Off The Record: ఆనం రాంనారాయణ రెడ్డి తారక మంత్రం

Off The Record: ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తన వ్యూహాత్మక రాజకీయాలతో టీడీపీని పటిష్ట చేసి, ప్రత్యక్ష రాజకీయాల్లో తన మార్క్ చాటుకున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 Oct 2026 8:29 AM IST
Off The Record
X

Off The Record: ఆనం రాంనారాయణ రెడ్డి తారక మంత్రం

Off The Record: ఆనం.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పరిచయం చేయనక్కరలేని కుటుంబం. ప్రభుత్వాలు మారినా.. కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చినా.. అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నా.. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ ఎత్తులు వేయడంలో ఆనం కుటుంబానిది అందెవేసిన చేయి అంటే అతిశయోక్తి కాదేమో. దాదాపు 80 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ఈ కుటుంబంలో ఇప్పుడు ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి కుటుంబ పెద్దగా రాజకీయాలలో కొనసాగుతున్నారు.

పొలిటికల్ కారిడార్‌లో మిస్టర్ కూల్ అన్న ప్రత్యేకత కలిగి ఉన్న రామనారాయణరెడ్డి.. ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కోగలగడం, ప్రత్యర్థుల ఎత్తులకు.. తనకు తానే సాటి అనే పేరు ఉంది. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో రామనారాయణ రెడ్డి తన మార్క్ వ్యూహాత్మక రాజకీయాలకు మరోసారి నిరూపించుకున్నారట. ప్రత్యర్థులకు తన మార్క్ రాజకీయం ఎలా ఉంటుందో ఆచరణాత్మకంగా చూపించారట.

అసలు విషయానికి వస్తే.. మారిన రిజర్వేషన్ల ప్రక్రియలో నియోజకవర్గ కేంద్రం ఆత్మకూరును ఓసీ మహిళకు కేటాయించారు. దీంతో ముందస్తుగా అప్రమత్తమైన ప్రతిపక్ష వైసీపీ.. ఆత్మకూరు కేంద్రంలోని ప్రధానమైన స్థానిక రాజకీయ బలం నేపథ్యం కలిగిన దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుందర రామిరెడ్డి కుటుంబానికి చెందిన డాక్టర్ షకీలారెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించిందట. మరో ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ప్రకటనకు సన్నాహాలు ప్రారంభించిందట.

అప్పటికే అదే కుటుంబానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేందర్రెడ్డిని వైసీపీ తరఫున జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు ఆ పార్టీ అధినేత జగన్‌. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికలలో నోటిఫికేషన్ నాటికి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో టీడీపీకి మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీకి బలమైన అభ్యర్థులు లేని పరిస్థితి ఎదురైందట. ఆత్మకూరులో అధికార కూటమి బలమైన అభ్యర్థి కరువయ్యారట. స్థానికంగా తమ ట్రస్టు ద్వారా ప్రజలకు చేరువై ఉన్న కంచి పరమేశ్వర్ రెడ్డి కుటుంబాన్ని రంగంలోకి దింపాలని ప్రయత్నం చేసినప్పటికీ ఆ కుటుంబం సుముఖత వ్యక్తం చేయలేదట.

దీంతో నియోజకవర్గంలోని తమ అనుచరుడైన మరో ద్వితీయ శ్రేణి నాయకుడి భార్యను రంగంలో దింపేందుకు ప్రయత్నించారట. అభ్యర్థికి ఆత్మకూరులో ఓటు లేకపోవడంతో హుటాహుటినా కోర్టు ద్వారా ఓటు పొందేందుకు ప్రయత్నాలు చేశారట మంత్రి రామనారాయణ రెడ్డి. అదీ కూడా ఫలించకపోవడంతో ఇక తనదైన మార్క్ రాజకీయానికి తెర లేపారట ఆనం రామనారాయణ.

అభ్యర్థుల వేటలో అడుగడుగునా ఇబ్బందులు ఎదురు కావడంతో మంత్రి రామనారాయణ రెడ్డి.. రాజకీయ వ్యూహం మార్చారట. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కలిసి వచ్చిన "తారక మంత్ర".. ఇప్పుడు ఆనం చేసిన మరో తారక మంత్ర ప్రయోగం కూడా అద్భుతంగా పనిచేసిందట. స్థానికంగా రాజకీయ నేపథ్యం.. ప్రజలతో సంబంధాలు కలిగిన దివంగత మాజీ ఎమ్మెల్యే బొమ్మిరెడ్డి సుందర్ రామిరెడ్డి మనుమడు "తారకనాథరెడ్డి" ద్వారా రాజకీయ మంత్రాంగం ప్రారంభించారట.

తారకనాథ్ అమెరికాలో ఉన్నప్పటికీ.. ఆయనతో మంత్రి ఆనం మంతనాలు జరిపారు. వైసీపీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తారకనాథ్ తల్లి డాక్టర్ షకీలారెడ్డిని టీడీపీ వైపు ఆకర్షించేలా వ్యూహాత్మక ఎత్తుగడవేశారు. నెల్లూరుకు చెందిన తన అనుచరుడు డాక్టర్ షకీలా రెడ్డికి వియ్యంకుడు, తారక్ నాథ్ రెడ్డి మామ మాగుంట వెంకటనారాయణ రెడ్డిని రంగంలోకి దింపారట. ఈ ప్రయత్నాలతో ఆనం అనుకున్న స్కెచ్ ఉన్నది ఉన్నట్టు వర్కౌట్ అవుతోంది.

ఆత్మకూరు పట్టణంలో దివంగత డాక్టర్ బిఎస్ఆర్ కుటుంబంపై ప్రయోగించిన తారక మంత్ర.. సక్సెస్ కావడంతో రాజకీయంగా పూర్తి ఆధిపత్యం సాధించడానికి నియోజకవర్గంలో గతంలో తనతో విభేదించినవారు.. అసంతృప్తవాదులు.. ప్రతిపక్ష పార్టీలో స్థానికంగా బలమైన ద్వితీయ శ్రేణి నాయకులపై దృష్టి సారించారట మంత్రి ఆనం.

ఇందులో పట్టణానికి చెందిన చల్లా రవికుమార్ రెడ్డి, మేకపాటి కుటుంబానికి ఒకవైపు బంధుత్వం ఇంకోవైపు స్థానిక నాయకత్వం కలిగిన డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డిని టిడిపిలోకి చేర్పించడం కోసం మరో వ్యూహాత్మక ఎత్తుగడలు వేశారట. ప్రతిపక్ష నాయకునికి అనుచరులుగా ఉన్న స్థానిక ద్వితీయశ్రేణి నాయకులు చల్లా రవికుమార్ రెడ్డి తన అనుచరులు.. ముఖ్యులు టిడిపి కండువా కప్పుకున్నారట.

దీంతో ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు అభ్యర్థి కరువయ్యారన్న పరిస్థితులు ఉన్న నియోజకవర్గ కేంద్రం ఆత్మకూరులో.. ప్రస్తుతం ఆధిపత్యం కలిగే స్థాయికి తీసుకెళ్లడంలో మంత్రి రామనారాయణరెడ్డి సక్సెస్ అయ్యారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆత్మకూరు మున్సిపాలిటీలో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వరకు ఎడమొహం.. పెడమొహంగా ఉన్న నాయకులను.. అధికార పక్షం గూటికి తీసుకొచ్చారు మంత్రి ఆనం. మండల, గ్రామస్థాయిలో కూడా వైసీపీ ముఖ్యులను వ్యూహాత్మకంగా అధికార పక్షం వైపు ఆకర్షించారు. ఆత్మకూరులో మంత్రి ఆనం అనుసరిస్తున్న రాజకీయ ఎత్తుగడలను పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు.. దటీస్ ఆనం పాలిటిక్స్ అంటున్నారట.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్