Off The Record: బీజేపీలో జెండా మోసినోళ్ళకు మొండిచేయేనా ?
Off The Record: బిజెవైఎమ్ జాతీయ కమిటీలో తెలంగాణకు నాలుగు పదవులు దక్కడంపై హర్షం వ్యక్తమవుతున్నా, ఎంపిక ప్రమాణాలపై పార్టీ అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Off The Record: బీజేపీలో జెండా మోసినోళ్ళకు మొండిచేయేనా ?
Off The Record: భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కమిటీలో తెలంగాణకు చెందిన నలుగురికి కీలక బాధ్యతలు దక్కాయి. మాలోత్ కోమలి నాయక్‌కు జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి, బంధం అఖిలకు పాలసీ అండ్ రీసెర్చ్ ఇన్ఛార్జ్ బాధ్యతలు, కమల్ మడిశెట్టికి కో-ఇన్ఛార్జ్ హోదా, కసిరెడ్డి సింధు రెడ్డికి జాతీయ కార్యవర్గ సభ్యురాలి అవకాశం లభించింది.
ఒకవైపు తెలంగాణకు నాలుగు జాతీయ స్థాయి పదవులు రావడం రాష్ట్ర బీజేపీకి గౌరవంగా కనిపిస్తున్నా.. ఈ ఎంపికల వెనుక ఉన్న అసలు ప్రాతిపదిక ఏమిటన్న చర్చ పార్టీ లోపల మంటలు రాజేస్తోందట. పదవి పొందిన వారి వ్యక్తిగత సామర్థ్యాల కంటే, వారి ఎంపికకు ఉపయోగించిన ప్రమాణాలే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారాయంటున్నారు.
పార్టీ కార్యకర్తల వర్గాల్లో వినిపిస్తున్న చర్చ ప్రకారం.. క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం, సంస్థాగత ప్రస్థానం, యువతలో ప్రభావం, ఉద్యమాల్లో భాగస్వామ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారా..? లేక రాజకీయ పలుకుబడి, సిఫార్సులు, పెద్దల ఆశీర్వాదాలే ప్రధాన కారణమయ్యాయా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయట.
ఇక్కడే అసలు వివాదానికి తెరలేచిందని చెబుతున్నారు. తెలంగాణ కోటాలో పదవులు భర్తీ చేసినప్పుడు.. తెలంగాణ రాజకీయ, సామాజిక, ఉద్యమ వాస్తవాలపై అవగాహన ఎంతవరకు పరిగణనలోకి తీసుకున్నారు..? రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఎవరు ఎంత పని చేశారు..? అనే అంశాలపై సహజంగానే చర్చ మొదలైందట.
ప్రత్యేకంగా కసిరెడ్డి సింధు రెడ్డి మినహా.. మిగతా ముగ్గురు పేర్లు విన్న తర్వాతే చాలా మంది రాష్ట్ర నేతలు ఆశ్చర్యపోయారనే ప్రచారం జరుగుతోందట. కొందరికి పార్టీ క్రియాశీలక రాజకీయ కార్యకలాపాల అనుభవం ఎంత ఉంది..? తెలంగాణతో వారి అనుబంధం ఎంత..? రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై వారికి ఎంత అవగాహన ఉంది..? అనే ప్రశ్నలు కార్యకర్తల మధ్య చర్చనీయాంశమయ్యాయట.
బీజేపీ అనుబంధ సంస్థలైన ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ లేదా ఇతర కేడర్ బేస్డ్ వ్యవస్థల్లో పనిచేసిన అనుభవం కూడా చాలా ముఖ్యమని భావించే పార్టీ ఇది. అలాంటి నేపథ్యంలో ఈ ఎంపికలు సాధారణ కార్యకర్తలకు అర్థంకాని సమీకరణంగా కనిపిస్తున్నాయని కొందరు అంటున్నారట.
ఇక నియామకాల వెనుక ఉన్న వ్యక్తుల గురించి పార్టీ వర్గాల్లో ప్రచారం అవుతున్న అంశాలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మాలోత్ కోమలి నాయక్ ఇప్పటికే రాష్ట్ర యువమోర్చా ఐటీ సెల్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆమెకు అనూహ్యంగా జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి దక్కడంతో.. ఆమె వేగవంతమైన ఎదుగుదల వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలపై చర్చ మొదలైందట.
అలాగే బంధం అఖిలకు నేరుగా పాలసీ అండ్ రీసెర్చ్ విభాగంలో కీలక బాధ్యతలు రావడంతో.. ఆమె సంస్థాగత ప్రస్థానానికి సంబంధించిన ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయట. కమల్ మడిశెట్టి విద్యారంగానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు పొందినప్పటికీ.. ఆయనకు జాతీయ బాధ్యతలు ఎలా దక్కాయి..? అనే ఆసక్తి కూడా వ్యక్తమవుతోందట.
ఇక కసిరెడ్డి సింధు రెడ్డి మాత్రం గతంలో బీజేవైఎంలో పనిచేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవమూ ఉంది. అయినప్పటికీ ఆమె ఎంపికపై కూడా భిన్నాభిప్రాయాలు లేకపోలేదని చెబుతున్నారు.
కమలదళంలో ఇప్పుడు వినిపిస్తున్న ప్రధాన వాదన ఏమిటంటే.. జాతీయ స్థాయి పదవులు కార్యకర్తలకు ప్రేరణ కలిగించాలి. “పార్టీ కోసం కష్టపడితే గుర్తింపు వస్తుంది” అనే నమ్మకాన్ని బలపరచాలి. కానీ క్షేత్రస్థాయిలో శ్రమించినవారిని పక్కనపెట్టి, కొత్త ముఖాలు ఒక్కసారిగా ఉన్నత స్థానాలకు చేరితే కేడర్‌లో అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీ జెండా మోస్తూ వచ్చినవారు.. ఎన్నికల వేళ ఇంటింటికీ తిరిగినవారు.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ సంస్థను నిలబెట్టిన యువ నాయకులు చాలామంది ఉన్నారని కార్యకర్తలు గుర్తు చేస్తున్నారట. వారందరి కృషికి విలువ ఎక్కడ..? అనే ప్రశ్న కేడర్ నుంచి వస్తోందట.
ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా నాయకత్వం నుంచి ఈ అసంతృప్తి మరింత బలంగా వినిపిస్తోందని సమాచారం. కుల సమీకరణాలు, రాజకీయ సమతుల్యత పేరుతో పదవులు ఇచ్చారని అనుకున్నా.. సంవత్సరాల తరబడి పార్టీ కోసం పనిచేసిన యువ నాయకుల పనితీరు పెద్దలకు కనిపించలేదా..? అనే చర్చ కూడా సాగుతోందట.
ఇక మరో ప్రశ్న కూడా ఆసక్తికరంగా మారింది. ఈ పేర్లను ఢిల్లీ స్థాయి నాయకత్వం సూచించిందా..? లేక రాష్ట్ర నాయకత్వం సిఫార్సు చేసిందా..? అనే అంశంపై స్పష్టత లేకపోవడం ఊహాగానాలకు తావిస్తోంది. అయితే దానికంటే ముఖ్యమైన ప్రశ్న ఒకటే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ కొత్త బాధ్యులు తెలంగాణలో పార్టీ విస్తరణకు ఎంతవరకు ఉపయోగపడతారు..? యువతను ఆకర్షించగలరా..? క్షేత్రస్థాయి కార్యకర్తలతో మమేకమవుతారా..? సంస్థను బలోపేతం చేసే దిశగా పనిచేస్తారా..? అనే విషయాలే వారి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయట.
మొత్తానికి.. బీజేపీ యువమోర్చా జాతీయ కమిటీలో తెలంగాణకు నాలుగు పదవులు రావడం గర్వకారణమే. కానీ ఆ నాలుగు పదవుల వెనుక ఉన్న సమీకరణాలే ఇప్పుడు కమలదళంలో కలకలం రేపుతున్నాయి. విమర్శకుల అనుమానాలకు కొత్త బాధ్యులు తమ పనితీరుతో సమాధానం చెబుతారా..? లేక "పారాచూట్ పాలిటిక్స్" ఆరోపణలు మరింత ముదురుతాయా..? కార్యకర్తల ఆశలకు, అధిష్టాన నిర్ణయాలకు మధ్య ఏర్పడిన ఈ అంతరాన్ని ఎవరు పూడుస్తారు..? అన్నదే ఇప్పుడు కమలం దళంలో మిలియన్ డాలర్ల ప్రశ్న.




