Off The Record: రేవంత్ స్పీడ్.. కేసీఆర్ స్కెచ్!
Off The Record: బీఆర్ఎస్ అగ్రనేతల కోటలపై సీఎం రేవంత్ దూకుడుకు చెక్ పెట్టేందుకు.. కొడంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ వ్యూహం.
Off The Record: రేవంత్ స్పీడ్.. కేసీఆర్ స్కెచ్!
Off The Record: తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ కీలక నేతల నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ వరుస బహిరంగ సభలతో దూకుడు పెంచారు. సెప్టెంబర్ 30న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో సీఎం రేవంత్ పాదయాత్ర చేపట్టి, భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ వేదికగా గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై, కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శల బాణాలు విసిరారు.
ఇంతటితో ఆగకుండా, ఈ నెల చివరినాటికి BRS మరో కీలక నేత హరీశ్‌రావు నియోజకవర్గమైన సిద్దిపేటలోనూ భారీ సభకు సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లోనూ సభ ఏర్పాటుకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇలా వరుసగా BRS అగ్రనేతల కోటల్లోకే వెళ్లి సీఎం రేవంత్ సవాళ్లు విసురుతుండటంతో.. ప్రతిపక్ష BRS కూడా అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
కాంగ్రెస్ దూకుడుకు చెక్ పెట్టాలంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే భారీ బహిరంగ సభ పెట్టాలని BRS అధిష్ఠానం భావిస్తోంది. తమ నేతల ఇళ్ల ముందుకు వచ్చి విమర్శలు చేసిన సీఎంకు.. ఆయన సొంత గడ్డపైనే సభ పెట్టి సమాధానం చెబితేనే సరైన కౌంటర్ అవుతుందని బిఆర్ఎస్ నేతలు పార్టీ ముఖ్యులకు సూచించినట్లు తెలుస్తోంది.
ఒకవేళ కొడంగల్‌లో బిఆర్ఎస్ సభ ఖరారైతే... అక్కడ ఏం మాట్లాడబోతున్నారు..? ఎలాంటి అంశాలను ఎత్తుకోబోతున్నారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయంలో ఆసక్తికరంగా మారింది. కొడంగల్ వేదికగా స్థానిక అంశాలతోపాటు రాష్ట్ర స్థాయి రాజకీయాలను కూడా ప్రధానంగా ప్రస్తావించాలని గులాబీ పార్టీ భావిస్తోంది.
ముఖ్యంగా అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందనే కోణంలో తీవ్ర విమర్శలు గుప్పించేందుకు BRS సిద్ధమవుతోంది. గత BRS ప్రభుత్వ హయాంలోనే కొడంగల్ నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చూస్తోంది.
గడిచిన ఈ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అంతటా అభివృద్ధి నిలిచిపోయిందని, కనీసం తన సొంత నియోజకవర్గం కొడంగల్‌ను కూడా రేవంత్ రెడ్డి అభివృద్ధి చేయలేకపోయారని గణాంకాలతో సహా వివరిస్తామని నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా, ఈ రెండున్నరేళ్లలో కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని రైతులపై నమోదైన కేసుల అంశాన్ని కూడా ఈ సభలో పెద్ద ఎత్తున ఎండగట్టే ఆలోచనలో గులాబీ దళం ఉంది.
మరోవైపు సిరిసిల్ల, సిద్దిపేట వేదికలుగా కేటీఆర్, హరీశ్‌రావు కుటుంబ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బలమైన కౌంటర్ ఇచ్చేందుకు BRS స్కెచ్ వేస్తోంది. సిరిసిల్లలో కేటీఆర్ కుటుంబానికి హోటళ్లు, ఆస్తులు ఉన్నాయని సీఎం ఆరోపించగా.. దానికి ప్రతిగా సీఎం కుటుంబ అక్రమ సంపాదన, ఆస్తుల వ్యవహారాలను కొడంగల్ సభలో బయటపెడతామని బిఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరడంతో కొడంగల్‌లో బిఆర్ఎస్ పెట్టబోయే సభపై అందరి దృష్టి నెలకొంది. అసలు సభను ఏ రూపంలో నిర్వహించనున్నారు..? సీఎం రేవంత్ సొంత గడ్డపై గులాబీ నేతలు ఎలాంటి వ్యూహాలతో విరుచుకుపడబోతున్నారు..? ప్రజలకు ఏ విషయాలు వివరించబోతున్నారు అనేది వేచి చూడాల్సిందే..!




