Burning Topic: సువేందు అధికారి ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ఇదే!
Burning Topic: పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతల స్వీకారం! బీజేపీ చారిత్రాత్మక విజయం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి?
Burning Topic: సువేందు అధికారి ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ఇదే!
Burning Topic: పశ్చిమ బెంగాల్‌లో తొలిసారిగా జాతీయవాద ప్రభుత్వం ఏర్పడింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ అధికారాన్ని చేపట్టింది. కోల్‌కతా బ్రిగేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, బీజేపీ-ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు. ప్రమాణస్వీకారానికి ముందు ఓ వాహనంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సువేందు అధికారి వేదిక వద్దకు వచ్చారు. వేదిక మీద రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి మోదీ నివాళులర్పించారు. అనంతరం పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారిచే గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం దిలీప్ ఘోశ్, అగ్నిమిత్రా పాల్, అశోక్ కీర్తనియా, నితీశ్ ప్రామాణిక్, క్షుదిరామ్ టుడూ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు (
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకోగా టీఎంసీ 80 స్థానాలకే పరిమితమైంది. సువేందు అధికారి నందిగ్రామ్, భవానీపూర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి ఈ సారి అంతకంటే ఎక్కువ మెజార్టీతో భవానీపూర్‌లోనూ ఓడించారు. బీజేపీ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన 55 ఏళ్లసువేందు అధికారికే ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. దీంతో బెంగాల్‌లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. బెంగాల్‌లో ఇక సోనార్ బంగ్లా యుగానికి అధికారికంగా శ్రీకారం చుట్టామని సువేందు తన ఎక్స్ అకౌంట్ సందేశంలో తెలిపారు.స్వాతంత్ర్యం తర్వాత బెంగాల్‌లో తొలి బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుండటం ద్వారా మన స్థాపకుల కలలను సాకారం చేస్తున్నాం అని వెల్లడించారు సువేందు (Suvendu Adhikari on X )
సువేందు అధికారి 1970 డిసెంబర్ 15న బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్ జిల్లా కాంతిలో జన్మించారు. కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉండడంతో చిన్నప్పటి నుంచీ వాటిని వంటబట్టించుకున్నారు. సువేందు అధికారి తండ్రి శిశిర్ అధికారి మన్మోహన్‌సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. సువేందు అధికారి 1995లో కాంగ్రెస్ తరఫున కాంథీ మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1998లో మమతా బెనర్జీ స్థాపించిన టీఎంసీలో చేరారు. 2006లో తొలిసారి కాంథీ దక్షిణ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో తమలుక్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.సువేందు అధికారి రాజకీయ జీవితంలో నందిగ్రామ్ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. 2007లో నందిగ్రామ్‌లో వేలాది ఎకరాల్లో సెజ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ఆయన నాయకత్వం వహించారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంలో సఫలీకృతమయ్యారు.
మమతా బెనర్జీ ప్రభుత్వంలో రవాణా, నీటిపారుదల, పర్యావరణ శాఖల మంత్రిగా సువేందు బాధ్యతలు నిర్వర్తించారు. మమతా బెనర్జీ ప్రధాన అనుచరుడిగా పార్టీలో రెండో శక్తిమంతమైన నేతగా ఎదిగారు. కాగా మమతా బెనర్జీతో సువేందు అధికారికి క్రమేనా విభేదాలు ఏర్పడ్డాయి. పార్టీలో అంతర్గత రాజకీయాలు, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడంతో సువేందు అధికారి 2020లో టీఎంసీని వదిలేసి అమిత్ షా సమక్షంలో BJP లో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో తనపై పోటీకి దిగిన సీఎం మమతా బెనర్జీని ఓడించి సంచలనం సృష్టించారు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 77 సీట్లకే పరిమితమైనా.. ఆయన బెంగాల్ అసెంబ్లీలో విపక్ష నేతగా ఎన్నికయ్యారు. తృణమూల్ బలాలు, బలహీనతలు తెలిసిన సువేందు అధికారి బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారు. తూర్పు మేదినీపూర్, నందిగ్రామ్‌లలో సువేందు కుటుంబానికి బలమైన పట్టు ఉంది. మమతా బెనర్జీ తరహాలోనే ఆయన తన పోరాట పంథా కొనసాగించారు
పశ్చిమ బెంగాల్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసినవారు అగ్రవర్ణాలకు చెందినవారే. ముఖ్యంగా బ్రాహ్మణ, కాయస్థ కులాలకు చెందినవారే అధికారం చెలాయించారు. అయితే బీజేపీ బీసీ వర్గంలోని మహిష్యా కులానికి చెందిన సువేందు అధికారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. దీంతో బెంగాల్ తొలి ఓబీసీ సీఎంగా ఆయన రికార్డును సృష్టించారు. రాష్ట్ర జనాభాలో సుమారు 10 శాతానికిపైగా మహిష్యా కులస్తులు ఉన్నారు. ఆయనకు సీఎంగా అవకాశాన్ని ఇవ్వడం ద్వారా మహిష్యా కులస్తులతో పాటు యావత్ ఓబీసీ వర్గం మనసులను బీజేపీ గెల్చుకుంది. సువేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిష్య సామాజిక వర్గం దక్షిణ బంగాల్‌లో బీజేపీకి అండగా నిలిచింది. . వీరు మేదినీపుర్ ప్రాంతంలో, దక్షిణ బంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఉన్నారు. సువేందు అధికారి తనను తాను ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన భూమిపుత్రుడిగా చిత్రించుకోవడంలో సఫలమయ్యారు.
బెంగాల్‌లో హిందూ ఓట్లు భారీగా ఏకీకృతం కావడంతో బీజేపీ భారీ విజయం సాధించగలిగింది. మైనారిటీల ప్రాబల్యం ఉన్న మాల్దా, ముర్షిదాబాద్ ప్రాంతాల్లో బీజేపీ తన సీట్ల సంఖ్యను రెట్టింపు చేసుకుంది. సువేందు అధికారి క్షేత్రస్థాయిలో అమలు చేసిన వ్యూహాల వల్లే ఇది సాధ్యమైంది. ఈ ఎన్నికలు బెంగాలీ హిందూ గుర్తింపును కాపాడే పోరాటమని ప్రచారం సందర్భంగా సువేందు చేసిన వ్యాఖ్యలు ప్రభావవంతంగా వెళ్లాయి. గతంలో కులాల వారీగా విడిపోయిన హిందూ ఓటర్లను ఏకతాటిపైకి తెచ్చి బీజేపీకి ఓటు వేసేలా చేయడంలో సువేందు సక్సెస్ అయ్యారు. బంగాల్ ఎన్నికల్లో మహిష్యులు, మతువా, రాజబన్షీ కులాల వారు బీజేపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా మారారు. వీరిలో చాలామంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తారు. ఇప్పటివరకు బీజేపీ ఎక్కువగా పట్టణాలు, నగరాల్లో పార్టీ బలోపేతంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. సువేందు అధికారిని సీఎం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాలపైకి ఫోకస్‌ను మళ్లిస్తామనే స్పష్టమైన సంకేతాలను బీజేపీ పెద్దలు ఇచ్చారు.




