Off The Record: తెలంగాణలో బీజేపీ ప్లాన్ బి!

Off The Record: ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతు యాత్రకు బీజేపీ అధిష్టానం బ్రేక్ వేసిందా? కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సమష్టిగా యాత్ర చేపట్టే యోచనలో రాష్ట్ర నాయకత్వం.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 9 Sept 2026 7:51 AM IST
Off The Record
X

Off The Record: తెలంగాణలో బీజేపీ ప్లాన్ బి!

Off The Record: ఆదిలాబాద్‌ నుంచి అసెంబ్లీ వరకు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఆలోచనతో బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ రైతు యాత్రకు కసరత్తు చేశారట. ఆగస్టు 29న యాత్ర మొదలు పెట్టి.. సెప్టెంబర్‌ 7న అసెంబ్లీకి చేరేలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారట. కొన్ని నెలలుగా రూట్‌మ్యాప్‌, కార్యక్రమాల షెడ్యూల్‌.. రైతులతో సమావేశాలు, స్థానిక సమస్యలపై వివరాలు, సంపూర్ణ రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇలా ప్రతి సమస్యపై అన్నీ సిద్ధం చేసుకున్నారట.

అంతేకాదు ప్రధాని మోదీ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించేలా ప్రత్యేక ప్రచార సామగ్రితో పాటు.. మోదీ పేరుతో ప్రత్యేక పాటలు అదే విధంగా తన పేరుతో కూడా పాటలు సిద్ధం చేసుకున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా వినిపించింది. అంటే.. యాత్రకు ట్రాక్టర్ స్టార్ట్ చేయడమే మిగిలిందన్నమాట. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఎదురైందట పాయల్ శంకర్‌కు. పార్టీ అనుమతి కోరితే.. ఇప్పుడే వద్దు.. తర్వాత చూద్దామన్న సమాధానం వచ్చినట్టు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో యాత్రకు సిద్ధమైన పాయల్‌ శంకర్‌ అనుచరుల్లో నిరాశ నెలకొందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ బ్రేక్‌ తాత్కాలికమేనా..? లేక యాత్ర వెనుక మరేదైనా రాజకీయ లెక్కలు ఉన్నాయా..? అంటూ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు.

బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ప్రజా సమస్యలపై వరుస ఉద్యమాలతో దూకుడు పెంచింది. రైతు యాత్రకు మాత్రం ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు..? ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల మీద రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు దీక్ష, 22ఏ భూముల సమస్యపై మహేశ్వర్ రెడ్డి మహా దీక్ష చేయడం, ఇక సెప్టెంబర్ 7న బీజేవైఎం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం అసెంబ్లీని సైతం ముట్టడించారు.

అంటే ఒకటి కాదు రెండు కాదు బీజేపీ రాష్ట్ర అధిష్టానం నేతృత్వంలో వరుసగా ప్రజా సమస్యలు, వరుసగా ఆందోళనలు చేపట్టారు. ఇలా ప్రజా సమస్య కనిపిస్తే బీజేపీ పోరాటానికి సై అంటోంది. ఇదే సమయంలో రైతు సమస్యలపై పాయల్‌ శంకర్‌ ప్రతిపాదించిన యాత్రకు తక్షణ అనుమతి రాకపోవడం ఇప్పుడు పార్టీలో చర్చ రీసౌండ్ చేస్తోంది. అయితే పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మరో మాట మాత్రం వేరుగా ఉంది. రైతు సమస్యలపై యాత్రను బీజేపీ అధిష్టానం వ్యతిరేకించడం లేదట. కానీ యాత్ర అనేది కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ఉండాలన్న లైన్ రాష్ట్ర నాయకత్వం ఆలోచనగా ఉన్నట్టు చెబుతున్నారు. అంటే.. యాత్రకు ఫుల్ స్టాప్ కాదు. కామా మాత్రమే పెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బ్యానర్ మార్పు మాత్రమే అన్నట్టు తెలుస్తోందట.. ఇక రా‌ష్ట్రంలో రైతు సమస్యలపై ఫసల్‌ బీమా అమలు, రైతు బీమా సమస్యలు, సంపూర్ణ రుణమాఫీ, పంటల నష్టపరిహారం, సాగునీరు సమస్యలు ఇవన్నీ యాత్రలో ప్రధాన అంశాలుగా తీసుకెళ్లాలని పాయల్‌ శంకర్‌ అనుచరులు భావించినట్టు సమాచారం. కానీ రాజకీయాల్లో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు.“పొలం మనదే అయినా.. పంట ఎప్పుడు కోయాలో పెద్దలు చెబుతారు” అన్నట్టుగా.. ఇప్పుడు యాత్ర ఎప్పుడు? ఎలా? ఎవరి ? ఆధ్వర్యంలో అన్నది పార్టీ నిర్ణయంపైనే ఆధారపడినట్టు కనిపిస్తోందట.

రైతు యాత్ర విషయంలో పాయల్ శంకర్ వర్గాల్లో నిరాశ నెలకొన్నట్టు ప్రచారo జరుగుతోంది. ఎందుకంటే యాత్ర కోసం ముందస్తు కసరత్తు, రైతు సమస్యలపై అంశాల ఎంపిక, ప్రచారానికి ప్రత్యేక పాటలు, రూట్ మ్యాప్‌.. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అనుమతి రాకపోవడంతో అనుచరుల్లో అసంతృప్తి ఉందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయట. కానీ రైతు యాత్ర ఆగిపోయిందన్న నిరాశ అవసరం లేదన్న సంకేతాలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయట. అసెంబ్లీ సెషన్ తర్వాత కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రైతు సమస్యలపై యాత్ర చేపట్టే ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టు సమాచారం.

రూట్ మ్యాప్, షెడ్యూల్, ఎక్కడి నుంచి ప్రారంభం, ఎక్కడ ముగింపు.. మొత్తం యాత్ర వివరాలను తర్వాత ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం లేకపోలేదట. ఈ క్రమంలో పాయల్‌ శంకర్‌ అనుకున్న యాత్ర ఆగిపోయిందా..? లేక అదే యాత్రను పార్టీ పెద్ద ఫ్రేమ్‌లోకి తీసుకెళ్తుందా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట. దీంతో పార్టీలో వ్యక్తిగత కార్యక్రమాల కంటే సమష్టి కార్యక్రమం ఉండాలన్న రాజకీయ లెక్క వేసిందా..? అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోందట. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఊహాజనితమైన చర్చలే. మొత్తానికి పాయల్‌ శంకర్‌ మాత్రం ఇప్పటివరకు బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదట. కానీ రాజకీయాల్లో మౌనం కూడా ఒక్కోసారి మాటలకంటే పెద్ద సందేశమే ఇస్తుందంటారు రాజకీయ విశ్లేషకులు. యాత్ర ఆగిందా..? లేక యాత్ర వాయిదా పడిందా..? లేదంటే యాత్ర రూపమే మార్చనున్నారా..? ఇదే ఇప్పుడు అసలు సస్పెన్స్‌‌గా మారిపోయిందట.

మొత్తానికి యాత్రకు సర్వం సిద్ధం. కానీ చివరి నిమిషంలో సిగ్నల్ ఆగిపోయిందన్నమాట. అసెంబ్లీ సెషన్స్ తర్వాత రాష్ట్ర నాయకత్వం ఏం డిసైడ్ చేయబోతోంది.. ? పాయల్‌ శంకర్‌ అనుకున్నట్టే యాత్ర షురూ అవుతుందా..? లేదంటే కిసాన్‌ మోర్చా పేరుతో కొత్త రూపంలో యాత్ర ముందుకు సాగుతుందా..? అన్నది చూడాలి మరి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story