Off The Record: రేవంత్ మెడకు మంత్రి పదవుల పందేరం

Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ, ప్రక్షాళన ప్రక్రియ వేగవంతమైంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 May 2026 6:40 AM IST
Off The Record
X

Off The Record: రేవంత్ మెడకు మంత్రి పదవుల పందేరం

Off The Record: అంతులేని కథలా సాగుతోంది తెలంగాణలో కేబినెట్ విస్తరణ. రేవంత్ సర్కార్‌ కొలువుదీరాక.. ఇప్పటి వరకు రెండు సార్లు విస్తరణ చేపట్టినా ఇంకా రెండు స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. ఆశావహులు చాలా మంది ఉండటం, సామాజిక, ప్రాంతీయ లెక్కలు తేలకపోవడంతో.. వాటిని పెండింగ్‌లోనే పెట్టింది హైకమాండ్. అల్రెడీ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రెండున్నరేళ్లు గడిచిపోవడంతో.. త్వరలో మిగిలిన ఆ రెండు స్థానాలను భర్తీ చేయాలని అధిష్టానం ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఆ దిశగా.. సీఎం రేవంత్, రాష్ట్ర నాయకత్వం.. హైకమాండ్‌తో మంతనాలు జరుగుతున్న నేపథ్యంలో.. పదవులు ఆశిస్తున్న వారంతా అలెర్ట్ అయ్యారు. పదవీని ఒడిసిపట్టేందుకు అంతర్గత పోటీ మరింత తీవ్రతరం అయ్యింది. ఎవరికి వారు ఢిల్లీ బాట పట్టి.. అగ్రనేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు.

మంత్రి పదవి ఎంపిక తమ చేతుల్లో ఏం లేదని,, ఏదైన ఉంటే ఢిల్లీలో తేల్చుకోవాలని ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం క్లారిటీ ఇచ్చేసింది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానం స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాలతో పాటు, పనితీరు ఆధారంగా కొందరిని మార్చే అవకాశం ఉందన్న ప్రచారంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. సీనియర్‌ ఎమ్మెల్యేలతో పాటు సామాజిక, ప్రాంతీయ సమీకరణాల రీత్యా అవకాశం వస్తుందని భావిస్తున్న నేతలు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి శనివారం ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని కలిశారు. మూడు తరాలుగా తాము కాంగ్రెస్‌ పార్టీనే నమ్ముకుని ఉన్నామని, బీఆర్‌ఎస్‌ ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా కాంగ్రెస్‌ను వీడలేదని, తన నిబద్ధత, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని విన్నవించారు. ఈ విషయం తెలిసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హుటాహుటిన శనివారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తనకే అవకాశం కల్పించాలని గతంలో విన్నవించిన ఆయన.. మరోసారి తన ప్రయత్నాలను ముమ్మరం చేసేందుకు హస్తిన బాట పట్టారు. వీరిద్దరితో పాటు మరికొందరు ఆశావహులు కొంతకాలంగా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు లాబీయింగ్‌ మొదలుపెట్టారు. గతంలో ఇచ్చిన హామీలు, పార్టీ కోసం చేసిన త్యాగాలను గుర్తుచేస్తూ.. అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టేసేందుకు ఎవరి వ్యూహాల్లో వారు బిజీగా ఉన్నారు.

కేబినెట్‌లో.. రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాకే ప్రాతినిథ్యం దొరకలేదు. దీంతో ఎక్కువగా ఆయా జిల్లాల నుంచి ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయట. తమ జిల్లా నుంచి తనకే పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారట. ఈసారి క్యాబినెట్‌ విస్తరణలో సామాజిక సమతుల్యతతో పాటు రాబోయే ఎన్నికల వ్యూహాలకు పెద్దపీట వేయాలని హైకమాండ్‌ భావిస్తున్నట్లు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చే నివేదికలు, పార్టీ అంతర్గత సర్వేల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఎవరికి లభిస్తాయి?, ఎవరికి మంత్రి పదవి వరిస్తుంది?, ఎవరి పదవులకు ఎసరు వస్తుంది? అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మంత్రి పదవుల కోసం ప్రధానంగా పోటీ పడుతున్న వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే పి. రామ్మోహన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్సీ విజయశాంతి పేర్లు వినిపిస్తున్నాయి.

కొంతమంది సీనియర్ మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే అవకాశం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులను కేబినెట్ నుండి తొలగించే అవకాశం ఉందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కొందరు నిత్యం వివాదాల్లో ఉండటం, మరి కొందరిపై అవినీతి ఆరోపణలు రావడం...అలాగే కేటాయించిన శాఖలో పెద్దగా ప్రోగ్రెసేమీ కనిపించని వారిపై వేటు వేసే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో మొత్తం నాలుగు నుంచి.. ఐదుగురికి.. కొత్తగా చోటు కల్పిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎస్టీ సామాజిక వర్గానికి కేబినెట్ లో ప్రాతినిధ్యం లేకపోవడంతో సీనియర్ ఎమ్మెల్యే అయిన బాలు నాయక్ కు అవకాశం దక్కే చాన్స్ ఉంది. రంగారెడ్డి జిల్లానుంచి ప్రాతినిధ్యం లేకపోవటంతో మల్ రెడ్డి రంగారెడ్డికి అవకాశం దక్కే చాన్స్ ఉంది. మరో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం మార్పులు చేర్పుల్లో భాగంగా అవకాశం దక్కే చాన్స్ ఉంది. మున్నూరు కాపు, ఒక బిసి నేతకు సైతం ఇదే కోటాలో చాన్స్ దక్కే అవకాశం ఉంది. కొత్తగా ఉన్న రెండు,, ప్రక్షాళనలో ఖాళీ అయ్యే మూడు.. మొత్తంగా కేబినెట్ లోకి ఐదుగ్గురికి చాన్స్ దక్కే అవకాశం ఉంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి పదవుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ విస్తరణతో పార్టీలో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి నేతల ఢిల్లీ టూర్లు ఫలిస్తాయా..? నేతల వినతులను.. అధిష్టానం ఆలకిస్తుందా చూడాలి.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story