Off The Record: జెన్-జీ యువతను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు!
Off The Record: 2027 మార్చి తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 77 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్లాన్.
Off The Record: జెన్-జీ యువతను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు!
Off The Record: 2027 మార్చి తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరుగనున్నాయి. అధికార పార్టీకి ఇది పెద్ద సవాల్‌గా మారింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 34 నియోజకవర్గాలు.. అలాగే ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిలాల్లోని 43 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి.
తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉంటే.. 2027 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మొత్తం 77 నియోజకవర్గాల్లో ఉంటాయి. మరోవైపు ఇవి గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావడంతో హస్తం పార్టీకి గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే రానున్న సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలపై ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదు.
ఒకవైపు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. సామజిక సమీకరణాలు సైతం పక్కకు పెట్టి రెండు సీట్లు ఒకే వర్గానికి ఇచ్చిన పర్వాలేదు.. కానీ పక్కాగా గెలవడమే టార్గెట్ అంటోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. జిల్లా ఇంఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, నాయకులు.. సమావేశాలు పెట్టి పలు లోకల్ నాయకుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు.
ఇందులో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి ప్రధానంగా మాజీ విజయ డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి బరిలో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీరితోపాటు బీసీ, యువత కోటాలో పీసీసీ జనరల్ సెక్రటరీ, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నేత, గౌడ సామజికవర్గానికి చెందిన చనగాని దయాకర్, అలాగే పీసీసీ అధికార ప్రతినిధి, NSUI నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న ఖమ్మం జిల్లాకి చెందిన నేత బీసీ, యువత కోటలో యాదవ సామజికవర్గం నుంచి లోకేష్ యాదవ్‌లు టికెట్ ఆశిస్తున్నారు.
ఇక ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిలాల్లో మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి సైతం పోటీ ఎక్కువగానే ఉందట. మాజీ మీడియా కమిటి చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్‌పై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదూ... టికెట్ ఎలాగైనా చేజిక్కించుకునేలా అన్ని రకాల ప్రయాత్నాలు చేస్తున్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నారని టాక్. గ్రాడ్యుయేట్‌గా కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లు అన్ని ఉన్నాయట.
అలాగే యూత్ కాంగ్రెస్ ఎన్నికలో ఎన్రోల్మెంట్ చేసిన అనుభవం ఉంది. దీంతో యూత్ కోటాలో టికెట్ బలంగానే ఆశిస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకుల్లో ఆయన పేరు చర్చలో కూడా ఉన్నట్లు సమాచారం. ఇక వీరితోపాటు రేసులో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, శివసేనా రెడ్డి సైతం పార్టీ పెద్దల దగ్గర పావులు కదుపుతున్నారట. ఇక బీసీ కోటాలో మాజీ ఎంపీ మధు యాష్కీ, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, పీసీసీ అధికార ప్రతినిధి, విజ్ఞన్ విద్యా సంస్థల చైర్మన్, బీసీ కోటాలో గౌరీ సతీష్ బలంగా టికెట్ ఆశిస్తున్నారట.
ఇదంతా ఒక ఎత్తయితే.. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా పార్టీలో అంతర్గతంగా హాట్ టాపికైంది. 21 ఏళ్లకే ఎమ్మెల్యేకు అర్హత, 25 ఏళ్లకే ఎమ్మెల్సీ, ఎంపీకి అవకాశం కల్పించాలని ఆయన ప్రతిపాదించడం సంచలనంగా మారిందట. ఇపుడు గాంధీభవన్‌తోపాటు కాంగ్రెస్ నాయకులు, కేడర్‌లో ఇదే చర్చ జరుగుతోందట. మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదినకు పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తోందట. ఒక దశలో 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా అవకాశం కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని భావించారు. అయితే సీఎం ప్రతిపాదన బాగున్నప్పటికీ.. మాట నిలబెట్టుకోవాలంటే.. ముందుగా కేబినెట్‌లో జెన్ జీ యువతకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
అంతేకాదూ.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచిన యువ ఎమ్మెల్యేల పేర్లు కూడా సూచించారట. వారిలో యశస్వినీ రెడ్డి, మైనంపల్లి రోహిత్, బలమూరి వెంకట్, పరిణికారెడ్డి పేర్లు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా జెన్ జీ యువతకు పెద్దపీట వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న టాక్ జోరందుకుంది.
ప్రతిపక్షాల సూచనలకు కాంగ్రెస్ పార్టీ సై అంటూ రెండు గ్రాడ్యుయెట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెన్ జీ యువతకు ఛాన్స్ ఇస్తుందా..? లేదా..? అన్నది ఉత్కంఠగా మారింది.




