Off The Record: ఈసారి యువ నాయకులకే బీఆర్ఎస్ టిక్కెట్లు!

Off The Record: బిఆర్‌ఎస్‌లో నయా రాజకీయం. గతంలో ఓడిపోయిన వారికి నో టికెట్? గ్రౌండ్ రిపోర్ట్, జెన్-జీ యువత, మహిళా ప్రాతినిధ్యం అజెండాగా కేసీఆర్ కొత్త పొలిటికల్ వ్యూహం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 Aug 2026 11:20 AM IST
Off The Record
X

Off The Record: ఈసారి యువ నాయకులకే బీఆర్ఎస్ టిక్కెట్లు!

Off The Record: తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు పార్టీని అంతగా పట్టించుకొని బిఆర్‌ఎస్ అధినాకత్వం ఇప్పుడు దూకుడుగా వెళ్తోందన్న టాక్ రీసౌండ్ చేస్తోంది. ఇది పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. గులాబీ పార్టీ అధిష్టానం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోందన్న చర్చ లేకపోలేదు.

ఈసారి ఎన్నికల్లో ఎవరెవరికి అవకాశాలు ఇవ్వాలి..? టికెట్లు కేటాయించకపోతే మిగతా కీలక పదువులు ఎలా కేటాయించాలి..? ఎవరెవరు పార్టీ కోసం పని చేస్తున్నారు..? రాబోయే రోజుల్లో ఎవరికి ఛాన్స్ ఇస్తే పార్టీని గెలిపిస్తారు..? ఎవరెవరు ప్రజల్లో మమేకం అవుతున్నారు..? ఇవే అంశాలు ప్రామాణికంగా కారు పార్టీ ఆలోచన చేస్తోందట. అయితే గత ఎన్నికల్లో లాగా కాకుండా.. పాత నేతలకు బీఆర్ఎస్ ఈసారి షాక్ ఇవ్వనుందన్న టాక్ బలంగానే వినిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత బిఆర్‌ఎస్ నేతలకు పదవులు ఇస్తూ వచ్చింది. 2018 ఎన్నికల్లో ఏకంగా 88 స్థానాల్లో విజయ దుంధుబి మోగించి అధికారకలోకి దూసుకొచ్చింది కారు పార్టీ. కానీ.. 2023 ఎన్నికల్లో ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతనో మరో కారణమో కానీ.. 39 స్థానాలకే పరిమితమై ప్రతిపక్షం కూర్చోవాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని గుణపాఠంగా తీసుకుని.. గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపే దిశగా ఆ పార్టీ అధినేతలు ప్రయత్నిస్తునే ఉన్నారు. రాబోయే ఎన్నికల నాటికి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అవసరమైన సర్వ శక్తులూ ఒడ్డుతోంది పార్టీ హైకమాండ్.

ఇదే క్రమంలో 2018 ఎన్నికల సమయంలో కారు పార్టీ 100కు పైగా స్థానాలు గెలుస్తుందని ఆశించినా.. 88 స్థానాలకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు జనంలో లేనట్టే లెక్క అని పార్టీ అధినేతలు ఎన్నో సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అలా ఓటమి చవిచూసిన అభ్యర్థులకు మరోసారి ఛాన్స్ ఇవ్వకూడదని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2023 ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశం ఉన్న చాలా చోట్ల గులాబీ బాస్ కేసీఆర్ ఫోటో చూసి ప్రజలు గెలిపిస్తారని ధీమాగా ఉండటమే పార్టీకి మైనస్ అయినట్టు చెబుతున్నారు.

2018లో ఓడిని పార్టీ అభ్యర్థులకు మళ్లీ ఛాన్స్ ఇవ్వొ్ద్దని డిసైడ్ అయిన బీఆర్ఎస్.. 2023 ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై ఈపాటికే విశ్లేషణ చేసుకుందట. వరుసగా మూడుసార్లు కొంతమంది నేతలకు అవకాశం ఇవ్వడం.. ఓటమికి ఒక కారణమైతే, కొంతమంది ప్రజల్లో లేకపోవడం మరో కారణమైందని భావిస్తున్నారు.

2023లో ఓడిపోయిన అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాలలో ఉన్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా టికెట్లు ఇవ్వనున్నారని సమాచారం. మరోవైపు.. దేశవ్యాప్తంగా జెన్ జీ యువత జోష్ కనిపిస్తున్న నేపథ్యంలో యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. జెన్ జీ యువత రాజకీయాల్లోకి రావడం ఎంతైనా అవసరం. ఆ లెక్కన యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.

ఇందులోభాగంగా యువతపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. యువతను ఆకర్షించి వారికి అవకాశాలు కల్పించడం ద్వారా పార్టీని బలోపేతం చేయొచ్చన్న అంచనాలు వేస్తోంది కారు పార్టీ. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అమలైతే తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగడమే కాక మహిళల ప్రాధాన్యం కూడా పెరుగుతుంది.

ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ముఖాలతోపాటు యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించే ఛాన్స్ లేకపోలేదు. బీఆర్ఎస్ పెద్దలు ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి మరి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story