Off The Record: కంచుకోటలో బీజేపీ వెనకడుగు..అసలు ఏమైంది ?
Off The Record: ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో ముక్కోణపు పోరు. కేసీఆర్ రీఎంట్రీ, సీఎం రేవంత్ రెడ్డి సవాళ్లు, బీజేపీ కౌంటర్ అటాక్. కమలం కంచుకోటలో గులాబీ, హస్తం పార్టీల స్కెచ్‌లపై ప్రత్యేక కథనం.
Off The Record: కంచుకోటలో బీజేపీ వెనకడుగు..అసలు ఏమైంది ?
Off The Record: ఉత్తర తెలంగాణ అంటేనే బీజేపీకి కంచుకోటగా చెప్తుంటారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో ఆ పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీల బలం ఉండగా.. అందులో 4గురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉత్తర తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
వీరితో పాటు సర్పంచ్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం ఇక్కడ బీజేపీ తన దూకుడును ప్రదర్శించింది. తొలిసారిగా కరీంనగర్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను బండి సంజయ్ నాయకత్వంలో కైవసం చేసుకుంది. అలాగే నిజామాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఎంపీ అరవింద్ నాయకత్వంలో బీజేపీ 28 సీట్లు సాధించి తృటిలో మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను చేజార్చుకుంది. ఈ విధంగా బీజేపీ తన రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తున్న ఉత్తర తెలంగాణలో సడెన్‌గా ఒకవైపు కేసీఆర్ రీఎంట్రీ, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శనతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కిందనే చర్చ సాగుతోంది.
ఏడాది విరామం తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ మళ్ళీ మైదానంలోకి దిగడం ఒక్కసారిగా రాజకీయాల్లో మాటల తూటాలు పేలాయి. జగిత్యాల సాక్షిగా కేసీఆర్ వేసిన అడుగు.. ఉత్తర తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్, ఇప్పుడు ఒక్కసారిగా ఫుల్ జోష్ తో తహతహలాడుతున్నారు. జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్ పార్టీలో ఉత్సాహం రెట్టింపైంది. అదే సభలో.. కేసీఆర్ కాస్త డోస్ పెంచి మాట్లాడారు. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావనంటూ సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కరెంట్, యూరియా, హైడ్రా అంశాలపై తీవ్రస్థాయిలో సూటిగా ప్రశ్నించారు. బీజేపీ కంచుకోటలో గులాబీ జెండా పాతడమే లక్ష్యంగా కేసీఆర్ తన మార్క్ పాలిటిక్స్ షురూ చేశారనే చర్చ జరుగుతోంది.. దీంతో పాత కోటలను రాజకీయంగా తిరిగి పొందాలనే ఏకైక లక్ష్యంతో గులాబీబాస్ రీఎంట్రీ ఇచ్చారనే టాక్ జోరుగా వినిపిస్తోంది.
ఇటు అధికార కాంగ్రెస్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. కాటారం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తన విశ్వరూపం చూపించారు. రైతు భరోసా నిధుల విడుదల , మేడిగడ్డ పునరుద్ధరణ పనుల పరిశీలన, అలాగే తెలంగాణకు మణిహారంగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టులో గత పాలకుల అవినీతి ఆరోపణలపై విమర్శలు ఎక్కుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని సవాల్ విసరడం చర్చకు దారితీసింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా..బీఆర్ఎస్, బీజేపీలను సీఎం టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ.. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలో విజయాలతో ఊపు మీద ఉంది. అదే జోష్‌లో వచ్చే ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికలను, అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీకి గట్టి పోటీ ఇస్తూ కమలదళానికి ఇప్పటినుంచే చెక్ పెట్టాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా స్కెచ్ లు గీస్తోందట.
ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దూకుడు పెంచితే.. తమ కంచుకోటగా చెప్పుకునే కాషాయ పార్టీ మాత్రం ఢీలా పడిందా? అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ తరుణంలోనే వాటికి చెక్ పెట్టేలా కాషాయదళం కూడా కదనరంగంలోకి దిగింది. ఉత్తర తెలంగాణలో కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి సభలపై కమలనాథులు రాంచందర్ రావు, రఘునందన్ రావు, అరవింద్ , బండి సంజయ్ అగ్గిలం మీద గుగ్గిలం అయ్యారు. ఉత్తర తెలంగాణ గడ్డ.. బీజేపీ అడ్డా అని.. అక్కడ కమలం ఢీలా పడలేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఒకరినొకరు కాపాడుకుంటున్నారని.. ఓటుకు నోటు-కాళేశ్వరం మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆయన రాజకీయ బాంబు పేల్చారు. తాము ఎవరి కాళ్లు మొక్కాల్సిన అవసరం లేదని, ప్రజల కాళ్లే మొక్కుతామని చెప్పడం ద్వారా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. అర్వింద్ మాట్లాడుతూ ప్రపంచానికి ట్రంప్, దేశానికి రాహుల్ గాంధీ, తెలంగాణకు కేసీఆర్ ఉంటేనే ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్నారు. దీక్ష సమయంలో.. తెలంగాణ మీద ఏదో ఒక స్టేట్మెంట్ ఇప్పించండి లేకపోతే సచ్చిపోయేలా ఉన్నా అని మా తండ్రి డీఎస్ కు ఫోన్ చేసి బ్రతిమిలాడారని అర్వింద్.. రాజకీయంగా మరింత అగ్గి రాజేసింది. లిల్లీ యువర్ సో సిల్లీ అన్నట్లు రేవంత్ రెడ్డి తీరు ఊందని, లాగులు, తొండలు, బూతు మాటలు, బంద్ చెయ్ రేవంత్ అంటూ చురకలంటించారు అరవింద్. అదే స్థాయిలో కేసీఆర్, రేవంత్ రాహుకేతువులని, కాళేశ్వరంలో కేసీఆర్ ను కాపాడుతోంది రేవంత్ అంటూ తనదైనా శైలిలో రాజకీయ బాణాలు సంధించారు బండి సంజయ్. ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ కేసీఆర్ , రేవంత్ తుపాకీ రాముడు లాగా, కాళేశ్వరం కట్టిన కంపెనీకే మూసీ పునరుద్ధరణ అప్పజెప్పారు..దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫెవికల్ బంధం తెలుస్తుందంటూ ఘాట్ గా స్పందించడం రాజకీయ రచ్చకు ఆజ్యం పోసింది.
ఉత్తర తెలంగాణ ఇప్పుడు పొలిటికల్ రంగస్థలంగా మారింది. పవర్ కోసం హై వోల్టేజ్ బ్యాటిల్ జరుగుతోంది. ఇక్కడి నుంచే బీజేపీకి మెజార్టీ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. అలాగే కాంగ్రెస్‌కూ.. సర్పంచ్, మున్సిపల్ ప్రజాప్రతినిధులతో పాటు అధికార బలం ఉంది. ఇక బీఆర్ఎస్.. తన పూర్వవైభవాన్ని నిలబెట్టుకోవాలని, ఉద్యమ కాలం నాటి సెంటిమెంట్‌ను మళ్లీ రగిల్చాలనే కసితో ఉంది. మరి ఈ ముక్కోణపు పోరులో ఎవరు పైచేయి సాధిస్తారు? కమలం తన కంచుకోటను కాపాడుకుంటుందా? లేక కాంగ్రెస్, బీఆర్ఎస్ దెబ్బకు ఢీలా పడుతుందా..? లేదంటే చివరి బంతికి గేమ్ చేంజ్ చేస్తుందా ? లేదా ? అన్నది చూడాలి.




