Off The Record: వచ్చే అసెంబ్లీ సమావేశాల కోసం కేసీఆర్ వ్యూహం!

Off The Record: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై అసెంబ్లీలో నిలదీసేందుకు బీఆర్‌ఎస్ సిద్ధం. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ అత్యవసర భేటీ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Sept 2026 7:56 AM IST
Off The Record
X

Off The Record: వచ్చే అసెంబ్లీ సమావేశాల కోసం కేసీఆర్ వ్యూహం!

Off The Record: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు అవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని బిఆర్‌ఎస్ మండిపడుతోంది. అసెంబ్లీ వేదికగానే తేల్చుకోవడానికి సిద్ధం అయ్యింది. ప్రభుత్వనికి కౌంటర్‌ను కూడా ప్రిపేర్ చేసుకుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఏర్పడి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ సాధించిన ప్రగతిని అసెంబ్లీ వేదికగా ప్రజలకు తెలియజేయాలని అధికార పక్షం భావిస్తోంది.

ఇదే సమయంలో కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీలోనే నిలదీస్తామని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చెబుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై గులాబీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరో ముఖ్య నాయకుడు హరీష్ రావు జిల్లాల్లో పర్యటిస్తూ బీఆర్ఎస్ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారు.

రైతులు, మహిళలే, దివ్యాంగులు, ముఖ్యంగా యువత సమస్యలపై ప్రభుత్వ తీరును ఎండగడుతోంది. వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని కారు పార్టీ విమర్శిస్తోంది.

ఇదే అజెండాపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ సమావేశం కాబోతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ కబురు పంపారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో సొంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేయబోతున్నారు.

అసెంబ్లీలో ఏ అంశాలను లేవనెత్తాలి.. ప్రజా సమస్యలను ఏ విధంగా చర్చలో ఉంచాలి అనేదానిపై కేసీఆర్ సూచనలు, సలహాలు చేయబోతున్నారు. ఇదే సమయంలో 22ఏ భూ నిషేధిత జాబితా అంశంపై సభను స్తంభింపజేయాలని గులాబీ పార్టీ భావిస్తోందట. నిజానికి 22ఏ నిషేధిత జాబితా అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా అసెంబ్లీలో ప్రస్తావించాలన్న వ్యూహంతో బీఆర్ఎస్ పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటోంది.

పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించి జీవో నెంబర్ 97 వెనక్కి తీసుకోవాలని హరీష్ రావు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. లక్ష మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించిన అంశం కావడంతో ఈ అంశాన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావించనుంది. అయితే అసెంబ్లీలో ఏ సబ్జెక్ట్‌పై ఎవరు మాట్లాడాలనే విషయాన్ని కూడా కేసీఆర్ సూచించనున్నారట.

ఇంతకీ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా? లేదా అనే అంశం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ పూర్తిగా ఫాంహౌస్ కే పరిమితం అయ్యారు. ఒకటి రెండుసార్లు తప్ప అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు.

అయితే కేసీఆర్ సభకు హాజరై తమకు సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి.. పదేపదే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తున్నారు. కేసీఆర్ మాత్రం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎక్కడా పట్టించుకోవట్లేదు. గత రెండున్నరేళ్ళుగా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటూనే వస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు తాము సరిపోతామని కేసీఆర్ అవసరం లేదని కేటీఆర్, హరీష్ రావు చెబుతూ వస్తున్నారు.

ముఖ్యమంత్రిగా గెలిచాకే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారని తాజాగా కేటీఆర్ వ్యాఖ్యానించడం హాట్ టాపికైంది. మరోవైపు వెయ్యి రోజులుగా ఫామ్ హౌంకే పరిమితమైన కేసీఆర్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో కాంగ్రెస్ పార్టీ మహాధర్నాకు రెడీ అయింది. దీంతో అధికార పక్షానికి.. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో.. అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి వ్యూహాలతో అడుగులు వేస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story