Off The Record: పదవులు రెన్యువల్ అయ్యేది ఎంత మందికి
Off The Record: తెలంగాణలో నామినేటెడ్ పదవుల రెన్యూవల్ పై కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ.
Off The Record: పదవులు రెన్యువల్ అయ్యేది ఎంత మందికి
Off The Record: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పార్టీ పదవులతో పాటు.. నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టింది. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి.. అలాగే ఎన్నికల టైంలో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వాములుగా చేసింది. మొదటి విడతలో భాగంగా 37కిపైగా కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమించింది. రెండో దఫాలో కుల సంఘాల కార్పొరేషన్ చైర్మన్లను భర్తీ చేసింది. అయితే మొదటి దఫాలో భర్తీ అయిన కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం ముగింపు దశకు చేరుకుంది. దీంతో త్వరలోనే.. ఆయా స్థానాలకు ఎంపిక చేయనుంది ప్రభుత్వం. దీంతో ప్రస్తుతం ఉన్న వారిలో ఎంత మంది రెన్యువల్ అవుతారు.. పోస్టు ఉండేది ఎవరికి..ఊడేది ఎవరికి..ఉద్వాసనకు గురైవారి స్థానంలో కొత్తగా ఎవరికి ఇస్తారన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఎవరెవరికి రెన్యువల్ అవుతుంది, ఎవరికి కాదు అని నేతల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్లపై మూడు రకాలుగా రిపోర్ట్ తెప్పించారట సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో ఎవరు మంచిగా పని చేశారు. వివాదాలకు దూరంగా ఉంటూ పార్టీని, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసిన వారికి మరొక మారు అవకాశం కల్పించాలని ఫిక్స్ అయ్యారట సీఎం. కేవలం 13మందికి మాత్రమే ఇప్పటి వరకు రెన్యువల్ అయ్యే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతుంది.
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సతీమణి టీజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఫిషరీ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ. ఫహీం, ఈరవత్రి అనిల్ ,ప్రీతమ్, ఎం.డి. రియాజ్, పటేల్ రమేష్ రెడ్డి, కల్వ సుజాత, అన్వేష్ రెడ్డి, నూతి శ్రీకాంత్ లకు రెన్యూవల్ ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే వీరికి మళ్ళీ అవే కార్పొరేషన్ చైర్మన్ లు దక్కుతాయా లేక మార్పులు చేర్పులు ఉంటాయా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.
పార్టీ కోసం కష్టపడి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో తమ వంతు పాత్ర పోషించిన కొందరికి ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్‌లుగా అవకాశం లభించింది. కానీ ఇంకా కొంత మందికి ఎలాంటి పదవులు దక్కలేదు. ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు చాలా మందే ఉన్నారు. ఇదిలా ఉంటే..రీసెంట్ గా నియమించిన ఫెడరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్ లుగా కొందరికి అవకాశం కల్పించింది అధిస్థానం. ఏ పదవీ రాని వారు.. త్వరలో భర్తీ కాబోయే కార్పొరేషన్ పోస్టులపై భారీ ఆశలే పెట్టుకున్నారట. అందుకోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో లోకేష్ యాదవ్, లింగం యాదవ్, గౌరీ సతీష్,బండి సుధాకర్ గౌడ్,సత్యం శ్రీ రంగం,పవన్ మల్లాది,జ్ఞాన సుందర్, రాచ మల్ల సిద్ధేశ్వర్, రవళి రెడ్డి,ఇందిరా శోభన్,సునీత రావు,వరలక్ష్మీ ఇలా ఎవరికి వారు కార్పొరేషన్ చైర్మన్ వైస్ చైర్మన్ ల కోసం ప్రయత్నం చేస్తున్నారు.
మొత్తానికి..వివిధ కార్పొరేషన్ పోస్టుల భర్తీ.. పార్టీలో ఉత్కంఠ రేపుతోంది. ఎవరికీ రెన్యువల్ అవుతుంది. ఎవరికి కాదు. కొత్తగా కార్పొరేషన్ చైర్మన్ లుగా ఎవరికి అవకాశం వస్తుందో వేచి చూడాలి.




