Off The Record: టీడీపీ ఇన్‌ఛార్జి వర్సెస్ జనసేన ఎమ్మెల్యే.. పాలకొండలో కూటమి పార్టీల మధ్య రాజుకున్న అగ్గి!
Off The Record: ఏపీలోని పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌ఛార్జి భూదేవి, ఎమ్మెల్యే జయకృష్ణ వర్గాల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. అన్న క్యాంటీన్ వేదికగా జరిగిన గొడవ మరియు కేసుల వివరాలు ఇక్కడ చూడండి.
Off The Record: ఏపీలోని మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల వర్గపోరు రోడ్డెక్కింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజున అన్నక్యాంటిన్లో ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం చూసిన పాలకొండ వాసులు.. ముక్కున వేలేసుకున్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు కళా వెంకట్రావు వర్గంలో జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వర్గంలో భూదేవి కొనసాగుతున్నారని టాక్. ఈ రెండు వర్గాలు పరస్పరం ఆధిపత్య పోరుకు కాలు దువ్వుతారని పార్టీలో అంతర్గతంగ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే జయకృష్ణ.. పేరుకు జనసేన అయినా డీఎన్ఏ మాత్రం టీడీపీనేనంటారు. కాలక్రమంలో ఆయన టీడీపీ ఇన్‌ఛార్జిగా వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదట. ఈ నేపథ్యంలో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహించారు. లంచ్ టైంలో అన్న క్యాంటిన్‌కు భూదేవి వర్గం వెళ్లగా.. వారి వెనుకనే జయకృష్ణ వర్గం కూడా అక్కడికి చేరుకుంది. భూదేవి వడ్డన ప్రారంభించగా.. మేము సైతం భోజనం వడ్డిస్తామంటూ మరో వర్గం పట్టుబట్టడంతో సీన్ రణరంగంగా మారింది,.
ఈ గోడవ కాస్తా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఈ తంతు పూర్తిగా అధిష్టానానికి తెలిసినా కిమ్మనకుండా ఉండటం ఏంటంటూ తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇరువర్గాల ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు.. ఎఫ్.ఐ.ఆర్.లు కూడా నమోదు చేశారు. దీంతో ఈ అగ్గి మరింత రాజుకునే ప్రమాదం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ.. నియోజకవర్గంపై తన మార్కు చూపించుకునే ప్రయత్నం చేస్తూనే.. టీడీసీలో తన పట్టును కొనసాగిస్తున్నారు. ఎమ్మల్యే వెంట నడుస్తున్న టీడీపీ కేడర్.. భూదేవి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తోందట. అలాగే భూదేవి వర్గం నేతలు జయకృష్ణ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. ఈ క్రమంలో ఇటీవల టిడిపి సభ్యత్వ కార్డుల పంపిణీలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇంచార్జ్ పడాల భూదేవి వర్గం, వ్యతిరేకవర్గం మధ్య మార్కెట్ కమిటి నామినేటెడ్ పదవుల వ్యవహారం మరింత వేడి రాజేసింది. ఎన్నో యేళ్లుగా పార్టీని నమ్ముకుని పని చేసిన వారిని కాదని ఇంఛార్జి భూదేవి తనకు ఇష్టం వచ్చిన వారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమించారంటూ టిడిపిలోని మరో వర్గం ఆరోపిస్తోంది. ఇలాంటి పరిస్ధితుల్లో పాలకొండలో ఈ ఇరువురు నేతలూ ఒకే వేదికను పంచుకునే సందర్భమూ ఇంతవరకూ కనిపించలేదు.
మరోవైపు జయకృష్ణ.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన పార్టీని బలోపేతం చేస్తున్నారన్న వాదన లేకపోలేదు. ఇలా జయకృష్ణ వెంట నడుస్తున్న అనుచరులంతా ఆయన ఏ పార్టీకి జంప్ అయితే ఆ పార్టీకి వెళ్లే వారేనట. ఇప్పటికే జయకృష్ణ.. అటు జనసేనకు, ఇటు లోకేష్‌తోనూ టచ్ లో ఉంటున్నారట. టిడిపి కార్యక్రమాలను తన సొంత ఖర్చులతో నిర్వహించడాన్ని భూదేవి వర్గం జీర్ణించుకోలేకపోతోందట. ఇలా ఉండగా పార్టీలు వేరైనా కూటమి పెద్దలు రాష్ట్ర స్ధాయిలో ఐక్యంగా ముందుకు సాగుతున్నారు. కూటమి పార్టీల కేడర్ మధ్య గ్యాప్ రాకూడదని అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు దిశానిర్ధేశం చేస్తూనే ఉన్నారు. ఇరు పార్టీల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు.. కార్యకర్తల పాలిట శాపంగా మారుతోందన్న టాక్ లేకపోలేదు. ఈ క్రమంలో పాలకొండ టీడీపీ పంచాయితీని చక్కదిద్దటానికి పెద్దలు రంగంలోకి దిగాల్సిందే అంటున్నారు స్థానిక ద్వితీయశ్రేణి నాయకులు. దీనిపై టీడీపీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.




