Off The Record: సురేఖ ఎపిసోడ్‌తో రాజగోపాల్ రెడ్డి సైలెంట్ అయ్యారా ?
Off The Record: కొండా సురేఖ బర్తరఫ్‌తో అలర్టయిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నకిరేకల్ సీఎం సభకు హాజరై యూ-టర్న్ తీసుకున్న నేత.
Off The Record: సురేఖ ఎపిసోడ్‌తో రాజగోపాల్ రెడ్డి సైలెంట్ అయ్యారా ?
Off The Record: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొందరు సీనియర్ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ వస్తున్నారు. స్వపక్షంలోనే ఉంటూ సొంత ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలపై వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే, కొండా సురేఖ విషయంలో అధిష్టానం కఠినంగా వ్యవహరించి, ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం ద్వారా అసమ్మతి గళాలకు గట్టి చెక్ పెట్టింది. క్రమశిక్షణ గీత దాటితే మంత్రి పదవి అయినా, మరే ఇతర పదవి అయినా ఊడే ప్రమాదం ఉందనే స్పష్టమైన హెచ్చరికను అధిష్టానం కాంగ్రెస్ నేతలందరికీ పంపింది.
అధిష్టానం తీసుకున్న ఈ ఊహించని కఠిన నిర్ణయంతో నిన్న మొన్నటి వరకు ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు ఒక్కసారిగా తమ వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
నిన్నటి వరకు "అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు లేదని, ప్రభుత్వం చేపడుతున్న కొన్ని కార్యక్రమాల్లో లోపాలు ఉన్నాయని" విమర్శలు గుప్పించిన రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు ఒక్కసారిగా యూ-టర్న్ తీసుకుని "అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం" అనడం రాష్ట్ర రాజకీయంలో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది.
గత కొంతకాలంగా నల్లగొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు పర్యటించినప్పటికీ, జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హాజరైనా.. రాజగోపాల్ రెడ్డి మాత్రం ఆ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
దీంతో ఆయన పార్టీని వీడతారా లేదా సొంత గూటికి పరిమితమవుతారా అనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే, తాజాగా నకిరేకల్‌లో జరుగుతున్న 'ప్రజా వికాస సభ'కు రాజగోపాల్ రెడ్డి హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీకి దూరంగా ఉంటున్నారన్న ప్రచారానికి తెరదించుతూ ఆయన ఈ సభకు రావడం వెనుక రాజకీయంగా పెద్ద చర్చకే దారితీసింది.
రాజగోపాల్ రెడ్డి సడన్‌గా సైలెంట్ అవ్వడం, సభలకు హాజరుకావడం వెనుక త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణే కారణమనే ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు బెర్త్ ఖాయమైందని, అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రావడంతోనే ఆయన తన వైఖరిని మార్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇన్ని రోజులు ఆయన చేసిన విమర్శలు కేవలం కేబినెట్ పదవి కోసం ఒత్తిడి పెంచడానికేనా అన్న అనుమానాలు కూడా జిల్లా నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఏది ఏమైనా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో సొంత నేతలే విమర్శలు చేయడం వల్ల ప్రతిపక్షాలకు రాజకీయ ఆయుధాలు దొరుకుతున్నాయని అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉందట.
అందుకే కొండా సురేఖ బర్తరఫ్ ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా క్రమశిక్షణను కాపాడటంతోపాటు అసమ్మతి నేతల నోళ్లకు తాళం వేసింది కాంగ్రెస్ హైకమాండ్. అధిష్టానం కన్ను ఎర్రజేశాక రాజగోపాల్ రెడ్డి రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై ఎలా వ్యవహరిస్తారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి కొండా సురేఖ వికెట్ పడటంతో తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణా గీత స్పష్టంగా గీసినట్లయింది. మరి రాబోయే కేబినెట్ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి చోటు దక్కుతుందా, లేక ఈ సయోధ్య తాత్కాలికమేనా అనేది వేచి చూడాలి.




