Off The Record: శ్రీకాకుళం వైసీపీలో వర్గపోరు!

Off The Record: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్‌సీపీలో ముదిరిన వర్గపోరు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీనియర్ నేతల విభేదాలతో అయోమయంలో పార్టీ శ్రేణులు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Sept 2026 7:31 AM IST
Off The Record
X

Off The Record: శ్రీకాకుళం వైసీపీలో వర్గపోరు!

Off The Record: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి బలమైన కేడర్ ఉంది. ధర్మాన, తమ్మినేని, సీదిరి అప్పల్రాజు వంటి దిగ్గజ నేతలు పార్టీని నడిపిస్తున్నారు. ఒకప్పుడు జిల్లాలో తిరుగులేని రాజకీయ పట్టు సాధించారు. కానీ ఇప్పుడు అదే పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరడంతో కార్యకర్తలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొందట. జిల్లా అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ మెతక వైఖరితో ఉండటం కూడా వర్గ విభేదాలను అదుపులోకి తేవడంలో ప్రతికూలంగా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధినాయకత్వం సైతం ఈ అంతర్గత పోరుపై గట్టిగా దృష్టి సారించకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంటోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పార్టీకి అసలు పరీక్షగా మారాయి. మున్సిపాలిటీలు, మండల, జిల్లా పరిషత్‌తోపాటు సర్పంచ్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని స్థానాలలో కూడా పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపి గెలుపు లక్ష్యంగా పనిచేయాల్సి ఉంది. ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జీలకు, పార్టీ జిల్లా ముఖ్యనేతలకు కూడా దిశానిర్దేశం చేసారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాలలో నేతల మధ్య విభేదాలు చాప కింద నీరులా కొనసాగుతుండడంతో బలమైన టీడీపీ కూటమిని వైసీపీ ఎలా ఎదుర్కొంటుందన్న ప్రశ్నలు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో ధర్మాన ప్రసాదరావు వరస మీటింగులు పెడుతున్నప్పుడు సీనియర్లను కాదని జూనియర్లతో అంట కాగుతున్నారని టాక్. జిల్లాలో రాబోయే సంస్థగా ఎన్నికల్లో తన ఆధిపత్యం ఉండేలా పావులు కడుపుతున్నారని వినపడుతోంది.

శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు ఇచ్చాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస మున్సిపాలిటీలకు ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకోవడంతో జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది. కోర్టు కేసుల కారణంగా శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస మున్సిపాల్టీలలో ప్రక్రియ ముందుకు సాగనప్పటికీ పలాస-కాశీబుగ్గ, ఇచ్చాపురం మున్సిపాల్టీలలో వార్డుల పునర్విభజన, ఓటర్ల డ్రాప్టును విడుదల చేసారు. ఎన్నికలలో తలపడేందుకు ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఆశావహులు తెరమీదకి వస్తున్నారు. వైసీపీలో మాత్రం ముందుగా ఇంటిపోరు చల్లార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఇచ్చాపురంలో కొత్త ఇన్చార్జి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ వర్గాల మధ్య విభేదాలపై చర్చ సాగుతోంది. పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిబాబు మధ్య దూరం పార్టీకి తలనొప్పిగా మారిందట. టెక్కలిలో పేరాడ తిలక్‌కు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉందనే ప్రచారం ఉంది. ఆమదాలవలసలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, చింతాడ రవికుమార్ వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయట. ఎచ్చెర్లలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్‌కు వ్యతిరేకంగా స్థానిక వైసీపీ నేతల వర్గం పనిచేస్తోంది. సీతారాంపై కిరణ్ కుమార్.. చేసిన వ్యాఖ్యలకు తమ్మినేని కొడుకు కూడా దీటుగానే సమాధానం చెప్పడంతో కాపు వర్సెస్ కాళింగగా మాటల యుద్ధం మారే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయట. పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, మామిడి శ్రీకాంత్ వర్గాల మధ్య విభేదాలు.. అలా ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకం అంతర్గత పోరు కొనసాగుతోంది.

ధర్మాన సోదరుల సొంత నియోజకవర్గాలైన సెకండ్ కేడర్ లేకపోవడం, అలాగే ఎవరినీ ఎదగనీయకపోవడం వల్ల నరసన్నపేట, శ్రీకాకుళం నివురుగప్పిన నిప్పు చందాన ఉందన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. అవకాశం వస్తే కొంతమంది శ్రీకాకుళం నరసన్నపేటలో వారసులకి పక్కనపెట్టి తాము కూడా రంగంలోకి దిగగలమని కొంతమంది ఎదురుచూస్తున్నారనేది విశ్వసనీయమైన సమాచారం. ఏమాత్రమైనా నియోజకవర్గాల్లో సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిస్తే వారి మెడపై కత్తి వేలాడే అవకాశాలు ఉన్నాయని భయంతో ఈ రెండు నియోజకవర్గాల్లోని ద్వితీయ శ్రేణిలో సీనియర్ నాయకులు మిన్నకు ఉండిపోతున్నారట. ఈ రెండు నియోజకవర్గాలు తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీలో అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉన్నాయనే చర్చ లేకపోలేదు. నేతలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటుంటే.. కూటమి అభ్యర్థులపై సమష్టిగా ఎలా పోరాడగలరన్నది కార్యకర్తల ప్రశ్న. స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో మరో కీలక సమరం ముందున్న వేళ.. వైసీపీకి బయట ప్రత్యర్థి కూటమి కంటే ముందుగా లోపలి వర్గ పోరే పెద్ద సవాలుగా మారిందా..? అన్న చర్చ సిక్కోలు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్