Off The Record: ప్రజల్లోకి వెళ్ళటానికి సిద్ధమైన తెలంగాణ బీజేపీ!

Off The Record: తెలంగాణలో ఆగస్టు 15 తర్వాత బీజేపీ పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేపడుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర పథకాల అజెండాతో క్షేత్రస్థాయిలోకి కమలనాథులు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 Aug 2026 11:07 AM IST
Off The Record
X

Off The Record: ప్రజల్లోకి వెళ్ళటానికి సిద్ధమైన తెలంగాణ బీజేపీ!

Off The Record: తెలంగాణ బీజేపీ ఇప్పుడు కొత్త గేమ్ మొదలుపెట్టబోతోందా..? ప్రజల్లోకి వెళ్లేందుకు పాదయాత్ర చేయాలా..? బస్సుయాత్ర చేపట్టాలా..? అనే దానిపై కాషాయ పార్టీ కసరత్తు చేస్తోందట. ఇందులో ఏదో ఒక ప్లాన్‌తో ఆగస్టు 15 తర్వాత తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచాలని భావిస్తోందట. ఇప్పటివరకు రాజధాని కేంద్రంగా సాగిన రాజకీయాలకు బ్రేక్ చెప్పి.. సభలు, సమావేశాలు, నిరసనలతో సాగిన రాజకీయాన్ని.. ఇక క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. పల్లెకు పోదాం.. ప్రజలతో మాట్లాడదాం.. స్థానిక సమస్యలు తెలుసుకుందాం అన్నట్టుగా ప్లాన్ రెడీ చేస్తున్నారట కమలనాథులు. పల్లెల్లో రైతు ఏం అంటున్నాడు..?

యువతకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయా..? మహిళలకు ప్రభుత్వ హామీలు ఎంతవరకు అందుతున్నాయి..? నిరుద్యోగుల పరిస్థితి ఏంటి..? ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో విద్యార్థుల అరిగోస, చిన్న వ్యాపారుల కష్టాలేంటి..? ఉద్యోగుల పెండింగ్ బకాయిలు. ఇలా ప్రతి సమస్యపై ప్రభుత్వంతో పోరాటమే లక్ష్యంగా పక్కా స్కెచ్ వేస్తున్నారట. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించడం.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడం.. రెండింటినీ ఒకే వేదికపైకి తీసుకురావాలనుకుంటున్నారట కాషాయ పార్టీ నేతలు.

బీజేపీ ముందున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే పాదయాత్ర చేయాలా..? బస్సుయాత్ర చేపట్టాలా..? అన్నదే. పాదయాత్ర అయితే నేతలు నేరుగా ప్రజలతో మమేకం కావచ్చు. నాయకుడు నేరుగా గ్రామాల్లో ప్రజల మధ్య నడుస్తూ ప్రతి సమస్య వినొచ్చు. ప్రతి అడుగు రాజకీయ సందేశంగా మారుతుంది. ప్రతి పల్లెలో అడుగుపెట్టి సమస్యలు వినొచ్చు. అదే బస్సుయాత్ర అయితే తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలు చుట్టేయొచ్చు. పట్టణాలు.. మండలాలు.. గ్రామాలను టచ్ చేయొచ్చు. జిల్లాల వారీగా భారీ కార్యక్రమాలు నిర్వహించొచ్చు.

అందుకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఫైనల్‌గాఏ రూపంలో యాత్ర చేసినా.. ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఉనికి కనిపించేలా చేయడమే టార్గెట్‌గా కనిపిస్తోంది. మరోవైపు.. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం.. కార్యకర్తలను యాక్టివ్ చేయడం.. స్థానిక సమస్యలపై పోరాటాలు పెంచడం కూడా ఈ కార్యాచరణలో భాగం కానుందట. అంటే ఇది కేవలం రోడ్లపై తిరిగే యాత్ర కాదు.. పార్టీ కేడర్‌కు కూడా పొలిటికల్ ఫ్యూయల్ నింపే యాత్రగా నిలవనుంది.

అయితే యాత్ర అంటే కేవలం జెండాలు పట్టుకుని తిరగడం కాదంటున్నారు కమలనాథులు. ప్రజా సమస్యలు ఒక వైపు.. కేంద్ర పథకాలు మరో వైపు.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఇంకో వైపు..! ఇవే ప్రధాన అజెండాగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. రైతులకు కేంద్రం నుంచి వస్తున్న పథకాలు ఏంటి..? యువతకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలేంటి..? మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలేంటి..? తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎన్ని..?

ఇవన్నీ జనానికి వివరించడంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయి..? స్థానిక సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు..? అనే అంశాలను కూడా బీజేపీ నేతలు ప్రజల ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే.. ఒక చేతిలో కేంద్ర పథకాల పుస్తకం.. మరో చేతిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల చిట్టా..! ఇదే ఫార్ములాతో జనంలోకి వెళ్తే రాజకీయంగా ఎంత మేరకు వర్కవుట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

మరి ఈ యాత్రలో ప్రధాన అస్త్రం ఏంటి..? ప్రజా సమస్యలు, ప్రభుత్వ హామీలు, అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైనే ప్రధాన ఫోకస్ పెట్టనున్నారట. గ్రామాల్లో రైతులతో సమావేశాలు..యువతతో ముఖాముఖి.. మహిళలతో చర్చలు.. నిరుద్యోగులతో భేటీలు.. చిన్న వ్యాపారులతో మాట్లాడటం.. ఇలా ఒక్కో వర్గాన్ని టచ్ చేస్తూ.. బీజేపీకి అనుకూల వాతావరణం సృష్టించాలనేది వ్యూహంగా కనిపిస్తోంది. అదే సమయంలో.. ప్రజలు చెప్పిన సమస్యలను ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉపయోగించుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడే మరో రాజకీయ లెక్క ఉంది.

యాత్ర ప్రజల సమస్యలు వినడానికి మాత్రమేనా..? లేక వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల వారీగా గ్రౌండ్ రిపోర్ట్ సేకరించడానికా..? ఎక్కడ పార్టీ బలంగా ఉంది..? ఎక్కడ బలహీనంగా ఉంది..? ఎక్కడ కాంగ్రెస్‌పై అసంతృప్తి ఉంది..? ఎక్కడ బీజేపీకి కొత్త ముఖాలు కావాలి..? ఇవన్నీ కూడా యాత్రలోనే తేల్చుకునే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

మొత్తానికి.... పాదయాత్ర కాని బస్ యాత్ర గానీ మొదలైతే అడుగడుగునా రాజకీయ వేడి.. ఊరూరా కాషాయ హడావుడి.. ఆగస్టు 15 తర్వాత తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారబోతోందా..? అసలు యాత్ర ఏ మార్గంలో సాగుతుంది..? ఎక్కడ మొదలవుతుంది..? ఎవరు ముందుంటారు..? ఏ జిల్లాలను టచ్ చేస్తుంది..? పూర్తి యాక్షన్ ప్లాన్ ఎప్పుడు సిద్దం చేయబోతున్నారు...? ఈ యాత్ర అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ లను రాజకీయంగా డిఫెన్స్‌లో పడేస్తుందా ? వచ్చే గ్రేటర్ హైదరాబాద్, గ్రాడ్యుయెట్స్ ఎన్నికల వేళ బస్ యాత్ర ఏ మేరకు లాభం చేకూరుతుందో అన్నది చూడాలి మరి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story