Burning Topic: ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం!

Burning Topic: అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ షాక్ తగిలింది. యూఎస్ఐసీఎస్ (USCIS) ఫామ్ I-485లో కీలక మార్పులు చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 Aug 2026 7:38 AM IST
Burning Topic
X

Burning Topic: ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం!

Burning Topic: అగ్రరాజ్యంలో శాశ్వత నివాసం పొందాలని భావిస్తున్న వారికి రానున్న రోజుల్లో కష్టాలు మరింత పెరగనున్నాయి. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది.

ఇందు కోసం ఉపయోగించే కీలకమైన ఫామ్ I-485లో మార్పులు చేసినట్లు వెల్లడించింది. ఈ మార్పు తర్వాత పాత ఎడిషన్ ఫారాలు సమర్పిస్తే వాటిని తిరస్కరిస్తామని హెచ్చరించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో 2022లో తీసుకొచ్చిన పబ్లిక్ ఛార్జ్ నిబంధనను రద్దు చేస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 18 నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. దీంతో గ్రీన్ కార్డ్ పొందాలని భావిస్తున్న భారతీయ వలసదారులతో పాటు ఇతర దేశాల వారికి రానున్న రోజుల్లో కష్టాలు మరింత పెరగనున్నాయని చెబుతున్నారు.

గ్రీన్‌కార్డు కోసం రూపొందించిన కొత్త నిబంధనల ప్రకారం అమెరికా ప్రభుత్వం అందించే వైద్య సాయం, ఉచిత రేషన్, ఇతర రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం పొందే వలసదారులకు ఇబ్బందులు తప్పవు.

అమెరికాకు వచ్చే వారు అక్కడ స్వయం సమృద్ధి సాధించాలి తప్ప, పన్ను చెల్లింపుదారుల సొమ్ముపై ఆధారపడకూడదనేది దీని ఉద్దేశం. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం కేవలం రెండు రకాల ప్రభుత్వ సాయం పొందిన వారిని మాత్రమే పబ్లిక్ ఛార్జ్ కింద పరిగణించి గ్రీన్ కార్డు దరఖాస్తుల్ని తిరస్కరించేవారు.

ఇందులో జీవనోపాధి కోసం ప్రభుత్వ ఇచ్చే నగదు సహాయం, ప్రభుత్వ ఖర్చుతో దీర్ఘకాలం ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందడాన్ని ప్రతికూల అంశాలుగా పరిగణించేవారు. ఇప్పుడు ప్రభుత్వం అందించే ఉచిత వైద్యం రేషన్ లేదా ఆహార సాయం, ఫ్రీ హౌసింగ్ వోచర్లు, కాలేజీకి ఆర్థిక సాయం వంటి ఏ రకమైన ప్రభుత్వ పథకాన్ని పొందినా గ్రీన్ కార్డు పొందడంలో అడ్డంకులుగా ఉన్నాయి.

గ్రీన్ కార్డు దరఖాస్తు దారుల విషయంలో కేవలం ప్రభుత్వ సాయాన్ని మాత్రమే కాకుండా, దరఖాస్తుదారుల వయస్సు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ ఆర్థిక స్థితి, చదువు, ఉద్యోగ నైపుణ్యాలు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సాయం అందుతుందా లేదా అన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

ఒకవేళ భవిష్యత్తుల్లో దరఖాస్తుదారుడు ప్రభుత్వ సహాయంపై ఆధారపడతారని, ప్రభుత్వానికి భారంగా మారతారని భావించినా, వారి అభ్యర్థనను కూడా తిరస్కరించే అధికారం ఇమిగ్రేషన్ అధికారులకు కల్పించింది ట్రంప్ ప్రభుత్వం.

అయితే కొన్ని వర్గాల వారికి ఈ నిబంధనల నుంచి మినహాయింపు కల్పించింది. మానవతా దృక్పథంతో ఇచ్చే వీసాలు పొందిన వారికి ఇక్కడ ఊరట లభించింది. వీరిలో శరణార్థులు, ఆశ్రయం పొందిన వారు, మానవ అక్రమ రవాణా బాధితులు, నేరాల బారిన పడిన బాధితులు, గృహ హింసకు గురైన మహిళలు , అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేసిన అఫ్గాన్​, ఇరాక్ పౌరులు ఉన్నారు.

డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం భారతీయ గ్రీన్ కార్డు దరఖాస్తుదారులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. శాశ్వత పౌరసత్వం కోసం ఎక్కువగా నిరీక్షించే వారిలే భారతీయులే ఉన్నారు.

2023 గణాంకాల ప్రకారం అమెరికాలో ఆ ఏడాది దాదాపు 12 లక్షల మంది గ్రీన్ కార్డులు పొందగా, 78100 మందికిపైగా దాదాపు 7 శాతం భారతీయులే ఉన్నారు. ఇక్కడ గ్రీన్ కార్డు పొందిన భారతీయుల్లో దాదాపు 60 శాతం మంది అమెరికా పౌరుడు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్‌కు నేరుగా బంధువులుగా లేదా అమెరికా పౌరుడి ఇతర కుటుంబ సభ్యులుగా గ్రీన్ కార్డు పొందారు.

ఇక ఈ కొత్త నిబంధనల భయంతో సుమారు 14 లక్షల నుంచి 41 లక్షల మంది నాన్- సిటిజెన్ కుటుంబాలు, తమ పిల్లలు లేదా బంధువుల కోసం వాడుతున్న ఉచిత వైద్య పథకాలు, ఇతర ప్రభుత్వ సేవల్ని రద్దు చేసుకునే అవకాశం ఉందని కేజర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నివేదిక అంచనా వేస్తోంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story