Off The Record: మోదీ క్యాబినెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేదెవరు ?

Off The Record: తెలంగాణ బీజేపీలో కేంద్ర మంత్రివర్గ మార్పులపై చర్చ సాగుతోంది. జాతీయ కార్యవర్గంలో పదవి దక్కని నేతలు ఇప్పుడు కేబినెట్ పదవులపై ఆశలు పెంచుకున్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 Aug 2026 11:34 AM IST
Off The Record
X

Off The Record: మోదీ క్యాబినెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేదెవరు ? 

Off The Record: కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పుల ప్రచారం, తెలంగాణ కాషాయ దళంలో కాక పుట్టిస్తోంది. మొన్నటి వరకు జాతీయ కార్యవర్గంలో పదవి కోసం ఎదురుచూసిన నేతలు... అక్కడ సీన్ రివర్స్ కావడంతో ఇప్పుడు కేబినెట్ బెర్త్‌పై ఆశలు పెట్టుకున్నారట.

జాతీయ కార్యవర్గంలో సున్నా... మరి కేంద్ర మంత్రి వర్గంలోనైనా లెక్క మారుతుందా..? ఇదే ఇప్పుడు తెలంగాణ కాషాయ శిబిరంలో వినిపిస్తున్న మాట. ఐతే పార్టీ పదవులు దక్కకపోతేనేం...కేంద్ర మంత్రి పదవులపై నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయట.

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలంటే... పార్లమెంట్‌లో బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలనే వాదన ‌ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో కూడా వినిపిస్తోంది.

ఎన్నికల్లో గెలిచి ఢిల్లీకి వెళ్లారు. పార్టీ కోసం పనిచేశారు...ఇప్పుడు "అమాత్య యోగం ఎవరికి?" అన్నదే అసలు ప్రశ్నగా మారింది. అందుకే.. ఢిల్లీ నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా? ఎవరి పేరు మోదీ-షా జోడీ జాబితాలో ఉంటుందా? అంటూ తెలంగాణ కమలనాథుల్లో ఉత్కంఠ పెరుగుతోంది...

ఇక కేంద్ర మంత్రి పదవుల రేసులో వినిపిస్తున్న పేర్లు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా బీసీ కోటాలో ఈటల రాజేందర్‌ లేక ధర్మపురి అరవింద్‌ పేర్లపై చర్చ జరుగుతోంది... బీసీ కోటాలో మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమ నేత, సౌమ్యుడు, వివాదరహితుడు, బలమైన బీసీ నేతగా ఈటలకు ఉన్న గుర్తింపు ఆయనకు ప్లస్‌ పాయింట్‌గా మారుతుందా?

లేదంటే..అరవింద్‌ దూకుడే ఢిల్లీ పెద్దలను ఆకట్టుకుంటుందా? ముక్కుసూటిగా మాట్లాడే తత్వం, రైతుల్లో పసుపు అరవింద్ గా గుర్తింపు, ఎటాక్ మోడ్ తో మాటకు మాట...అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ముక్కుసూటిగా విరుచుకుపడే నైజంతో పాటు ఉత్తర తెలంగాణలో బీజేపీకి బలం చేకూర్చే వ్యూహంలో భాగంగా అరవింద్‌కు అవకాశం దక్కుతుందా అన్న చర్చ సైతం లేకపోలేదు.

అంటే.. బీసీ కార్డు ఎవరి చేతికి ట్రంప్ కార్డుగా మారుతుంది? ఈటలకా? అరవింద్‌కా? ఇద్దరిలో ఎవరి వైపు అధిష్ఠానం చూస్తోంది...ఇక మహిళా కోటాలో డీకే అరుణ పేరు బలంగా వినిపిస్తోంది. మహిళా ప్రాతినిధ్యం, సీనియారిటీ, పాలమూరు సెంటిమెంట్..గతంలో మంత్రిగా చేసిన అనుభవం, అందులోనూ సీఎం సొంత జిల్లాలో సవాల్ చేసి ఎంపీగా గెలిచిన తీరు...

ఈ లెక్కలన్నీ డీకే అరుణకు కలిసొస్తాయా? మహాలక్ష్మి యోగం" ఆమె తలుపు తడుతుందా? అన్నది ఇప్పుడు బీజేపీ వర్గాల్లో చర్చ. ఒకవేళ సామాజిక సమీకరణాల్లో ఎస్టీ కోటాకు ప్రాధాన్యం ఇస్తే... ఎంపీ గోడం నగేష్ పేరు కూడా వినిపిస్తోందట.. బీసీ, మహిళ, ఎస్టీ... ఒక్కో సామాజిక సమీకరణం... ఒక్కో పేరును ముందుకు తెస్తోంది.

కానీ ఢిల్లీ పెద్దల మనసులో ఉన్న అసలు పేరు ఏది? అదే అసలు సస్పెన్స్!.... పిక్చర్‌ ఇంకా రిలీజ్‌ కాలేదు.. కానీ టీజర్‌ మాత్రం తెలంగాణ బీజేపీలో కాక రేపుతోంది. ఇక ఇప్పటికే కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ విషయంలోనూ ఢిల్లీ నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

ఒకవైపు పార్టీలో సీనియర్ నేత, సౌమ్యుడు, కేంద్రంలో కీ రోల్ పోషిస్తున్న కిషన్ రెడ్డి.... మరోవైపు పార్టీలో హిందుత్వ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్... తెలంగాణలో ఇప్పటి వరకు బీజేపీని ముందుండి నడిపించిన ఈ ఇద్దరికి... అధిష్ఠానం మరింత పెద్ద బాధ్యతలు అప్పగిస్తుందా? లేక కేంద్ర ప్రభుత్వంలోనే కీలక శాఖలు, అదనపు బాధ్యతలు ఇస్తుందా? లేక శాఖ మార్పులా? లేదంటే అంతకంటే పెద్ద రాజకీయ టాస్కా? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

కేంద్రంలో మంత్రివర్గ కూర్పు అనేది కేవలం పదవుల పందేరం కాదట. ప్రతి బెర్త్‌ వెనుక ఒక రాజకీయ లెక్క ఉంటుందట.. ప్రతి శాఖ వెనుక ఒక వ్యూహం ఉంటుందటా. తెలంగాణలో అధికార పీఠమే లక్ష్యంగా పెట్టుకున్న అధిష్ఠానం.. మరి ఎవరిని ముందుకు తెస్తుంది? ఎవరికి అదనపు బాధ్యతలు ఇస్తుంది? ఎవరిని ఢిల్లీకి దగ్గర చేస్తుంది? అన్నదే ఇప్పుడు కీలక పరిణామంగా మారిపోయిందట.

అసలు తెలంగాణకు ఎన్ని మంత్రి పదవులు వస్తాయి ? ఎవరికి అవకాశం ? ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యం? సీనియారిటీనా? సామాజిక సమీకరణాలా? పార్టీకి ఉపయోగపడే రాజకీయ లెక్కలా? ఢిల్లీ పెద్దలు ఏ లెక్కన ఈక్వేషన్ ఫిక్స్ చేస్తారన్నది అంతుచిక్కడం లేదట.

జాతీయ కార్యవర్గంలో చోటు దక్కకపోవడంతో ఒక రకంగా తెలంగాణ నేతలకు పెద్ద షాకింగ్ ట్విస్ట్ అనిపించిందనే చర్చ లేకపోలేదట. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో మార్పు, చేర్పుల నేపథ్యంలో పార్టీ పదవి పోయినా... మంత్రి పదవి రావచ్చు.. అన్న ఆశలు మళ్లీ తెలంగాణ నేతల్లో చిగురిస్తున్నాయట.

అయితే రాజకీయాల్లో ఆశలు పెట్టుకోవడం వేరు...అధిష్ఠానం ఆశీస్సులు పొందడం వేరు. ఢిల్లీ గడప తొక్కితే సరిపోదు... అమాత్య యోగం రావాలంటే మోదీ-షా , ఢిల్లీ పెద్దల మదిలో పేరు పడాలి...అన్నదే ఫైనల్...

మొత్తానికి... జాతీయ కార్యవర్గం కూర్పుతో తెలంగాణ బీజేపీలో ఆశలు ఆవిరయ్యాయి అనుకున్న వేళ.. కేంద్ర కేబినెట్‌ విస్తరణ ప్రచారం కొత్త ఆశలకు ఊపిరి పోసినట్టైంది.. మరీ ఎవరి పేరు బయటకు వస్తుందో.. ఎవరికీ తెలియదు... తలుపు దగ్గరికి వచ్చిన అదృష్టం ఎవరిది? తలుపు తెరిచేది ఎవరు? అమాత్య కుర్చీలో కూర్చోబోయేది ఎవరు? మోదీ–షా మదిలో ఉన్న ఆ ఒక్క పేరు బయటకు వచ్చే వరకు.....వేచి చూడాల్సిందే.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story