Off The Record: తెలంగాణ బీజేపీ నేతలపై అధిష్టానం నిఘా!

Off The Record: తెలంగాణ బీజేపీలో నేతల జంపింగ్ ఆలోచనలు? కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో ఎంపీ భేటీ ప్రచారం, హైకమాండ్ ఆరాపై ప్రత్యేక వార్తా విశ్లేషణ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 28 Aug 2026 7:43 AM IST
Off The Record
X

Off The Record: తెలంగాణ బీజేపీ నేతలపై అధిష్టానం నిఘా!

Off The Record: తెలంగాణ కమలవనం నుంచి కొందరు నేతలు గోడ దూకే ప్రయత్నంలో ఉన్నారా..? అధికార కాంగ్రెస్‌తో మంతనాలు సాగిస్తున్నారా...? అది తెలిసే పార్టీ హైకమాండ్ నిఘా పెట్టిందా..? ఇదే అంశం ఇప్పుడు కాషాయదళంలో కలకలం రేపుతోందట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఓవైపు బీజేపీ వ్యూహాలు రచిస్తుంటే.....మరోవైపు సొంత పార్టీలోనే కొందరు నేతల రాజకీయ కదలికలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయట. ఇతర పార్టీల నేతలతో దోస్తాన్ లో ఉన్నారన్న ప్రచారం.

ఆసక్తికర పరిణామంగా మారిందట. అధికార కాంగ్రెస్‌తో కొందరు నేతలు సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం బీజేపీ వర్గాల్లో చర్చకు దారితీస్తోందట. ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లోనే... ఇతర పార్టీల నేతలతో టచ్‌లో ఉండే వ్యవహారం కుదరదని రాష్ట్ర నాయకత్వం గట్టిగానే హెచ్చరించినట్లు ప్రచారం జరిగింది. ఐనా కొందరు నేతల కదలికలపై అనుమానాలు మాత్రం తగ్గడం లేదట. పార్టీకి తెలియకుండా బయట రాజకీయ పరిచయాలు పెంచుకోవడం.. అదీ ఎన్నికల ముందు..! ఇలాంటి పరిణామాలు పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే నేతల కదలికలపై రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టిందన్న టాక్ వినిపిస్తోంది. పార్టీ టికెట్, పదవి, రాజకీయ భవిష్యత్తు అన్నీ బీజేపీలో ఉండి.. రాజకీయ మంతనాలు మాత్రం మరో పార్టీతో ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయట. తాజాగా..ఓ ఎంపీ కాంగ్రెస్‌ అగ్రనాయకత్వంలోని కీలక నేతలతో భేటీ అయ్యారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపిందట. ఆ ఎంపీ ఎవరు..? భేటీకి గల కారణాలేంటీ? ఏం చర్చించారు..? ఇదే ఇప్పుడు కమలం గూటిలో హాట్ టాపిక్గా మారిందట.

ఒకవైపు ఎంపీ వ్యవహారం... మరోవైపు కొందరు నేతలు ఇతర పార్టీలతో దోస్తాన చేస్తూ చెట్టాపట్టాలేసుకుని ఉన్నారన్న ప్రచార నేపథ్యంలో.. అనుమానం ఉన్న నేతలపై రాష్ట్ర నాయకత్వం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేని నేతలు ఎవరు..? ఇతర పార్టీల నాయకులతో తరచూ మాట్లాడుతున్న నేతలు ఎవరు? పార్టీ నిర్ణయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న వాళ్లు ఎవరు? అన్న కోణాల్లో ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ముఖ్యంగా అనుమానం ఉన్న కొందరు నేతలకు రాష్ట్ర నాయకత్వం స్వయంగా ఫోన్ చేసి మాట్లాడుతున్నారన్న ప్రచారం మరింత ఆసక్తిని రేపుతోంది. ఏం జరుగుతోంది..? ఎక్కడ ఉన్నారు..? ఎవరిని కలుస్తున్నారు..? ఏ రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు..? పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు యాక్టివ్‌గా లేరు..? ఇలాంటి అంశాలపై సమాచారం తీసుకుంటున్నట్లు బీజేపీ వర్గాల్లో చర్చ నడుస్తోందట. ఇది సాధారణంగా పార్టీ సమన్వయంలో భాగమా..? లేక... కొందరు నేతలపై ప్రత్యేకంగా అనుమానాలు రావడంతోనే ఈ నిఘా మొదలైందా? ఇదే ఇప్పుడు కాషాయ శిబిరంలో హాట్ టాపిక్. నిప్పు లేనిదే పొగ రాదన్న చర్చ ఆసక్తి రేపుతోందట. అయితే ఎవరు ఎవరితో టచ్‌లో ఉన్నారన్న దానిపై అధికారికంగా ఎలాంటి స్పష్టత లేనప్పటికీ... ప్రస్తుతం వినిపిస్తున్నవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారమే... దీంతో గూటిలో ఉన్న గుట్టు బయటపడకముందే లెక్క తేల్చే పనిలో నాయకత్వం ఉందా? అన్న చర్చ లేకపోలేదు.

రాష్ట్రంలో నేతల రాజకీయ కదలికలపై సేకరిస్తున్న సమాచారాన్ని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగుతోందట. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరైనా ఇతర రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపారా? లేక జరుపుతున్నారా..? ఎన్నికల ముందు పార్టీ మారే ఆలోచనలో ఎవరైనా ఉన్నారా..? లేక ఇవన్నీ కేవలం రాజకీయ గుసగుసలేనా..? ఇదే ఇప్పుడు అసలు సస్పెన్స్‌గా మారిందట. కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారంటున్న ఆ బీజేపీ ఎంపీ ఎవరు? ఎంపీ పేరు బయటకు రాకపోవడంతో.. “ఆయనేనా..? ఈయనేనా..?” అంటూ కమలం గూటిలోనే చర్చలు నడుస్తున్నాయట. ఎంపీపై జరుగుతున్న ప్రచారం నిజమేనా? కేవలం రాజకీయ ప్రత్యర్థులు పుట్టించిన పుకారా? అయితే ఈ ప్రచారానికి ఆధారమేంటి..? నిజంగానే కాంగ్రెస్ కీలక నేతలతో రాజకీయ చర్చలు జరిగాయా..? అని సవాలక్ష అనుమానాలు తెరపైకి వస్తున్నాయట. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ మార్పులు, చేరికలు కొత్తేమీ కాదు. అందుకే ప్రతి నేత కదలికను నిశితంగా గమనిస్తున్న పరిస్థితి ఉందట‌‌.

పార్టీ లైన్ కాకుండా...“తోక జాడిస్తే కత్తిరించుడే” అన్నట్టుగా కఠిన చర్యలకు అధిష్టానం సిద్ధమవుతుందా..? సైడ్ టాక్స్ మొదలెట్టిన ఆ ఎంపీ ఎవరు? ఎవరెవరు ఇతర పార్టీలతో స్నేహస్తం అందిస్తున్నారు ? హైకమాండ్‌కు ఎలాంటి నివేదిక వెళ్తుంది? ఎవరిపై వేటు పడుతుంది? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story