Off The Record: కాంగ్రెస్ సబ్ కమిటీలు పేరుకేనా!
Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కేబినెట్ సబ్ కమిటీ నివేదికల అమలుపై ప్రతిపక్షాల విమర్శలు. కాలయాపనకేనా కమిటీలు అంటూ ప్రశ్నలు.
Off The Record: కాంగ్రెస్ సబ్ కమిటీలు పేరుకేనా!
Off The Record: ఏ ప్రభుత్వమైనా క్లిష్టమైన అంశాలపై లోతుగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలనుకుంటే కమిటీలను ఏర్పాటు చేయడం సర్వసాధారణం. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది. కీలక సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక వనరుల సమీకరణ, వ్యవసాయం, ఉద్యోగులు, పరిశ్రమలు తదితర అంశాలపై వరుసగా కేబినెట్ సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. అయితే కమిటీ ఏర్పాటు నుంచి ప్రభుత్వానికి నివేదిక సమర్పించే వరకు జరిగే ప్రక్రియ ప్రజలకు కనిపిస్తున్నా.. ఆ నివేదికల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు ఏంటి..? అవి ఎంతవరకు అమలయ్యాయి..? అన్న విషయంలో మాత్రం స్పష్టత కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్య వస్తే ముందుగా కమిటీ ఏర్పాటు.. ఆ తర్వాత సమావేశాలు.. అధికారుల నుంచి నివేదికల సేకరణ.. క్షేత్రస్థాయి పర్యటనలు.. చివరకు ప్రభుత్వానికి సిఫార్సులు. కానీ అక్కడి నుంచే చాలా అంశాలు నిలిచిపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కమిటీ నివేదికల భవితవ్యంపై స్పష్టమైన సమాచారం బయటకు రావడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపు 25 వరకు సబ్ కమిటీలు ఏర్పాటు చేసినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కానీ వాటిలో కేవలం కొద్ది కమిటీలు మాత్రమే పూర్తి స్థాయి నివేదికలను సమర్పించినట్లు తెలుస్తోంది. మిగిలిన కమిటీలు ఏ దశలో ఉన్నాయి..? వాటి అధ్యయనం పూర్తయిందా..? నివేదికలు ఎప్పుడు వస్తాయి..? అన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు కనిపించడం లేదని విమర్శకులు అంటున్నారు. ఆరు గ్యారెంటీల అమలు, కుల గణన, ఉద్యోగుల సమస్యలు, పరిశ్రమల అభివృద్ధి వంటి కీలక అంశాలపై ఏర్పాటైన కమిటీలు నిర్ణీత సమయంలో నివేదికలు ఇవ్వలేకపోయాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ కమిటీలు సమస్యల పరిష్కారానికి మార్గం వేస్తున్నాయా..? లేక కాలయాపనకు కారణమవుతున్నాయా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నిజాం షుగర్స్ పునరుద్ధరణ, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలు, ఎస్సీ వర్గీకరణ, రిసోర్స్ మొబిలైజేషన్, ఎల్ నినో ప్రభావం వంటి కీలక అంశాలపై కూడా ఉపసంఘాలు ఏర్పాటు అయ్యాయి. అయితే వాటి సిఫార్సులు ఎంతవరకు అమల్లోకి వచ్చాయి..? క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపిస్తున్నాయా..? అనే ప్రశ్నలు ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా రైతులకు సంబంధించిన అంశాల్లో వేగవంతమైన నిర్ణయాలు అవసరం. వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాలు, తాగునీటి సమస్యలు, పశుగ్రాసం కొరత, విద్యుత్ సరఫరా, రబీ సాగు ఏర్పాట్లు వంటి అంశాల్లో ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. అలాంటి సమయంలో కమిటీలు ఇంకా అధ్యయనాల దశలోనే ఉంటే సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇంకో కీలక ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. సబ్ కమిటీల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయిలో క్రమం తప్పకుండా సమీక్ష జరుగుతోందా..? కమిటీలు నిర్దేశిత గడువుల్లో నివేదికలు సమర్పిస్తున్నాయా..? సమర్పించిన నివేదికలపై శాఖలు ఎంత వేగంగా అమలు చర్యలు చేపడుతున్నాయి..? అనే అంశాలపై ఇప్పటికీ పూర్తి స్పష్టత లేదని పరిశీలకులు చెబుతున్నారు. పాలనలో కమిటీలు అవసరమే. కానీ కమిటీల ఏర్పాటు మాత్రమే లక్ష్యమైతే ప్రయోజనం ఉండదు. వాటి నివేదికలు నిర్ణయాలుగా మారాలి. ఆ నిర్ణయాలు అమలులోకి రావాలి. అప్పుడే ప్రజలకు ఫలితాలు అందుతాయి. లేదంటే సమావేశాలు, సమీక్షలు, నివేదికల వరకు మాత్రమే పరిమితమయ్యే ప్రమాదం ఉంటుంది.




