Off The Record: కాంగ్రెస్ దీపావళి ధమాకా!
Off The Record: తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. తొలి దశలో సుమారు 50 కీలక పదవులను దీపావళిలోగా భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
Off The Record: కాంగ్రెస్ దీపావళి ధమాకా!
Off The Record: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, బోర్డులు, డెవలప్మెంట్ అథారిటీల్లో పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీల సంఖ్యపై భిన్న అంచనాలు ఉన్నప్పటికీ, తొలి దశలో సుమారు 50 కీలక పోస్టుల భర్తీపైనే కాంగ్రెస్ నాయకత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసిన నేతలకు ఈసారి ఎక్కువ అవకాశాలు కల్పించాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం.
అంతేకాకుండా గతంలో నామినేటెడ్ పదవులు పొందిన వారి పనితీరు, పార్టీ కార్యక్రమాల్లో వారి చురుకుదనం కూడా పరిశీలించే అవకాశం ఉందంటున్నారు. సామాజిక సమీకరణాలకూ ఈ ప్రక్రియలో ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. కులగణన వివరాలను కూడా పరిగణనలోకి తీసుకుని, ఇప్పటివరకు తక్కువ ప్రాతినిధ్యం పొందిన వర్గాలకు అవకాశాలు ఇవ్వాలని ప్రతిపాదనలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో ఇప్పటికే చైర్మన్ పదవులు నిర్వహించిన వారికి మరోసారి అవకాశం ఇవ్వాలా..? లేక కొత్త ముఖాలకు ప్రాధాన్యం కల్పించాలా..? అనే అంశంపై కూడా తీవ్ర చర్చ జరుగుతోందట. 2024 జూలైలో నియమితులైన పలువురు కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం పూర్తయ్యడంతో వారి భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కొందరిని కొనసాగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, తుది నిర్ణయం మాత్రం పార్టీ అధిష్టానం చేతుల్లోనే ఉంది.
నామినేటెడ్ పోస్టుల భర్తీపై గతంలోనూ పలుమార్లు చర్చ జరిగినా.. రాజకీయ, సంస్థాగత కార్యక్రమాల కారణంగా ప్రక్రియ పదేపదే వాయిదా పడింది. అయితే ఈసారి మాత్రం ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎప్పటి పెండింగ్లో ఉన్న ఈ ప్రక్రియను వేగవంతం చేసి, దీపావళిలోగా నియామకాలను పూర్తి చేయాలనే లక్ష్యంపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చర్చించినట్లు ప్రచారం సాగుతోంది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా నామినేటెడ్ పోస్టుల ఆశావహుల్లో మళ్లీ ఉత్కంఠ నెలకొంది. తమకు అవకాశం దక్కేలా ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ ముఖ్య నేతల ద్వారా సిఫార్సులు చేయించుకునేందుకు పలువురు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే సమయంలో కొన్ని పోస్టుల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ, నామినేటెడ్ పోస్టుల వ్యవహారం మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చాంశంగా మారింది.




