Off The Record: తాడిపత్రిలో పొలిటికల్ హీట్!
Off The Record: తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల వేళ మళ్లీ వేడెక్కిన రాజకీయం. జేసీ ప్రభాకర్ రెడ్డి ధీమా, కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యూహాలు. సవాల్‌గా మారిన 36 వార్డుల పోరుపై ప్రత్యేక కథనం.
Off The Record: తాడిపత్రిలో పొలిటికల్ హీట్!
Off The Record: గత మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ విజయం సాధిస్తే.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ జెండా రెపరెపలాడింది. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సమాయాత్తం అవుతున్న సమయంలో తాడిపత్రిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరికి వారు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కొంత కాలంగా స్థానిక రాజకీయ పరిణామాలను పర్యవేక్షిస్తున్నారు. కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తూ మున్సిపల్ వార్డుల్లో పార్టీ నేతలు, టికెట్ ఆశిస్తున్న వారితోనూ సంప్రదింపులు జరుపుతున్నారట.
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం అని జేసీ ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థులు, పోలీసుల తీరుపైన ఆయన పదే పదే ప్రజలకు వివరిస్తున్నారు. గత ప్రభుత హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరిగాయో వివరిస్తున్నారు. అప్పట్లో పోలీసులు వ్యవహరించినట్లే వచ్చే ఎన్నికల్లోనూ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు కేసులతో తనను జైలులో ఉంచారని.. జైలు నుంచే నామినేషన్లు వేసి గెలిచానని గతాన్ని వివరిస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అప్పట్లో టీడీపీ కౌన్సిలర్లను తరిమికొట్టారని.. కొన్ని వార్డుల్లో నామినేషన్ వేయనీయలేదనీ చెబుతున్నారు. అప్పట్లో ఏకగ్రీవం అయిన వార్డులు, పంచాయతీలు, ఇప్పుడు కూడా ఏకగ్రీవం కావాల్సిందేనని.. అందుకోసం సీఎం చంద్రబాబు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన తనయుడు ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించాలని చూశారని.. అందుకోసం అన్ని ప్రయత్నాలు చేశారని ఆరోపిస్తున్నారు జేసీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాడిపత్రిలో వైసీపీకి కేడర్ లేకుండా పోయిందని.. సరైన నాయకులు ఆ పార్టీలో లేరని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మున్సిపాలిటీతోపాటు అన్ని స్థానాలను స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినేత ఆదేశాలతో వైసీపీ ఎన్నికలకు అదే స్థాయిలో సమాయాత్తం అవుతోందట. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆద్వర్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేడర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు.
తాడిపత్రి మున్సిపాలిటీతోపాటు అన్ని మండలాలు, పంచాయతీల్లో ఎన్నికల బరిలో వైసీపీ అభ్యర్థులు నిలబడేలా వారిని సన్నద్ధం చేస్తున్నారట పెద్దారెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొని గెలిచే అభ్యర్థులను బరిలో దించాలని భావిస్తున్నారట. జేసీ కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నవారు.. పార్టీలో ముందు నుంచి క్రియాశీలకంగా వ్యవహరించిన గట్టి నేతలు, కార్యకర్తలకు ఎన్నికల్లో అవకాశం ఇవ్వనున్నారట. కూటమి ప్రభుత్వ తీరుపైనా.. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు పెద్దారెడ్డి. రానున్న ఎన్నికల్లో టీడీపీతో తలపడేందుకు ఆయన సన్నద్ధమయ్యారట. టీడీపీకి బలం ఉన్న వార్డుల్లోనూ గట్టి పోటీ ఇవ్వాలని వైసీపీ భావిస్తోందట. అందులోభాగంగా ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తోందట.
తాడిపత్రి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. వార్డుల విభజన పూర్తయితే 42కు పెరుగనున్నాయని అధికారులు చెబుతున్నారు. పట్టణంలో సుమారు 81 వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ విజయం సాధించింది. తాడిపత్రిలో మాత్రం టీడీపీ విజయకేతనం ఎగరేసింది. ఎన్నికల్లో టీడీపీకి చెందిన 18 మంది, వైసీపీ నుంచి 16 మంది, సీపీఐ తరఫున ఒక్కరు, స్వతంత్ర అభ్యర్థి ఒక్కరు విజయం సాధించారు. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో మున్సిపల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది.
అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన అప్పటి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొంది జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. ఐదేళ్లు ఛైర్మన్‌గా కొనసాగారు. గతంలో వైసీపీ రెండు స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లోనూ గతంలో జరిగిన విధానాన్నే అనుసరిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. రెండు పార్టీల నేతలు ఇప్పటికే తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో కసరత్తు చేపట్టారు. వైసీపీ అధిష్టానం ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అన్న పంథాలో వెళ్లాలని భావిస్తున్న తరుణంలో తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు మరింత పొలిటికల్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఎలాంటి ఫలితాలు వస్తాయో..? ఎవరిని విజయం వరిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.




