Burning Topic: చక్రం తిప్పిన విజయ్.. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం
Burning Topic: తమిళనాడు ఎన్నికల్లో విజయ్ మ్యాజిక్ చేయబోతున్నారా? లేటెస్ట్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూస్తుంటే దళపతి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Burning Topic: చక్రం తిప్పిన విజయ్.. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం
Burning Topic: ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వేళ తమిళనాడులో అనూహ్య రాజకీయ పరిణమాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో డీఎంకే వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందని అనేక ఎక్సిట్ పోల్స్ అంచనా వేయడం తెలిసిందే. కాగా కొన్ని మాత్రం అన్నాడీఎంకే ఎక్కువ సీట్లు గెలుస్తుందని చెప్పాయి. అదే సమయంలో సినీ నటుడు విజయ్ తమిళగ వెట్రి కగళం పార్టీ రెండంకెలు దాటితే గొప్ప అన్నట్లు కొన్ని సర్వేలు సూచించాయి. యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం టీవీకే ప్రభంజనం సృష్టిస్తుందని, ఏకంగా అధికారం దక్కించుకుంటుందని చెప్పింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీ 98-120 మధ్య సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది సాధారణ మెజారిటీకన్నా ఎక్కువే. దీంతో ఒక్కసారిగా విజయ్ పార్టీలో జోష్ మొదలైంది. తాజా పరిణామాలను డీఎంకే-అన్నాడీఎంకే-టీవీకే పార్టీలు విశ్లేషించుకుంటున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ప్రకారం.. విజయ్ టీవీకే పార్టీకి 35 % ఓట్లు లభించే అవకాశం ఉంది. అధికార అధికార డీఎంకే కూడా అదే స్థాయిలో ఓట్లు లభించనున్నాయి. ఇదే సమయంలో అన్నాడీఎంకే- బీజేపీకి కూటమికి కేవలం 23 % ఓట్ల వాటా మాత్రమే లభిస్తుందని అంచనా. అయితే విజయ్ పార్టీ సాధించే ఓట్లు సీట్ల రూపంలోకి మారాయా? అనేదే చూడాలి. కాగా మెజారిటీ ఎగ్జిట్స్ పోల్స్ డీఎంకే కూటమి 112 నుండి 129 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి 86 నుండి 103 స్థానాలను గెలుచుకుంటుందని అంచనా. జేవీసీ ఎగ్జిట్ పోల్స్... అన్నాడీఎంకే కూటమి 127 నుండి 148 స్థానాలతో స్పష్టమైన మెజారిటీ లభిస్తుందని అంచనా వేసింది. డీఎంకే కూటమి 100 కంటే తక్కువ స్థానాలకు పరిమితం అవుతుందని చెప్పింది. కాగా విశ్లేషకుల అంచనా ప్రకారం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే విజయ్ 'కింగ్‌మేకర్' పాత్ర పోషించే అవకాశం ఉంది.
ఒకవేళ యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ వాస్తవ రూపం దాల్చితే తమిళ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకోనుంది. తమకే అధికారం ఖాయమని టీవీకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే అప్పుడే తొందర పడొద్దని సూచించారు విజయ్. ఇటీవలి దాకా బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణించిన విజయ్, ఇప్పుడు ఎన్డీఏ కూటమితో చేతులు కలుపుతున్నారా అనే చర్చ ఊపందుకుంది. కాగా ఎన్నికలకు ముందు విజయ్ ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. అధికారంలో భాగం కోరుకునే పార్టీలను తాము ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికలకు ముందు విజయ్ పార్టీతో పొత్తు కోసం బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రయత్నించాయి. టీవీకే–అన్నా డీఎంకే కలిసి పని చేస్తాయనే ప్రచారం కూడా జరిగింది. ఇది ఇరు పార్టీల శ్రేణుల్లో గందరగోళానికి దారి తీయడంతో.. అలాంటిదేం ఉండబోదని కీలక నేతలు చెప్పుకోవాల్సి వచ్చింది. నిజానికి టీవీకే కూడా అన్నాడీఎంకేతో ఎలాంటి పొత్తు ప్రయత్నాలు చేయలేదు.
గతంలో బీజేపీ నేత అన్నామలైని ఓ వార్తా సంస్థ విజయ్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. దానికి ఆయన "కాఫీ, టీ ఒకదానితో ఒకటి కలవవని అన్నామలై ఘాటుగా స్పందించారు. తాజా ఎన్నికల ఫలితాల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే పళనిస్వామి నేతృత్వంలోని అన్నా డీఎంకేతో విజయ్‌తో పొత్తు కోసం ప్రయత్నించవచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఒకవేళ బీజేపీ విముఖత చూపినా, అన్నామలై వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఏఐఏడీఎంకేపై ఈ పరిస్థితి తీవ్ర ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. విజయ్ పార్టీకి యువత, పట్టణ ప్రాంత ప్రజలు, మహిళలు పట్టం కట్టారని తాజా సర్వే చెబుతోంది. యువతలో 67 % పైగా టీవీకే పార్టీకి ఓట్లేశారని ఆ సంస్థ చెప్పింది. దళితులు మాత్రం డీఎంకే వైపు మొగ్గు చూపారు. గ్రామీణ ప్రాంతాల్లో డీఎంకే ఓటు బ్యాంక్ మెరుగ్గా ఉంది. మిగతా అన్ని వర్గాలను విజయ్ బలంగా ప్రభావితం చేశారని తెలుస్తోంది.
ఎగ్జిట్‌పోల్స్ అంచనాల తర్వాత విజయ్ అధికారం కోసం బీజేపీతో పొత్తులో ఉన్న అన్నాడీఎంకేతో కలిసేందుకు సిద్దం కానున్నారా అనే చర్చ మొదలైంది. కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న సందర్భంగా టీవీకే అధినేత విజయ్ పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. అభ్యర్థులు గెలిచిన తర్వాత మధ్యలో ఎలాంటి ప్రలోభాలకు అవకాశం లేకుండా నేరుగా తన దగ్గరకు రావాలన్నారు. వారికోసం తాను నిరీక్షిస్తుంటానని వెల్లడించారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండి మభ్య పెట్టడానికి యత్నించే వారిని ఎదుర్కోవాలన్నారు. నాలుగో తేదీ ఉదయం ఆరు గంటల కల్లా అభ్యర్థులు, ఏజెంట్లు ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలని సూచించారు విజయ్. ఏమాత్రం ఎవరు పాటుతో ఉన్నా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్తగా కౌంటింగ్ పర్యవేక్షించాలని సూచించారు. ఓట్ల సంఖ్య, లెక్కింపులో చూపిన ఓట్లతో సరిపోతుందా కచ్చితంగా సరిపోల్చుకోవాలన్నారు.
తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య ద్విముఖ పోరాటంగా కొనసాగుతూ వచ్చాయి. మధ్యలో కొన్ని పార్టీలు వచ్చినా ప్రభావం చూపెట్టలేకపోయాయి. తమిళనాట ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత తర్వాత రాజకీయాల్లో సినీ గ్లామర్ తగ్గిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. కొందరు హీరోలు పార్టీలు పెట్టినా సక్సెస్ కాలేకపోయారు. కానీ విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం ప్రభంజనంలా దూసుకొచ్చింది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం దాకా.. విజయ్ అనుసరించిన వ్యూహం తమిళ ప్రజలను మరీ ముఖ్యంగా యువతను ఎక్కువగా ఆకట్టుకుంది. తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండొచ్చనే ప్రశ్నకు ఓటర్లు విజయ్ పేరే ఎక్కువగా చెప్పారు. విజయ్ కూడా ఎంజీఆర్, జయలలితలా.. మరో తమిళ రాజకీయాలను శాసించే సినీ తార అవుతారా? లేదా? అనేది నాలుగో తేదీన విడుదలయ్యే ఫలితాలు తేల్చనున్నాయి.




