Off The Record: ప్రధాన ప్రతిపక్షంగా మారిన ఎల్ నినో!

Off The Record: ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో నీటి ఎద్దడి, కరెంట్ కోతలు మరియు ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతున్న ఆందోళనలపై ప్రత్యేక విశ్లేషణ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 Oct 2026 7:50 AM IST
Off The Record
X

Off The Record: ప్రధాన ప్రతిపక్షంగా మారిన ఎల్ నినో!

Off The Record: కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త ప్రత్యర్థిగా తయారవుతోంది ఎవరో కాదు.. ‘ఎల్ నినో’. ఈ ఎల్ నినో ప్రభావం తీవ్ర రూపం దాలుస్తుండటంతో, దాని ఎఫెక్ట్ అన్ని రంగాల మీద పడుతుందని నిపుణులు ముందే హెచ్చరించారు. సరిగ్గా అదే భయం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. వర్షాకాలం ముగిసినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. ముఖ్యంగా గత 10, 15 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని ప్రధాన డ్యామ్‌లన్నీ ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. జూరాల అయినా, నాగార్జున సాగర్ అయినా, శ్రీశైలం అయినా... ఎక్కడ చూసినా ఒకే రకమైన దయనీయమైన దృశ్యం కనిపిస్తోంది. ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో పంటలు పండే పరిస్థితి లేదు. దీని ప్రభావం నేరుగా కూరగాయల నుంచి బియ్యం వరకు అన్ని నిత్యావసర వస్తువుల ధరలపై పడుతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. రాబోయే రోజుల్లో అన్నింటి ధరలు మరింత పెరుగుతాయేమోనన్న తీవ్ర ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ సంక్షోభాన్ని ఎలా కట్టడి చేయాలో తెలియక అధికార పార్టీ నేతలు సతమతమవుతున్నారట.

ఈ ఏడాది తాగునీటికి కూడా కటకట తప్పేలా కనిపించడం లేదు. ప్రధాన రిజర్వాయర్లలో నీరు పూర్తిగా అడుగంటి, ఇప్పటికే 'డెడ్ స్టోరేజ్' స్థాయికి చేరుకోవడంతో అధికారులు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారట. ఈ భయానక పరిస్థితిని వారు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారని చెబుతున్నారు. ఒకవైపు సాగునీటి సమస్యలు చుట్టుముడుతుంటే, మరోవైపు ప్రజలకు గుక్కెడు తాగునీరు అందించడం కూడా కష్టంగా మారుతోంది. రాష్ట్రంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్లితే, అది రాష్ట్రవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందనే భయం కాంగ్రెస్ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలపై ఈ నీటి ఎద్దడి తీవ్ర ప్రభావం చూపుతుందనే గుబులు నేతలను టెన్షన్‌ పెడుతోందట.

నీటితో పాటు కరెంటు సమస్య కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వడం లేదట. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడక ప్రాజెక్టులు నిండకపోవడంతో, జలవిద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలగనుంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజులో ఏకంగా 20 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైందంటే.. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పవర్ డిమాండ్ ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉందట. ఇక ఫిబ్రవరి తర్వాత అసలైన ఎండాకాలం ప్రారంభమైతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందోనని నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రభుత్వం మరోసారి థర్మల్ విద్యుత్‌పైనే భారీగా ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది. 2012 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కష్టాలు మళ్లీ రాష్ట్రానికి వస్తాయా అని నాయకులు హడలిపోతున్నారు. అప్పట్లో కరెంటు కోతలతో చిన్న పరిశ్రమల యజమానులంతా ఇందిరాపార్క్ వద్ద దీక్షలు చేసి తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించారు. ఇప్పుడు మళ్లీ కోతలు తప్పవనే పరిస్థితి వస్తే, పరిశ్రమలకు 'పవర్ హాలిడేస్' ప్రకటించాల్సి వస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ లోపు సోలార్ విద్యుత్‌ను ఇన్‌స్టాల్ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినప్పటికీ, ప్రస్తుతానికి సవాళ్లు పెద్దవే ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావం ఇలా ఉంటే, రాజకీయంగా ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. డిసెంబర్ తర్వాత ఈ సమస్యలన్నీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరుకున పెట్టే ప్రమాదం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రతిపక్ష పార్టీలకు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఇదొక బలమైన అస్త్రంగా మారనుందని కాంగ్రెస్ నేతలు లోలోన మధనపడుతున్నారట. దీనిపై ప్రతిపక్షాలు ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలకు సిద్ధమవుతున్నట్లు కాంగ్రెస్ అధిష్టానానికి నివేదికలు అందాయట. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ పెద్దలు.. ఈ సంక్షోభం కేవలం ఒక్క తెలంగాణలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉందనే వాస్తవాన్ని గ్రామస్థాయి, మండల స్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తమ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారట.

సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం రాజకీయ ప్రత్యర్థులతో పాటు, 'ఎల్ నినో' రూపంలో వాతావరణమే కాంగ్రెస్‌కు అతిపెద్ద ప్రతిపక్షంగా అవతరిస్తోంది. మరి ఈ ప్రకృతి సృష్టించిన సంక్షోభాన్ని, ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా ఎలా ఎదుర్కొంటుంది..? ఈ రాజకీయ, వాతావరణ సవాళ్లను ఏ విధంగా అధిగమిస్తుంది అనేది కాలమే నిర్ణయించాలి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్