Off The Record: తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు బిగ్ షాక్?
Off The Record: తెలుగుదేశం పార్టీలో భారీ ప్రక్షాళనకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు.
Off The Record: తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు బిగ్ షాక్?
Off The Record: పార్టీ పునర్‌వ్యవస్థీకరణపై అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారా..? పార్టీ లైన్‌ను విస్మరించిన నేతలను, ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న లీడర్లను గాడిలో పెట్టేందుకు నడుం బిగించారా..? రాబోయే స్తానిక ఎన్నికల నాటికి రాష్ట్రవ్యాప్తంగా పార్టీని సెట్‌రైట్ చేయాలని చూస్తున్నారా? అంటే కుప్పంలో చోటుచేసుకున్న తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు పార్టీలో సాధారణ పునర్వ్యవస్థీకరణ కాదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అధికారికంగా ఎక్కడా ప్రకటించకపోయినా.. కుప్పం కన్వీనర్ శ్రీకాంత్ చుట్టూ కొంతకాలంగా వస్తున్న ఫిర్యాదులు, స్థానికంగా కార్యకర్తల నుంచి వ్యక్తమైన అసంతృప్తి, కొన్ని వర్గాల మధ్య పెరిగిన విభేదాలు అధిష్ఠానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే నేరుగా చర్యలు తీసుకున్నట్లు కనిపించకుండా ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించి..ఆయన్ను రాష్ట్ర స్థాయి అవసరాలకు వినియోగిస్తామని చెప్పడం ద్వారా గౌరవప్రదంగా పక్కకు తప్పించినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కుప్పం అనేది సాధారణ నియోజకవర్గం కాదు. చంద్రబాబు రాజకీయ జీవితానికి ప్రతీకగా నిలిచిన స్థలం. అలాంటి చోట పార్టీ వ్యవహారాలపై అసంతృప్తి సంకేతాలు కనిపించడాన్ని ఆయన చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ముందుగా తన సొంత నియోజకవర్గంలోనే ప్రక్షాళన మొదలుపెట్టి, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులకు ఒక స్పష్టమైన సందేశం పంపినట్లు కనిపిస్తోంది. ఎవరైనా సరే.. ఎంత పెద్ద నాయకుడైనా సరే.. పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు” అనే సంకేతాన్ని కుప్పం వేదికగా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇటీవల జరిగిన సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గమనిస్తే, ఆయన దృష్టి కేవలం స్థానిక సంస్థల ఎన్నికలపైనే లేదని అర్థమవుతోంది. పార్టీ నిర్మాణం, నాయకుల ప్రవర్తన, కార్యకర్తలతో వ్యవహారశైలి, ప్రజల్లో నాయకులపై ఉన్న అభిప్రాయం వంటి అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రతి లీడర్ పనితీరుపై ఇప్పటికే నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని, ప్రజల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నామని ప్రతి సమావేశంలో కార్యకర్తలతో పాటు నేతలకు సైతం పదే పదే స్పష్టం చేస్తూ వస్తున్నారు.
పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో నాయకుల పనితీరుపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్, కీలక నాయకులపై ప్రజలు ఏమనుకుంటున్నారు? కార్యకర్తలు సంతృప్తిగా ఉన్నారా? ప్రభుత్వ పథకాలు సక్రమంగా చేరుతున్నాయా? అనే అంశాలపై ఫీడ్‌బ్యాక్ సేకరణ జరుగుతోందని చెబుతున్నారు. ఈ నివేదికలు నేరుగా అధిష్ఠానం వద్దకు చేరుతున్నట్లు కూడా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో కుప్పంలో తీసుకున్న నిర్ణయం ఒక వ్యక్తికి సంబంధించిన చర్యగా కాకుండా, మొత్తం పార్టీకి ఇచ్చిన హెచ్చరికగా భావిస్తున్నారు. నేతలు..
స్థానికంగా కార్యకర్తలను పట్టించుకోకపోవడం, అధికార దర్పం ప్రదర్శించడం, వ్యక్తిగత వర్గాలను ప్రోత్సహించడం, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలు చేయడం వంటి అంశాలపై ఇకపై ఉపేక్ష ఉండదనే సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది.
చంద్రబాబు గత కొంతకాలంగా “కార్యకర్తే అధినేత” అనే నినాదాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని పదేపదే చెబుతున్నారు. అదే ఆలోచనతో క్లస్టర్ ఇంచార్జీలకు ప్రాధాన్యత పెంచి, వారిలో కొందరికి పొలిట్‌బ్యూరో స్థాయిలో అవకాశాలు కల్పించారు. సాధారణంగా పొలిట్‌బ్యూరో అంటే సీనియర్ నాయకుల వేదికగా భావించే పార్టీ సంస్కృతిలో, క్షేత్రస్థాయిలో పనిచేసిన నాయకులకు చోటు కల్పించడం ద్వారా కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు.
అదే సమయంలో బాధ్యతలతో పాటు జవాబుదారీతనం కూడా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పొలిట్‌బ్యూరోలో ఉన్నారని, సీనియర్ నాయకులని, పదవులు ఉన్నాయని ఎవరూ మినహాయింపు పొందరని ఆయన తాజా వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. తప్పు చేస్తే ఎంత పెద్ద నాయకుడైనా చర్యలు తప్పవని చెప్పడం ద్వారా పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ ఉండదనే సందేశం ఇచ్చారు.




