Off The Record: నెక్స్ట్ ముఖ్యమంత్రి లోకేష్?
Off The Record: తెలుగుదేశం పార్టీలో తరం మార్పు మొదలైందా? పార్టీ నిర్ణయాల్లో మంత్రి నారా లోకేష్ ప్రభావం పెరుగుతోందా?
Off The Record: నెక్స్ట్ ముఖ్యమంత్రి లోకేష్?
Off The Record: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం నిశ్శబ్దంగా కాని.. గమనించదగ్గ స్థాయిలో కానీ ఒక తరం మార్పు ప్రక్రియ కొనసాగుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గత నాలుగు దశాబ్దాలుగా పార్టీని నడిపించిన నాయకత్వ శైలి, నిర్ణయాల తీరు, వ్యవస్థాపక విధానాల్లో క్రమంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని సీనియర్ నేతలే ఆఫ్ ది రికార్డ్‌గా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మార్పుల కేంద్ర బిందువుగా ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒకవైపు ఉంటే.. మరోవైపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పాత్ర రోజురోజుకీ విస్తరిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక తర్వాత ఈ చర్చ మరింత వేగం అందుకుంది. అభ్యర్థుల ఎంపికలో లోకేష్ ఆలోచనా విధానం, ఆయనకు దగ్గరగా ఉన్న నాయకుల అభివృద్ధి, యువతకు అవకాశాలు కల్పించడం వంటి అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కొందరు పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో ఈ నిర్ణయాల వెనుక పూర్తి స్థాయిలో చంద్రబాబు ఆమోదం, భాగస్వామ్యం కూడా ఉందని మరో వర్గం స్పష్టం చేస్తోంది.
టీడీపీని దగ్గరగా పరిశీలించే నాయకుల అభిప్రాయం ప్రకారం చంద్రబాబు నిర్ణయాల ప్రక్రియ ఎప్పటినుంచో ఒక నిర్దిష్ట పద్ధతిలో సాగుతుంది. ఏ అంశమైనా సరే.. అది పార్టీకి సంబంధించినదైనా, ప్రభుత్వానికి సంబంధించినదైనా.. ఆయన ముందుగా అన్ని కోణాల్లో విశ్లేషిస్తారు. సామాజిక సమీకరణాలు, రాజకీయ ప్రభావాలు, భవిష్యత్ పరిణామాలు, పార్టీపై పడే ముద్ర, ప్రజల్లో కలిగే స్పందన వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయానికి వస్తారని చెబుతుంటారు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం కన్నా, ఎక్కువ సమయం తీసుకుని అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకోవడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తారని సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు.
అయితే లోకేష్ వ్యవహార శైలి దీనికి భిన్నంగా కనిపిస్తోందనే అభిప్రాయం పార్టీ అంతర్గత వర్గాల్లో వినిపిస్తోంది. ఆయన వద్దకు వెళ్లే ఫైళ్లు, పార్టీ అంశాలు, పదవుల కేటాయింపులు, సంస్థాగత నిర్ణయాలు వేగంగా ముందుకు కదులుతున్నాయనే అభిప్రాయం కొందరిలో ఉంది. నిర్ణయం తీసుకోవడంలో ఎక్కువ ఆలస్యం చేయకుండా, తక్షణ స్పందన ఇవ్వడానికే లోకేష్ మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు...
కొంతమంది నాయకుల అభిప్రాయం ప్రకారం లోకేష్ ఒక వ్యక్తిని ఎంపిక చేసే సమయంలో అతనిపై తనకు ఉన్న నమ్మకం, సంస్థ పట్ల అతని అనుబంధం, అప్పగించిన పనిని పూర్తి చేసే సామర్థ్యం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో ప్రజల్లో ఆ వ్యక్తి ఇమేజ్ ఎలా ఉంది? రాజకీయంగా ఎలాంటి సందేశం వెళ్తుంది..? ప్రత్యర్థులు దాన్ని ఎలా ఉపయోగించుకుంటారు..? అనే అంశాలు కొన్నిసార్లు రెండో ప్రాధాన్యానికి వెళ్లిపోతున్నాయనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక మరికొందరు మాత్రం దీనిని పూర్తిగా భిన్నంగా చూస్తున్నారు. గతంలో రాజకీయాల్లో అవకాశాలు రావడానికి చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చేదని, ఇప్పుడు పని చేసిన వారికి త్వరగా గుర్తింపు దక్కుతోందని వారు అంటున్నారు. యువ నాయకత్వం రావాలంటే కొంత వేగం అవసరమని, సంప్రదాయ రాజకీయ విధానాలతోపాటు కొత్త తరహా నిర్ణయాలు కూడా ఉండాల్సిందేనన్నది వారి వాదన. పార్టీలో మరో ఆసక్తికరమైన చర్చ ఏమిటంటే... లోకేష్‌కు సన్నిహితులుగా భావించే వ్యక్తులపై మీడియాలో విమర్శలు వచ్చినా లేదా ప్రతికూల కథనాలు వచ్చినా వాటి ప్రభావం ఆయన నిర్ణయాలపై పెద్దగా కనిపించడం లేదని కొందరు అంటున్నారు. ఒకసారి ఎవరిపైనైనా నమ్మకం ఏర్పడితే దానిని సులభంగా మార్చుకునే వ్యక్తి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే దీనిని కొందరు బలహీనతగా చూస్తే, మరికొందరు నాయకత్వ స్థిరత్వంగా అభివర్ణిస్తున్నారు...
పార్టీలోని ఒక వర్గం అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న మార్పులు తక్షణ ఫలితాల పరంగా బాగానే కనిపించవచ్చు. కానీ దీర్ఘకాలికంగా పార్టీ నిర్మాణంపై వాటి ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా సమాంతరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. మరోవైపు యువతను ప్రోత్సహించడం, నిర్ణయాల్లో వేగం తీసుకురావడం, ఆధునిక రాజకీయ పద్ధతులను అమలు చేయడం ద్వారా పార్టీకి కొత్త ఉత్సాహం వస్తోందని మరో వర్గం విశ్వసిస్తోంది. ఇక అధికార వ్యవస్థలోనూ, పార్టీలోనూ ప్రస్తుతం ఒక కొత్త మానసిక వాతావరణం ఏర్పడుతోందని చెబుతున్నారు. గతంలో ఏదైనా పని వేగంగా జరగాలంటే నేరుగా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని భావించేవారు. ఇప్పుడు అయితే లోకేష్ టీమ్‌తో అనుసంధానం పెంచుకుంటే పనులు త్వరగా ముందుకు కదులుతాయనే అభిప్రాయం కొంతమందిలో ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇది వాస్తవమా? లేక కేవలం భావనా స్థాయిలో ఏర్పడిన అభిప్రాయమా..? అనేది వేరే చర్చ అయినప్పటికీ, అలాంటి అభిప్రాయం మాత్రం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది...
మరో కీలకమైన మార్పు పార్టీ సంస్థాగత నిర్మాణంలో కనిపిస్తోందని సీనియర్ నేతలు చెబుతున్నారు. ఒకప్పుడు పార్టీ కార్యాలయాల్లో ప్రధానంగా రాజకీయ నేపథ్యం ఉన్న నాయకులే వ్యవహారాలు చూసేవారని గుర్తు చేస్తున్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమాచార సేకరణ, రాజకీయ విశ్లేషణ, సామాజిక పరిస్థితుల అంచనా వంటి అంశాల్లో సీనియర్ నాయకుల పాత్ర ఎక్కువగా ఉండేదని అంటున్నారు. ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారిపోయిందని వారి అభిప్రాయం. ప్రస్తుతం డేటా విశ్లేషణ, సర్వేలు, ప్రొఫెషనల్ టీమ్‌లు, కన్సల్టింగ్ ఏజెన్సీలు, టెక్నాలజీ ఆధారిత వ్యవస్థల పాత్ర పెరిగిందని చెబుతున్నారు. ఎన్నికల వ్యూహాల రూపకల్పన నుంచి ప్రజాభిప్రాయ అంచనాల వరకు అనేక అంశాల్లో ఉద్యోగులు, నిపుణులు, ప్రైవేట్ ఏజెన్సీల సహకారం తీసుకుంటున్నారని పేర్కొంటున్నారు. దీంతో ఒకప్పుడు పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డ అనేక మంది సంప్రదాయ నాయకుల పాత్ర తగ్గిపోయిందనే భావన కొందరిలో కనిపిస్తోంది.
ఈ మొత్తం చర్చలో అత్యంత ఆసక్తికరమైన అంశం మరొకటి లేకపోలేదు. బయటకు కనిపిస్తున్నంతగా చంద్రబాబు-లోకేష్ మధ్య నిర్ణయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయా..? అనే ప్రశ్నకు చాలామంది సీనియర్ నేతలు భిన్నమైన సమాధానం ఇస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం బయటకు కనిపిస్తున్న కథనం ఒకటైతే... వాస్తవ పరిస్థితి మరోలా ఉండవచ్చనీ చెబుతున్నారు. "లోకేష్ తీసుకునే ప్రతి కీలక నిర్ణయం గురించి చంద్రబాబుకు పూర్తి సమాచారం ఉంటుందట. అలాగే చంద్రబాబు ఆలోచనలు కూడా లోకేష్‌కు తెలిసే ఉంటాయట. ఇద్దరూ మాట్లాడుకోకుండా పెద్ద నిర్ణయాలు జరిగే అవకాశం చాలా తక్కువ" అని ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. "లోకేష్ ఏదైనా నిర్ణయం తీసుకుని అది పార్టీకి నష్టం చేసే అవకాశముంటే చంద్రబాబు దాన్ని సరిదిద్దలేరా?" అనే ప్రశ్నను కూడా కొందరు ముందుకు తెస్తున్నారు. వారి వాదన ప్రకారం ప్రస్తుతం బయటకు కనిపిస్తున్న 'లోకేష్ హవా' కూడా ఒక రాజకీయ వ్యూహంలో భాగం కావచ్చన్న అభిప్రాయం ఉంది. భవిష్యత్తు నాయకత్వాన్ని క్రమంగా పార్టీ శ్రేణులకు పరిచయం చేయడం, నిర్ణయాధికారాన్ని దశలవారీగా బదిలీ చేయడం, కొత్త తరాన్ని బాధ్యతలకు సిద్ధం చేయడం వంటి లక్ష్యాలతో ఈ ప్రక్రియ సాగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒకవైపు చూస్తే లోకేష్ ప్రభావం పెరుగుతోందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు చూస్తే ఆ ప్రభావం కూడా చంద్రబాబు పర్యవేక్షణలోనే నిర్మితమవుతోందనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ రెండు అభిప్రాయాల్లో ఏది పూర్తిగా నిజమో కాలమే నిర్ణయించాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అదేంటంటే.. తెలుగుదేశం పార్టీలో నాయకత్వ మార్పు గురించి ఒకప్పుడు ఊహాగానాల స్థాయిలో ఉన్న చర్చ.. ఇప్పుడు పార్టీ అంతర్గత వ్యవస్థల్లో, నిర్ణయాల ప్రక్రియలో, రాజకీయ సంకేతాల్లో స్పష్టంగా ప్రతిబింబించడం ప్రారంభమైందట. భవిష్యత్తులో ఈ మార్పు ఎంత వేగంగా ముందుకు సాగుతుంది..? పార్టీ నిర్మాణంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? అనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.




