Off The Record: బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఆస్తుల చిచ్చు!

Off The Record: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఆస్తుల వివాదం, రహస్య ఫ్లెక్సీల వార్ మరియు సోషల్ మీడియా రాజకీయంపై ప్రత్యేక కథనం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 Oct 2026 7:44 AM IST
Off The Record
X

Off The Record: బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఆస్తుల చిచ్చు!

Off The Record: కాంగ్రెస్, బీఆర్ఎస్‌ మధ్య రాజకీయ రగడలో అత్యంత ఆసక్తికరమైన అంశం.. 'ఫ్లెక్సీ వార్'. రాత్రికి రాత్రే హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో రహస్యంగా ఫ్లెక్సీలు వెలుస్తుండటం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులను ప్రస్తావిస్తూ, విచిత్రమైన బ్యానర్లు ప్రత్యక్షమవుతున్నాయి. ఈ ఫ్లెక్సీలను అర్ధరాత్రి పూట ఎవరు ఏర్పాటు చేస్తున్నారనే దానిపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇటీవల మెడికవర్ హాస్పిటల్ వద్ద ఇలాంటి ఫ్లెక్సీనే ఏర్పాటు చేసిన కొందరిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ కూడా చేశారు. కానీ, పోలీసుల నిఘా ఉన్నప్పటికీ.. తాజాగా మరోసారి గీత హ్యుందాయ్ షోరూమ్ వద్ద ఇలాంటి ఫ్లెక్సీలే మళ్లీ వెలిశాయి.

ఈ వివాదాస్పద ఫ్లెక్సీలు 'ఎవరు వేస్తున్నారు? ఎందుకు వేస్తున్నారు?' అనే దానిపై నగరంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు మీడియా ముందుకు వచ్చి.. రేవంత్ రెడ్డి కుటుంబానికి వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ఆధారాలతో సహా బయటపెడతామంటూ సవాళ్లు విసురుతున్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి ఫ్లెక్సీల పర్వం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ప్రతిపక్షం విసురుతున్న ఈ ఆరోపణలను అధికార కాంగ్రెస్ పార్టీ తేలిగ్గా తీసుకోలేదు. సరిగ్గా అదే వ్యూహంతో కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఏ విధంగా విపరీతంగా పెరిగిపోయాయంటూ కాంగ్రెస్ శ్రేణులు నిలదీస్తున్నాయి.

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితరులకు చెందిన లగ్జరీ ఫామ్ హౌజ్‌లు, ఇతర భారీ ఆస్తులకు సంబంధించిన వీడియోలను కాంగ్రెస్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తోంది. ప్రజల సొమ్మును దోచుకుని ఇబ్బడిముబ్బడిగా ఆస్తులు కూడబెట్టారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇది కేవలం డిజిటల్ విమర్శలతోనే ఆగలేదు. తాజాగా సిద్దిపేట, జన్వాడ, మొయినాబాద్ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల బృందం స్వయంగా పర్యటించింది. అక్కడ బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆస్తులు ఇవేనంటూ ప్రజలకు నేరుగా వివరించే ప్రయత్నం చేశారు. అటు అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి కుటుంబం సంపాదించిందంటూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంటే.. ఇటు గతంలో బీఆర్ఎస్ దోచుకుందంటూ కాంగ్రెస్ కౌంటర్లు ఇస్తోంది. మొత్తానికి ఆస్తుల చుట్టూనే తెలంగాణ రాజకీయం గిరికీలు కొడుతోంది.

ఈ ఫ్లెక్సీ వార్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిందట. ఇరు పార్టీల సోషల్ మీడియా వింగ్స్ అత్యాధునిక టెక్నాలజీని వాడుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్‌లతో కూడిన వీడియోలు, ఆకర్షణీయమైన గ్రాఫిక్స్, సెటైరికల్ రీల్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో దాడి చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #RevanthFamilyAssets, #KCRFamilyAssets అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయట.

ఇదే సమయంలో అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాలు కూడా ఈ సోషల్ మీడియా వార్‌కు ఆజ్యం పోస్తున్నాయట. ఉదాహరణకు కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ వన్ వేలైన్‌ను అలాగే ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి అక్కడ అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు నిర్మించాలని గతంలో భావించారు. అయితే ప్రభుత్వ ప్రణాళికా లోపం వల్ల ఎలాంటి ఆలోచన లేకుండా నిర్ణయాలు మార్చుకోవడం వల్ల వేల కోట్ల ప్రజాధనం వృధా అయ్యిందని బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలా ప్రతి చిన్న పరిణామాన్ని ఆస్తులు, ప్రభుత్వ వైఫల్యాలతో ముడిపెడుతూ సోషల్ మీడియానే ప్రధాన రణరంగంగా మార్చుకున్నారు.

సాధారణంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఏమైనా సమస్యలు వస్తే ప్రెస్ మీట్లు పెట్టి సమాధానాలు చెప్పుకోవడం మనం చూశాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రెస్ మీట్ల కాలం పోయింది. కేవలం సోషల్ మీడియా వేదికగానే ప్రశ్నల వర్షం కురిపించడం, క్షణాల్లో పోస్టులు పెట్టడం పరిపాటిగా మారింది. రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలు, నిరుద్యోగం, అభివృద్ధి వంటి అసలు సిసలైన అంశాలను పక్కన పెట్టి.. కేవలం ఇరు పార్టీలు ఆస్తుల లెక్కలతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శకులు మండిపడుతున్నారు.

ఎవరి ఆస్తులు ఎంత పెరిగాయి..? ఎవరు ఎవరిని ఇరుకున పెట్టాలి..? అనే దానిపైనే నేతల దృష్టి కేంద్రీకృతమైందన్న వాదన బలంగా వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ ఆస్తుల యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉందని, రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇదే తరహా పోరు కొనసాగితే.. అభివృద్ధి పట్టాలెక్కుతుందా..? లేక ఈ ఆస్తుల రాజకీయం మరింత దూకుడు పెంచుతుందా..? కాలమే సమాధానం చెప్పాలి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్