Off The Record: తెలంగాణ బీజేపీ కొత్త వ్యూహం!

Off The Record: తెలంగాణ బీజేపీలో కొత్త ఇన్‌ఛార్జుల ఎంట్రీతో రాజకీయం హీటెక్కింది. తొలి సమావేశంలోనే నేతల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 Oct 2026 7:58 AM IST
Off The Record
X

Off The Record: తెలంగాణ బీజేపీ కొత్త వ్యూహం!

Off The Record: తెలంగాణ బీజేపీలో సంస్థాగత మార్పులతో కొత్త నాయకత్వ జోష్ కనిపిస్తోంది. మిషన్ తెలంగాణలో భాగంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర సంస్థాగత ఇన్‌ఛార్జి మధుకర్, సహా ప్రబారి దశరథ్‌లతో జరిగిన సమావేశం రణరంగంగా సాగిందట. బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌ఛార్జి అభయ్ పాటిల్, జిల్లా అధ్యక్షులు, పలువురు ఇన్‌ఛార్జులు హాజరయ్యారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖైరతాబాద్ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, సర్ ప్రక్రియ, గ్రాడ్యుయేట్ ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినప్పటికీ.. ఈ సమావేశంలో పార్టీ ఇంటర్నల్ అంశాలు తెరమీదకు వచ్చాయట. ఇక కొత్త ఇన్‌ఛార్జులు వచ్చీ.. రావడంతోనే తొలి రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నేతలను గాడిలో పెట్టే విధంగా స్పీచ్ లు, వార్నింగ్‌లతో హడలెత్తించారట.

తెలంగాణకు కొత్త ఇన్‌ఛార్జులు వచ్చారు. వచ్చీ రావడంతోనే నేతలకు దిశానిర్దేశం కాదు.. డైరెక్ట్‌గా వార్నింగ్స్ ఇచ్చేశారట. రాష్ట్ర పదాధికారుల సమావేశం అంటే మామూలు మీటింగ్ అనుకున్న నేతలకు.. కొత్త ఇన్‌ఛార్జులు ఇచ్చిన క్లాస్‌తో మైండ్ బ్లాంక్ అయిందట. నేతల పనితీరుపై ఓ రేంజ్‌లో ప్రశ్నలు సంధించారట. ఇన్‌ఛార్జులు వేసిన ప్రశ్నలకు కొందరు నేతలు ఉక్కిరిబిక్కిరి అయ్యారట. పదవులు వచ్చాయి కదా అని.. కుర్చీకి అతుక్కుపోయి కూర్చుంటే కుదరదు. పదవులు వచ్చేదాకా ఒక తీరు.. పదవి వచ్చిన తర్వాత మరో తీరు అంటే కుదరదని తేల్చి చెప్పారట. పైరవీలు చేసుకుని పదవులు తెచ్చుకోవడం కాదు.. పార్టీ కోసం ఏం చేశారో చెప్పాలంటూ నిలదీశారట. కనీసం క్రియాశీల సభ్యత్వం కూడా లేని వాళ్లకు పదవులు ఎలా వచ్చాయి..? పదవులు తీసుకున్న తర్వాత పార్టీ కోసం కష్టపడుతున్నది ఎవరు..? కేవలం పదవి అనుభవించడానికి మాత్రమే వచ్చారా..? అంటూ నేతలపై ప్రశ్నల వర్షం కురిసిందట. ఇక నుంచి చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని.. అందరి చిట్టా తమ దగ్గర ఉందని ఇన్‌ఛార్జులు స్పష్టం చేశారట. ఇంతకాలం ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క అంటూ వార్నింగ్ ఇవ్వడంతో కొందరు నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయట. ఇక కొత్త ఇన్‌ఛార్జ్‌ల కొత్త లెక్కలు.. పాత నేతలకు కొత్త టెన్షన్ తెచ్చాయా..? అన్న మీమాంస లేకపోలేదట.

కొత్తగా నియమితులైన ఇన్‌ఛార్జులు రాష్ట్ర నేతల చిట్టా పట్టుకుని సమావేశం నిర్వహించారట. ముఖ్యంగా గత మున్సిపల్ ఎన్నికల ఖర్చుల పేరుతో డబ్బు నొక్కేసిన నేతలపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌ఛార్జి అభయ్ పాటిల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారట. అభ్యర్థులకు ఇవ్వాల్సిన డబ్బులు నొక్కేసిన వాళ్లపై కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారట. తప్పు ఎవరు చేసినా.. ఎంత పెద్ద నేత అండదండలు ఉన్నా.. వదిలే ప్రసక్తే లేదంటూ వార్నింగ్ ఇచ్చారట. ఇక ఒక జిల్లా అధ్యక్షుడు కూడా ఇదే అంశంపై నేరుగా స్పందిస్తూ.. నొక్కేసిన నేతలపై ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని సమావేశంలోనే కడిగి పారేశారట. దీనికి అభయ్ పాటిల్ భరోసానిస్తూ.. ఎన్నికల నిధులు నొక్కేసిన వారు.. ఎంతటి వారైనా సరే సహించేది లేదని తేల్చి చెప్పారట. అంతేకాదు అవసరమైతే డబ్బులు నొక్కేసిన నేతలపై క్రిమినల్ కేసులు సైతం పెట్టడానికి వెనుకాడేది లేదంటూ హింట్ ఇచ్చారట. అలాగే అభయ్ పాటిల్ స్ట్రిక్ట్.. ఆయన వెళ్ళిపోవాలని కొందరు నేతలు ఎదురుచూశారు. మొన్నటిదాకా తనను పార్ట్‌టైమ్ ఇన్‌ఛార్జ్ అంటూ ఎగతాళి చేసిన వాళ్లకు.. ఇక నేను ఫుల్‌టైమ్ బాధ్యతలతో వచ్చాను, ఎవరికీ భయపడేది లేదంటూ అభయ్ పాటిల్ డైరెక్ట్ ఎటాక్ చేశారట. పాటిల్ సెటైరికల్ పంచ్ డైలాగ్స్‌తో సభలో ఉన్నవారికి మతి పోయిందట.

మరోవైపు కొత్త సంస్థాగత ఇన్‌ఛార్జి మధుకర్ కూడా నేతల పనితీరుపై గట్టిగానే చురకలంటించారట. కొందరు జిల్లా అధ్యక్షుల పనితీరు సరిగ్గా లేదని మొహం మీదనే చెప్పేశారట. ఇక హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీసు ఏసీ గదుల్లో కూర్చుంటే పార్టీ బలోపేతం కాదని.. 90 శాతం మంది నేతలు గ్రామాలు, జిల్లాలు, నియోజకవర్గాలు వదిలేసి హైదరాబాద్‌లోనే ఉంటున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారట. మీ జిల్లా మీది.. మీ నియోజకవర్గం మీది.. అక్కడే ఉండి ప్రజల మధ్య పనిచేయాలని స్పష్టం చేశారట. ఇదే సమయంలో మీటింగ్‌లోనే ఫోన్ మాట్లాడిన ఓ నేతను బయటకు పంపించేశారట. ఎవరి జిల్లాలో వారు ఉండాలి.. కార్యకర్తల మధ్య తిరగాలి. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి.. లేదంటే పదవులు ఊడిపోయినా ఆశ్చర్యం లేదంటూ వార్నింగ్ బెల్స్ ఇచ్చేరట. మొత్తానికి పదాధికారులు, జిల్లా అధ్యక్షుల పనితీరు మారకుండా.. ఏసీ రూముల్లో కూర్చుంటే తెలంగాణలో అధికారం రాదు” అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారట. మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని.. దాన్ని బీజేపీకి అనుకూలంగా మల్చుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారట. తాగునీటి సమస్యలపై ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారట.

మొత్తానికి.. గతంలోనూ కొత్త ఇన్‌ఛార్జులు వచ్చారు.. క్లాస్ పీకారు. ఇలాంటి వార్నింగ్‌లు ఎన్నో వచ్చాయి.. ఆ తర్వాత కథ షరా మామూలే కావడం బీజేపీలో కొత్తేమీ కాదు. మరి ఈసారి మాత్రం సీన్ మారుతుందా..? లేక ఇది కూడా మరో రాజకీయ ట్రైలర్‌గానే మిగిలిపోతుందా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్