Burning Topic: అడుగు దూరంలో సీఎం కుర్చీ?

Burning Topic: తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్! అత్యధిక స్థానాలు గెలిచినా విజయ్ కి అందని సీఎం పీఠం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 May 2026 7:09 AM IST
Burning Topic
X

Burning Topic: అడుగు దూరంలో సీఎం కుర్చీ?

Burning Topic: తమిళనాడులో రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటులో అవాంతరాలను ఎదుర్కొటోంది తమిళగ వెట్రిక కళగం. ఇప్పటికే లోక్‌భవన్ వెళ్లి భంగపడ్డ అధినేత విజయ్‌ రెండోసారి గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. అయితే కనీస మెజారిటీకి అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల జాబితాను అందిచలేకపోయారు. 112 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన సంతకాలతో పాటు 20 మంత్రుల జాబితాను సమర్పించారు. సుమారు 40 నిమిషాల పాటు గవర్నర్‌తో చర్చించారు. విజయ్‌ సమర్పించిన సంఖ్యా బలం పట్ల గవర్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 118 ఎమ్మెల్యేల మద్దతు సమర్పించాకే సీఎంగా ప్రమాణం చేయాలని విజయ్‌కు అర్లేకర్ స్పష్టం చేశారు. దీంతో విజయ్ ఆశల మీద నీళ్లు జల్లినట్లయ్యింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరే ఇతర పార్టీని ఆహ్వానించబోమని విజయ్‌కు గవర్నర్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో గవర్నర్ కార్యాలయం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.తమిళనాడు ఎన్నికల్లో విజయ్‌ పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో విజయ్ రెండు చోట్ల గెలిచిన సీట్లు కూడా ఉన్నాయి కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో ఆ బలం 112కి చేరింది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో ఐదు స్థానాలు అవసరం. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన మద్దతు కూడగట్టే ప్రయత్నాలను విజయ్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా విజయ్‌ వామపక్షాల మద్దతు కోసం.. పార్టీ జనరల్‌ జాయింట్‌ సెక్రటరీ సీటీఆర్‌ నిర్మల్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. కాగా వామపక్షాలు ఇప్పటికే డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌తో భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో ‘ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశాన్ని వామపక్షాలే నిర్ణయించాలి’ అని స్టాలిన్ స్పష్టంగా చెప్పారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది

మరోవైపు డీఎంకే-అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాయనే ప్రచారం కూడా జరిగింది. అయితే వెంటనే ఈ పార్టీలు దీన్ని ఖండించాయి. ఇది టీవీకే ఆడుతున్న చిల్లర మైండ్‌గేమ్‌ అని విమర్శించాయి. తాజా ఎన్నికల్లో డీఎంకే అధికారం కోల్పోయి రెండో స్థానంలోకి, ప్రతిపక్ష అన్నాడీఎంకే మూడో ప్లేస్‌లోకి పడిపోయాయి. డీఎంకే‌కు 59, అన్నాడీఎంకే 47 సీట్లు గెలుచుకున్నాయి. ఈ రెండూ కలిపినా 106 సీట్లు మాత్రమే ఉన్నాయి. మెజార్టీ మార్క్‌ కోసం మిత్రపక్షాల వైపు చూడాల్సిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను గవర్నర్ ఆహ్వానించకపోవడం వల్లే ఈ ప్రచారం మొదలైందని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అవుతుందని.. డీఎంకే-అన్నాడీఎంకే.. పార్టీల మధ్య స్నేహం ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించేవారూ ఉన్నారు. ఒకవేళ పొత్తుకు ఏమైనా అవకాశం ఉంటే.. ఫలితాలు వెలువడిన వెంటనే ఇరుపార్టీల సీనియర్ నాయకులు మాట్లాడుకొని ఉండేవారు అనే చర్చ కూడా జరుగుతోంది.

మరోవైపు విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వబోమని ఏఐఏడీఎంకే స్పష్టంగా ప్రకటించింది. ఆ ఎమ్మెల్యేలంతా పుదుచ్చేరిలోని స్టార్ హోటల్‌కి తరలివెళ్లారు. మద్దతు కోసం టీవీకే పార్టీ నేతలు సంప్రదించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ జాగ్రత్త పడుతోంది. కాగా ఈ ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు సి.వి. షణ్ముగం మద్దతుదారులని వార్తలు వస్తుండటంతో రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలకు దారితీసింది. అన్నాడీఎంకే తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేల్లో కొంత మంది విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి అంగీకరించకపోవడంతో పార్టీ నాయకత్వంలోని కొన్ని వర్గాల్లో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. అంతకుముందు పార్టీలో ఎలాంటి విభేదాలు, చీలికలు లేవనిని ఆ పార్టీ అధికారిక ప్రకటన చేసింది.

గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ తీరుపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల ఒత్తిడికి లొగ్గార‌ని తమిళనాడు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ గిరీష్ చోడంకర్ధ్వజ‌మెత్తారు. రాజ్‌భవన్‌లో మెజారిటీ నిరూపించుకోమనే అధికారం గ‌వ‌ర్నర్‌కు లేద‌ని అన్నారు. ఎన్నిక‌ల్లో ప్రజ‌ల మ‌ద్దతు పొందిన టీవీకే విజ‌య్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల‌న్నారు. ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత మెజారిటీ నిరూపించుకోవ‌డానికి త‌గిన స‌మ‌యం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా గ‌వ‌ర్నర్ రాజేంద్ర అర్లేక‌ర్ వ్యవ‌హ‌రిస్తున్నార‌ని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమ‌ర్శించారు. బీజేపీ ఆదేశాల‌కు అనుగుణంగా గ‌వ‌ర్నర్ న‌డుచుకుంటున్నార‌ని ఆరోపించారు. మరోవైపు అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత విజయ్‌కే ప్రభుత్వం ఏర్పాటు చేసే మొదటి అవకాశం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. శణ్ముగం డిమాండ్ చేశారు.

తమిళనాడు గవర్నర్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, .. ప్రజల ఆకాంక్షలను అవమానిస్తున్నారని మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ ఆరోపించారు. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదని విమర్శించారు రాజ్యంగబద్ధ హోదాలో ఉన్నవాళ్లు ప్రజా తీర్పును గౌరవించాలని..తమ విధుల్ని సరిగా నిర్వర్తించాలని హితవు పలికారు. టీవీకే పార్టీ గెలిచినా ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు పడకపోవడం ప్రజాతీర్పును అగౌరవపరచడమేనని పేర్కొంటూ గవర్నర్ తీరుపై కమల్ హాసన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బలనిరూపణ జరగాల్సింది అసెంబ్లీలోనని.. లోక్‌భవన్‌లో కాదని అన్నారాయన. ప్రభుత్వ ఏర్పాటునకు ఇప్పటికైనా విజయ్‌ని ఆహ్వానించాలని ఆయన అన్నారు. విజయ్ అసెంబ్లీ వేదికగా తన బలాన్ని నిరూపించుకునే హక్కు ఆయనకు ఉందని ప్రకాశ్ రాజ్ అన్నారుగెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పటి వరకూ ప్రమాణ స్వీకారం కూడా చేయలేదని, ఇది రాష్ట్రానికి జరిగిన అవమానమని అభివర్ణించారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story