Off The Record: పాలమూరు కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్యపోరు!

Off The Record: కాంగ్రెస్‌లో ముదురుతున్న అంతర్గత పోరు. వనపర్తిలో చిన్నారెడ్డి వ్యాఖ్యలు, ఎమ్మెల్యే మేఘారెడ్డి కౌంటర్ అటాక్‌తో పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Aug 2026 12:33 PM IST
Off The Record
X

Off The Record: పాలమూరు కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్యపోరు!

Off The Record: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అడపాదడా ఆ పార్టీలో చిన్నచిన్న గొడవలతోపాటు పెద్ద గొడవలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా కాంగ్రెస్‌ పార్టీలో గొడవలు, ఆధిపత్య పోరు వెరీ కామన్ అన్న టాక్ లేకపోలేదు.

ఈ క్రమంలో రీసెంట్‌గా వనపర్తి నియోజకవర్గంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పైసలకు ఆశపడి అధిష్టానం నాకు టికెట్ ఇవ్వలేదంటూ ఆయన చేసిన వివాదాస్పద కామెంట్స్ ఇప్పుడు రాజకీయ అగ్గి రాజేశాయి.

దీంతో చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పెద్దలు కేసీ వేణుగోపాల్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తోపాటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు.

అంతకుముందు ఫిరాయింపు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ అధిష్టానం పెద్ద తప్పిదం చేసిందంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. సీమాంధ్ర నాయకులు, పత్రికల వాళ్ళ చెప్పు చేతుల్లో కాంగ్రెస్ పార్టీ ఉండకూడదన్నారు.

మొదటి నుంచీ పనిచేసిన వారికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్‌ల కోసం కాకుండా పేద ప్రజల కోసం కాంగ్రెస్ పని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి సమర్ధించారు.

రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఒక అగ్నిపర్వతం, వోల్కనో.. ఆయనకు కోపమొచ్చిందంటే ఒక అగ్నిపర్వతం పేలినట్టు పేలుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ ఎప్పుడూ మంత్రి పదవి కావాలని కొట్లాడలేదన్నారు. అంతర్గత తప్పిదాలను ఎత్తిచూపితే పార్టీకే మేలు జరుగుతుందన్న వాదన వినిపించారు అనిరుధ్ రెడ్డి.

చిన్నారెడ్డి చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే మేఘారెడ్డి తిప్పికొట్టారు. చిన్నారెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బిఫామ్ కొనుక్కున్నానని విమర్శించడం తగదని, చిన్నారెడ్డి ఎన్నిసార్లు డబ్బులిచ్చి టికెట్ కొనుక్కున్నారో చెప్పాలని ఎదురుదాడి చేశారు. ఈ ఇద్దరి నేతల మధ్య వైరం 2023 ఎన్నికల ముందు నుంచీ నివురుకప్పిన నిప్పులా కొనసాగుతూ వస్తోంది.

చిన్నారెడ్డి తరహాలోనే అసంతృప్తిలో ఉన్న మరికొందరు సీనియర్‍ నేతలు కూడా వ్యతిరేక స్వరాలు వినిపిస్తారా..? అన్న చర్చ కూడా వినిపిస్తోంది. క్రమశిక్షణ కమిటి చైర్మన్‍ హోదా తప్పించి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్‍ రెడ్డి.. తన రాజకీయ గురువు అయిన చిన్నారెడ్డిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి సూచిస్తారోనన్నది ఉత్కంఠ రేపుతోంది.

ఏది ఏమైనా ప్రజాస్వామ్య పార్టీకి మారుపేరుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌లో ఇలా ఆధిపత్య పోరు.. ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. అలాగే.. క్రమ శిక్షణ కమిటీ చర్యలు ఎలా ఉండనున్నాయో మరి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story