Off The Record: దూసుకొస్తున్న సూర్ ఎల్ నినో .. రైతులకు బిగ్ షాక్?
Off The Record: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల జాప్యంపై తాజా అప్‌డేట్.
Off The Record: దూసుకొస్తున్న సూర్ ఎల్ నినో .. రైతులకు బిగ్ షాక్?
Off The Record: దేశంలోకి ముందుగానే ప్రవేశించి రైతుల్లో ఆశలు నింపిన నైరుతి రుతుపవనాలు.. ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తున్నాయి. జూన్ 4న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు.. తొలి దశలో వేగంగా విస్తరించినప్పటికీ, ఆ తర్వాత వాటి కదలికలు పూర్తిగా స్తంభించిపోయాయి. సర్వసాధారణంగా ఏటా జూన్ మధ్య నాటికి దేశంలోని చాలా ప్రాంతాలకు విస్తరించాల్సిన రుతుపవనాలు.. ఈసారి మధ్యలోనే స్తంభించడంతో వర్షపాత లోటు తీవ్రంగా పెరిగిందనే చెప్పొచ్చు. మరోవైపు ఎల్‌నినో, సూపర్ ఎల్ నినో ప్రభావం, వాతావరణ మార్పులు, బలహీనమైన సముద్ర గాలులు కలిసి రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
జూన్ 4న కేరళ తీరంలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. జూన్ 15 నాటికి దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాలను తాకాయి. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా వాటి పురోగతి ఆగిపోయింది. జూన్ 1 నుంచి జూన్ 17 వరకు దేశవ్యాప్తంగా సాధారణంతో పోలిస్తే 38 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దేశానికి అన్నపూర్ణగా భావించే మధ్య భారతదేశంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. అక్కడ ఏకంగా 62 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రుతుపవనాల అరేబియా సముద్ర శాఖ జూన్ 8 నుంచి దాదాపు ఒకే ప్రాంతంలో నిలిచిపోగా, బంగాళాఖాతం శాఖ మాత్రమే కొద్దిపాటి చురుకుదనం ప్రదర్శిస్తోంది. జూన్ 23 వరకు కూడా రుతుపవనాల పురోగతిలో పెద్దగా మార్పు కనిపించే సూచనలు లేవని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
రుతుపవనాల బలహీనతకు ప్రధాన కారణంగా ఎల్ నినో అని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే ఈ వాతావరణ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా వర్షపాత విధానాలను ప్రభావితం చేస్తుందట. మరోవైపు అమెరికా వాతావరణ సంస్థలు కూడా ఇప్పటికే ఎల్‌నినో పరిస్థితులు బలపడుతున్నాయని ప్రకటించాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో మేఘాల ఏర్పాటుకు, వర్షాల కురిసేందుకు కీలకమైన ఈ వ్యవస్థ ప్రస్తుతం హిందూ మహాసముద్రానికి దూరంగా ఉండటంతో భారతదేశానికి పెద్దగా ప్రయోజనం కలగడం లేదట. ఉత్తర భారతదేశంలో ఏర్పడిన బలమైన పశ్చిమ అలజడుల కారణంగా పొడి గాలులు దక్షిణ దిశగా విస్తరించి తేమతో కూడిన గాలులను అడ్డుకుంటున్నాయట. దీంతో మేఘాలు ఏర్పడే ప్రక్రియ దెబ్బతింటోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా హిందూ మహాసముద్రం నుంచి భారతదేశానికి భారీగా తేమను తీసుకొచ్చే గాలులు ఈసారి బలహీనంగా ఉండటంతో రుతుపవనాలకు అవసరమైన శక్తి అందడం లేదని లెక్కలు వేస్తున్నారు వాతావరణ నిపుణులు. ఇండియన్ ఓషన్ డైపోల్ తటస్థ స్థితిలో ఉండటం కూడా మరో కారణమంటున్నారు. ఇది పాజిటివ్ దశలో ఉంటే భారతదేశంలో వర్షపాతం పెరగడానికి దోహదపడుతుందట. కానీ ప్రస్తుతం తటస్థంగా ఉండటంతో రుతుపవనాలకు అదనపు బలం లభించడం లేదని చెబుతున్నారు.
దేశంలోకి తేమతో కూడిన గాలులు ప్రవేశిస్తున్నప్పటికీ వర్షాలు మాత్రం పడటం లేదు. దీనికి ప్రధాన కారణం 'అట్మాస్ఫిరిక్ సబ్సిడెన్స్' అని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. "గాలి పైకి ఎగసి మేఘాలు ఏర్పడే బదులు కిందికి అణచివేస్తోందన్న మాట. దీంతో మేఘాలు అభివృద్ధి చెందలేకపోతున్నాయట. అలాగే బంగాళాఖాతం నుంచి వచ్చే గాలులు, అరేబియా సముద్రం నుంచి వచ్చే గాలులు సరైన విధంగా కలవడం లేకపోతున్నాయంటున్నారు. ఫలితంగా రుతుపవన ద్రోణి ఆకారం కూడా మారిపోయిందట.
ప్రస్తుతం ప్రపంచం మరో బలమైన ఎల్‌నినో దిశగా అడుగులు పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిని గాడ్జిల్లా ఎల్‌నినోగా చెబుతున్నారు. దీన్నే సూపర్ ఎల్‌నినో కూడా అంటారు. సాధారణంగా ఎల్‌నినో 2 నుంచి 7 ఏళ్ల మధ్య వ్యవధిలో పునరావృతమవుతుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇది అత్యంత బలంగా మారి ప్రపంచ వాతావరణ వ్యవస్థను కుదిపే ప్రమాదం ఉందట. అయితే భారత్ వంటి వ్యవసాయ ఆధారిత దేశాలు ఎల్‌నినో ప్రభావానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందట. కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది.
ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలను ధాన్యాగారాలుగా పరిగణిస్తారు. దీంతో ఆయా రాష్ట్రాల రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు ఐఎండీ సూచనలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షాలపై స్పష్టత వచ్చే వరకు విత్తనాలు, ఎరువులు పెద్ద ఎత్తున వినియోగించకుండా జాగ్రత్త పడాలని హితవు చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ జూన్ చివరి వారంలో రుతుపవనాలు చురుకుగా మారే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అయితే అప్పటి వరకు దేశవ్యాప్తంగా రైతులు, ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.




