Burning Topic: ముంచుకొస్తున్న స్వైన్ ఫ్లూ!

Burning Topic: దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ (H1N1) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. లక్షణాలు, ప్రభుత్వ హెచ్చరికలు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 Aug 2026 6:38 AM IST
Burning Topic
X

Burning Topic: ముంచుకొస్తున్న స్వైన్ ఫ్లూ!

Burning Topic: వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి సీజనల్ వ్యాధుల తీవ్రత గణనీయంగా పెరిగింది. దేశ వ్యాప్తంగా గత కొద్ది వారాలుగా స్వైన్ ఫ్లూ కేసుల పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఈ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి.

ఢిల్లీలోని అన్ని ప్రముఖ ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరిగింది. ప్రతీ 20 మంది ఔట్ పేషంట్ రోగుల్లో 15 మందికి హెచ్‌1ఎన్‌1 పాజిటివ్‌గా తేలుతోందని డాక్టర్లు చెబుతున్నారు. వైరస్ జెనెటిక్ మ్యుటేషన్ లేదా ప్రజల మధ్య సంబంధాలు పెరగడం వల్ల ఈ తీవ్రత ఉండి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

గత ఏడాది ఆగస్టు 20 తేదీ నాటికి 200 స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదు కాగా ఈ ఏడాది వాటి సంఖ్య 8 రెట్లు పెరిగిందంటున్నారు. ఢిల్లీలో ఈ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటివరకు 3,300 స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదు కావడం ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగాన్ని కలవరపెడుతోంది.

దేశ రాజధానితో పాటు పరిసర రాష్ట్రాల్లో స్వైన్ ఈ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన మందులు, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పలువురు మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

స్వైన్‌ ఫ్లూ వ్యాప్తి తీరు, ఆస్పత్రుల్లో బాధితులకు అందుతున్న వైద్య సేవలు, ఔషధాల లభ్యత తదితర అంశాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య మరింత పెరిగితే, దానికి అనుగుణంగా అదనపు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.

స్వైన్‌ ఫ్లూ పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్‌ సింగ్‌ చెబుతున్నారు. మరోవైపు కర్ణాటకలో కూడా స్వైన్‌ఫ్లూ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 4,212 కేసులు నమోదయ్యాయి. ఇందులో సగానికి పైగా కేసులు బెంగళూరులోనే వెలుగు చూశాయి.

బెంగళూరు వాతావరణం కారణంగా ఇక్కడ శ్వాసకోశ సంబంధిత వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువకాలం ప్రభావాన్ని చూపుతాయని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ స్వైన్‌ ఫ్లూ కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 364 కేసులు నమోదవ్వగా, లక్నోలో ఒక మహిళ మరణించడంతో 75 జిల్లాల ఆసుపత్రులను హై అలర్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం స్వైన్‌ ఫ్లూ నియంత్రణలోనే ఉంది.

గ్రేటర్ హైదరాబాద్‌లో సాధారణ జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పితో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే అధికారికంగా స్వైన్‌ ఫ్లూ కేసులు ఏవీ ఇంకా నిర్ధారణ కాలేదు

గత కొన్నేళ్లుగా మన దేశంలో స్వైన్ ఫ్లూ కేసులు ఓ నియంత్రణలోనే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం వైరస్‌లో జరిగే జన్యుపరమైన మార్పులు . నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ రిపోర్టుల ఆధారంగా చూస్తే, గతేడాది H3N2 వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండగా, ఈ ఏడాది H1N1 రకం వైరస్ అత్యంత బలంగా దాడి చేస్తోంది.

కరోనా మహమ్మారి తర్వాత.. చైనా, జపాన్ వంటి తూర్పు ఆసియా దేశాల్లో పిల్లలు, వృద్ధులలో శ్వాసకోశ వ్యాధులు అనూహ్యంగా పెరిగాయి. సుదీర్ఘ లాక్‌డౌన్ల వల్ల ప్రజల్లో సహజ సిద్ధమైన రోగనిరోధక శక్తి తగ్గడం, సరికొత్త జన్యు మార్పులతో వైరస్‌లు దాడి చేయడం వల్ల అక్కడ కేసులు ఎలాగైతే పెరిగాయో, మన దేశంలో కూడా అదే తరహా పరిస్థితి నెలకొంటోంది.

వాతావరణ మార్పులు, రుతుపవనాల వల్ల పెరిగిన విపరీతమైన తేమ కారణంగా వైరస్ గాలిలో ఎక్కువ సమయం జీవించి, రద్దీ ప్రాంతాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. స్వైన్‌ ఫ్లూ.. దీన్ని వైద్య పరిభాషలో హెచ్‌1ఎన్‌1గా కూడా పిలుస్తారు. ఇది ఇన్‌ఫ్లుయెంజా-A అనే వైరస్ వల్ల వచ్చే అత్యంత వేగంగా వ్యాపించే శ్వాసకోశ అంటువ్యాధి.

వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు నోటి నుంచి వెలువడే తుంపర్ల (respiratory droplets) ద్వారా గాలిలో కలిసి ఇతరులకు వ్యాపిస్తుంది. అలాగే చేతులతో ముక్కు, కళ్లు, నోరు తాకడం ద్వారా కూడా ఇది సోకుతుంది.

సాధారణ జలుబు కంటే ఇది ప్రమాదకరమైనది. జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, అలసట, చలి దీని ప్రాథమిక లక్షణాలు. రోగుల్లో ఆక్సిజన్ స్థాయిలు వేగంగా పడిపోవడం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, కండరాల నొప్పి, విరేచనాలు వంటి తీవ్రమైన లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి.

స్వైన్ ఫ్లూకి అత్యంత సమర్థమైన వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ప్రతి సంవత్సరం అప్‌డేట్ అయ్యే సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ ) ఈ H1N1 వైరస్‌ను కూడా సమర్థంగా ఎదుర్కొంటుంది. స్వైన్ ఫ్లూ వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. .. రద్దీగా ఉండే ప్రదేశాల్లో తప్పనిసరిగా సర్జికల్ లేదా N95 మాస్క్ ధరించాలి.

దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నవారికి కనీసం 6 అడుగుల దూరంలో ఉండాలి. షేక్ హ్యాండ్ ఇవ్వడం పూర్తిగా మానుకోవాలి. తరచుగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించాలి. డయాబెటిస్, గుండె జబ్బులు, ఆస్తమా ఉన్నవారు, గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.

ఇన్ఫెక్షన్ సోకితే నిమోనియాగా మారే ప్రమాదం ఎక్కువ. సాధారణ జలుబే కదా అని తేలికగా తీసుకోకుండా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా వరుసగా 3 రోజులకు పైగా జ్వరం ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం అవసరం. దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో డాక్టర్‌ని సంప్రదించి ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేయించుకోవడం మంచిది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story