Burning Topic: తమిళనాడు రాజకీయాలను షేక్ చేస్తున్న విజయ్
Burning Topic: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం! సీఎం విజయ్ చేపట్టిన 'ఆపరేషన్ ఎల్'తో అన్నాడీఎంకేకు పెద్ద షాక్.
Burning Topic: తమిళనాడు రాజకీయాలను షేక్ చేస్తున్న విజయ్
Burning Topic: తమిళనాడులో రాజకీయ పరిణామాలు రోజు రోజుకీ కొత్త మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తక్కువ కాలంలోనే విజయ్ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మార్క్ 118 ను సాధించలేకపోయింది. దీంతో కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, వామపక్షల మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రి కావడం తెలిసింది. వీరిలో లెఫ్ట్ పార్టీలు మినహా మిగిలిన పక్షాలకు మంత్రివర్గంలోనూ చోటు కల్పించారు. అయితే ఐదేళ్ల పాటు ఈ పార్టీల దయాదాక్షిణ్యాలపైనే ప్రభుత్వాన్ని నడపాల్సి రావడం విజయ్‌కు కొంత అసంతృప్తిని కలిగించినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన తన మార్క్ రాజకీయాన్ని మొదలుపెట్టారు. విజయ్ వ్యూహానికి బలైంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు కావడం గమనార్హం.
అసెంబ్లీ ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు శిబిరాలుగా విడిపోవడం తెలిసిందే. మొత్తం 47 మందికిగాను పళణి స్వామి వర్గంలో 22 మంది, సీనియర్ నేతలు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి నేతృత్వంలో 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు ఈ నెల 13న టీవీకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేశారు. దీంతో శాసనసభా పక్షం, విప్ హోదాపై వివాదం కొనసాగుతోంది. ఇదే సమయంలో అన్నాడీఎంకేకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మరగాథం కుమరవేల్, పి. సత్యభామ, ఎస్. జయకుమార్, ఈసక్కి సుబయ్య తమ పదవులకు రాజీనామా చేసి, అధికార తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరడం రాష్ట్రవ్యాప్తంగా పెను తుఫానును రేపింది. వీరు స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు రాజీనామా లేఖలను సమర్పించారు. వాటిని ఆయన వెంటనే ఆమోదించడం, టీవీకే ముఖ్య నేత, మంత్రి ఆధవ్ అర్జున సమక్షంలో ఆ పార్టీలో చేరడం చకచకా జరిగిపోయాయి.
అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకునే దిశగా సీఎం విజయ్ చేపట్టిన రాజకీయ వ్యూహమే 'ఆపరేషన్ ఎల్' అని చెబుతున్నారు. ఎల్ అంటే అన్నాడీఎంకే గుర్తు రెండాకులను సూచిస్తుంది. లేదా లాటరీ అని చెబుతున్నారు. అంటే అన్నా డీఎంకే పార్టీని ఒక్కో ఆకుగా విడగొడుతూ తమ పార్టీలో చేర్చుకోవడం. విజయ్ ఇచ్చిన ఈ స్ట్రోక్‌తో డీఎంకే, అన్నాడీఎంకే మాత్రమే కాకుండా.. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్ పార్టీలు సైతం ఈ పరిణామంతో తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి. ప్రస్తుతం కూటమి మద్దతుతో ప్రభుత్వం సురక్షితంగా ఉన్నప్పటికీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారనే చర్చ మొదలైంది. క్రమంగా బలాన్ని పుంజుకునే దిశగా విజయ్ వ్యూహాలకు పదును పెట్టినట్టుగా చెబుతున్నారు. తాజాగా ఐదు స్థానాలు ఖాళీగా ఉండటంతో ఉప ఎన్నికలలో వీటిని చేజిక్కించుకున్న పక్షంలో ఆ తదుపరి మరి కొందర్ని తమ వైపునకు తిప్పుకునే వ్యూహంతో విజయ్ ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తాజా పరిణామంతో ఖంగుతున్న అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యేలు సొంత గూటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వేలుమణి నేతృత్వంలోని ఎమ్మెల్యేలు పార్టీ అధినేత పళని స్వామి ఇంటికి వెళ్లారు. అన్నాడీఎంకేలో చీలిక లేదని.. భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని వేలుమణి పేర్కొన్నారు. పళనిస్వామి తమ నాయకుడని స్పష్టం చేశారు. కాగా మాజీ మంత్రి షణ్ముగం మాత్రం ఈ సమావేశానికి రాలేదు. తామందరం ఐక్యంగా ఉన్నామని.. మొదట షణ్ముగంను కలిసిన తర్వాత ఇక్కడికి వచ్చామని వేలుమణి తెలిపారు. అనంతరం వేలుమణి బృందం స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసింది. అసెంబ్లీలో అంతా ఒకే పార్టీగా పనిచేస్తామని ఆయనకు లేఖ సమర్పించింది. తిరుగుబాటుదారులు మళ్లీ సొంత పార్టీలోకి తిరిగి రావడంతో వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ కార్యాలయంలో దాఖలు చేసిన దరఖాస్తును పళనిస్వామి ఉపసంహరించుకున్నారు.
అన్నాడీఎంకే ఇప్పుడు రెండు సమాంతర యుద్ధాలు చేస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండగా, మరోవైపు ళనిస్వామి వర్గం తిరుగుబాటు నేతలను మళ్లీ కలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీని కాపాడేందుకు ఇప్పుడు యాంటీ-డిఫెక్షన్ చట్టమే రక్షణ కవచంగా మారిందని చెబుతున్నారు.. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేకు కంచుకోట లాంటి పశ్చిమ తమిళనాడు ప్రాంతానికి చెందినవారు. విజయ్ చరిష్మాతో మళ్ళీ గెలవగలమనే ధీమాతోనే రాజీనామా చేశారు. ఆ ప్రాంతంలో అన్నాడీఎంకే ప్రాబల్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టవచ్చని చెబుతున్నారు. కాగా ఈ పరిణామాలు అధికారంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలకు ఆందోళన కలిగిస్తోంది. అన్నాడీఎంకే రెబెల్స్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న చర్చలపై ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. టీవీకే పూర్తి మెజారిటీ దిశగా సాగితే భవిష్యత్తులో తమ ప్రాధాన్యం తగ్గిపోతుందా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పార్టీలకు టీవీకేని బహిరంగంగా వ్యతిరేకించే పరిస్థితి కూడా లేదు.




