 ఉపగ్రహాలు తమ యాంటెన్నాలను విప్పుకొని, సోలార్ అరేలను అమర్చుకుంటాయి. తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ, లేజర్ లింకుల ద్వారా భూమిపై ఉన్న వ్యవస్థలతో స్టార్‌లింక్ నెట్‌వర్క్‌లోని ఇతర ఉపగ్రహాలతో సంబంధాలు ఏర్పరచుకుంటాయి. తర్వాత ఆన్‌బోర్డ్ థ్రస్టర్లతో తమ కక్ష్యలను క్రమంగా పెంచుకుంటాయి.

3 స్టార్ లింక్ ఉపగ్రహాలకు ప్రత్యేక కెమెరాలను అమర్చారు. ఇవి స్టార్‌షిప్ హీట్ షీల్డ్‌ను పరిశీలించి చిత్రాల్ని భూమిపైకి పంపుతాయి. భవిష్యత్ మిషన్లలో స్టార్‌షిప్ తిరిగి ప్రయోగ కేంద్రానికి వచ్చేలా ల్యాండ్ చేయడానికి ముందు హీట్ షీల్డ్ పరిస్థితిని అంచనా వేసే సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ఈ డేటా ఉపయోగపడనుంది.స్టార్‌షిప్‌ను పునర్వినియోగించగల రాకెట్‌గా అభివృద్ధి చేయడమే స్పేస్ ఎక్స్ దీర్ఘకాలిక లక్ష్యంగా ఉంది. ఈ టెక్నాలజీ విజయవంతమైతే భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణాల ఖర్చు, సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది.

కాగా ఈ ప్రయోగం అనుకున్నంత సాఫీగా ఏమీ సాగలేదు. రాకెట్ నింగిలోకి దూసుకెళ్తున్న సమయంలో ఒక ఇంజిన్ మధ్యలోనే మొరాయించింది. దీంతో ఇంజనీర్లు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. అయితే, డేటాను పరిశీలించిన శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ ఇంజిన్ల సహాయంతో రాకెట్‌ను అనుకున్న లక్ష్యానికి చేర్చడంలో సఫలమయ్యారు.

నిర్ణీత కక్ష్యలోకి రాకెట్ చేరుకున్న తర్వాత, సరికొత్త జెనరేషన్ కు చెందిన 26 'స్టార్‌లింక్' ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి జారవిడిచింది. స్టార్‌షిప్ తొలి ఆర్బిటల్ మిషన్‌లో సుమారు 275 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించి భూమి చుట్టూ దాదాపు 6 సార్లు తిరిగేలా ప్లాన్ చేశారు. మొత్తం ప్రయాణం దాదాపు 10 గంటల పాటు కొనసాగేలా మిషన్‌ను రూపొందించారు.

అనంతరం స్టార్ షిప్‌ను చిలీకి పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయోగించిన 3.08 గంటలకే పసిఫిక్ మహాసముద్రంలో దిగింది. ఇదిలా ఉండగా.. మూడేళ్లలో ఇది 14వ స్టార్‌షిప్‌ ప్రయోగం. స్టార్‌షిప్ సాధారణ రాకెట్ల లాంటిది కాదు. దీని పరిమాణం, ముందుకు నెట్టే శక్తి, మళ్లీ మళ్లీ వాడే వీలున్న సాంకేతికత దీనిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. భూమి దిగువ కక్ష్యలో తిరగాలంటే గంటకు దాదాపు 28,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. గతంలో చేపట్టిన 13 టెస్ట్ ఫ్లైట్స్ అన్నీ సబ్-ఆర్బిటాల్ మార్గంలోనే జరిగాయి.

కానీ, ఈసారి మాత్రం స్టార్‌షిప్ సరికొత్త రికార్డు సృష్టిస్తూ ఆర్బిట్‌లోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ విజయంతో స్పేస్‌ఎక్స్ తన భవిష్యత్తు ప్రణాళికలపై పూర్తి విశ్వాసంతో ఉంది. రాబోయే రోజుల్లో మానవులను, భారీ సామాగ్రిని చంద్రుడిపైకి, అంగారక గ్రహంపైకి సురక్షితంగా చేరవేయడానికి ఈ స్టార్‌షిప్ రాకెట్ అత్యంత కీలకం కానుంది.

అయితే, అంతరిక్షంలోనే రాకెట్లలో ఇంధనం నింపుకోవడం, పూర్తిగా పునర్వినియోగం చేయడం వంటి సవాళ్లు ఇంకా ముందే ఉన్నాయి. ఏదేమైనా, మానవజాతి అంతరిక్ష యాత్రల చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్ అంతరిక్ష చరిత్రలోనే అత్యంత వేగవంతమైన, రికార్డు స్థాయి ప్రయోగాలతో దూసుకుపోతోంది. ఈ సంస్థ ఇప్పటి వరకు 716 అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించింది.

వీటిలో 704 ప్రయోగాలు అత్యంత విజయవంతమయ్యాయి. దీనితో స్పేస్ ఎక్స్ సక్సెస్ రేట్ దాదాపు 98.32% గా ఉంది. స్పేస్ ఎక్స్ ఇప్పటివరకు మొత్తం 12,930 కంటే ఎక్కువ స్టార్‌లింక్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించింది. వీటిలో ప్రస్తుతం దాదాపు 11,140 కి పైగా ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయి, వాటిలో 9,800 కంటే ఎక్కువ ఉపగ్రహాలు యాక్టివ్‌గా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా హై-స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్‌ను అందిస్తున్నాయి. ఇప్పటివరకు స్పేస్ ఎక్స్ రాకెట్లు 650 కంటే ఎక్కువ సార్లు విజయవంతంగా ల్యాండ్ అయ్యి, తిరిగి ప్రయోగాల్లో ఉపయోగించబడ్డాయి. కొన్ని బూస్టర్లను ఏకంగా 30 నుండి 35 సార్లకు పైగా రీ-యూజ్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్