Off The Record: దేవాదాయ శాఖ ఎవరు చేసినా ఇంతేనా ?

Off The Record: కొండా సురేఖ బర్తరఫ్‌తో ఉమ్మడి, తెలంగాణ రాజకీయాల్లో 'దేవాదాయ శాఖ మంత్రుల పదవీ గండం' సెంటిమెంట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Sept 2026 9:01 AM IST
Off The Record
X

Off The Record: దేవాదాయ శాఖ ఎవరు చేసినా ఇంతేనా ? 

Off The Record: తెలంగాణ కేబినెట్ నుంచి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఒక్క కొండా సురేఖ మాత్రమే కాదూ.. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలు.. ప్రస్తుత తెలంగాణ, అటు నవ్యాంధ్ర రాష్ట్రాల్లోనూ ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతోంది.

ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటివరకు ఈ శాఖను చేపట్టిన పలువురు మంత్రులు ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం లేదా పదవులు కోల్పోవడం ఒక సెంటిమెంట్‌గా మారుతూ వస్తోంది. కొండా సురేఖ కేబినెట్ నుంచి తొలగింపునకు గురికావడంతో, రాజకీయ వర్గాల్లో "దేవాదాయ శాఖ మంత్రులకు పదవీ గండం" అనే పాత సెంటిమెంట్ మళ్లీ చర్చనీయాంశమైంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం అంటే 1962 నాటి నుంచి దేవాదాయ శాఖను చేపట్టిన పలువురు మంత్రులు తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోలేకపోయారు. కొందరి పరిస్థితి ఇలా ఉంటే మరికొందరు రాజకీయంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు.

గతంలో ఎందరో ప్రముఖులు.. ఈ శాఖను నిర్వహించిన కాలంలో అకాల పదవీ విరమణలు లేదా రాజకీయ మార్పులను చవి చూడాల్సి వచ్చింది. తాజాగా కొండా సురేఖ ఉదంతంతో ఈ 'సెంటిమెంట్' నిజమేనంటూ సోషల్ మీడియాలోనూ రాజకీయ వేదికల్లోనూ చర్చలు రీసౌండ్ చేస్తున్నాయి.

ఎండోమెంట్‌ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టి.. పూర్తి కాలం ఆ పదవిలో కొనసాగే అదృష్టం నోచుకోని వారిలో.. టీఎన్ సదాలక్ష్మి, పి.వి.నరసింహారావు, దండు శివరామరాజు, జేఎస్‌ఆర్‌ రెడ్డి, గడ్డం వెంకటస్వామి, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎం.సత్యనారాయణరావు, సి.రామచంద్రయ్య వంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటాయి.

వీరిలో కొందరు అనూహ్యంగా పదవులను కోల్పోతే.. మరికొందరు రాజకీయ పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎమ్మెస్సార్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఎం.సత్యనారాయణ రావు.. వైఎస్సార్ మొదటి కేబినెట్‌లో దేవాదాయ మంత్రిగా పనిచేశారు. భూముల వివాదంలో చిక్కుకుని ఆ తర్వాత పోర్ట్‌ఫోలియో మార్పును ఎదుర్కొన్నారు.

జుపల్లి కృష్ణారావు 2009-2011 మధ్య ఈ శాఖను నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సి.రామచంద్రయ్య కూడా ఎండోమెంట్‌ మినిస్టర్‌గా కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో పనిచేశారు. అయితే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి దేవాదాయ మంత్రిగా ఉన్న సీఆర్.. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీఎం రాజీనామాతోపాటు తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది.

అటు నవ్యాంధ్రలో పైడికొండల మాణిక్యాల రావు.. బీజేపీ కోటాలో దేవాదాయ మంత్రిగా చేశారు. కానీ.. టీడీపీ-బీజేపీ మిత్రబంధం విడిపోవడంతో మధ్యలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. జగన్ కేబినెట్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్‌కు.. తన హయాంలో రథం దహనం, విగ్రహాల ధ్వంసం వంటి వరుస వివాదాలు చుట్టుముట్టాయి.

అనంతరం కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో వెల్లంపల్లికి చోటు దక్కలేదు. సాధారణంగా దేవాదాయ శాఖపై భూముల వివాదాలు లేదా అవినీతి ఆరోపణలు వస్తుంటాయి. కానీ కొండా సురేఖ విషయంలో మాత్రం రూట్ మారింది. ఆమె కుమార్తె కొండా సుస్మితా పటేల్.. సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హైకమాండ్ సీరియస్ అయింది.

సురేఖ రాజీనామాకు నిరాకరించడంతో, సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌కు సిఫార్సు చేసి ఆమెను బర్తరఫ్ చేయించారు. శాఖ ఏదైనా.. దేవుడి శాఖను నిర్వర్తించే మంత్రులపై ఈ విధమైన రాజకీయ గండాలు రావడం మళ్లీ రుజువైందని గాంధీభవన్ వర్గాలతోపాటు సచివాలయంలో సైతం గుసగుసలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఖాళీ అయిన ఈ స్థానంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ సీనియర్లు ఆశపడుతున్నా.. ఈ 'దేవాదాయ సెంటిమెంట్' మాత్రం అంతర్గతంగా నేతలను ఆలోచనలో పడేస్తోందట. అయితే ఒక శాఖ నిర్వహించినందుకు మాత్రమే మంత్రి రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని చెప్పడం శాస్త్రీయంగా గానీ, రాజకీయంగా గానీ సమర్థించలేని వాదన.

మంత్రుల పదవీ మార్పులకు సాధారణంగా పార్టీ రాజకీయాలు, పరిపాలనా పనితీరు, అంతర్గత సమీకరణాలు, నాయకత్వ నిర్ణయాలు వంటి అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఆసక్తి ఎందుకంటే.. మరోవైపు దేవాదాయ శాఖ చుట్టూ రాజకీయ వివాదాలు, మంత్రుల పదవులపై జరుగుతున్న చర్చలు ఆసక్తిని పెంచుతున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story