Off The Record: రాజకీయ నాయకులే ఇలా కొట్టుకుంటే ఇంకా ప్రజల పరిస్థితి ఏంటి?

Off The Record: తెలంగాణలో ముదిరిన రాజకీయ పోరు! కరీంనగర్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారుపై బిజెపి కార్యకర్తల దాడి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 May 2026 6:51 AM IST
Off The Record
X

Off The Record: రాజకీయ నాయకులే ఇలా కొట్టుకుంటే ఇంకా ప్రజల పరిస్థితి ఏంటి?

Off The Record: తెలంగాణ రాజకీయాల్లో గులాబీ పార్టీ గేర్ మార్చింది. గెలుపోటముల విశ్లేషణలు పక్కన పెట్టి, ఇప్పుడు ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగడమే ఏకైక లక్ష్యంగా వ్యూహరచన చేస్తోంది. వరంగల్ వేదికగా జరిగిన సభలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగం చూస్తుంటే.. రాబోయే రోజుల్లో అధికార పక్షంపై పోరాటం ఏ స్థాయిలో ఉండబోతోందో అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కేవలం విమర్శలు చేయడమే కాకుండా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చేసిన హామీలు, వ్యాఖ్యలను అస్త్రాలుగా మార్చుకుని, అవే మాటలతో కౌంటర్ ఇస్తామని కేటీఆర్ ప్రకటించడం చర్చనీయాంశమైంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు డిక్లరేషన్‌పై BRS నిలదీస్తోంది. హామీల అమలు ఎక్కడా..? అంటూ నిలదీస్తూనే, వ్యక్తిగత విమర్శలకు కూడా వెనకాడటం లేదు. మరోవైపు కేంద్రమంత్రి బండి సంజయ్‌పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ కలుపుకుని తింటున్నారేమో అన్న అనుమానం ఉందంటూ కౌశిక్ రెడ్డి చేసిన విమర్శలు వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో భాషా నైపుణ్యం, విమర్శల పదును ఉండాలి కానీ, ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు ఏ స్థాయికి తీసుకెళ్తాయో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయాలకు, అదే శైలిలో సమాధానం చెప్పాలని BRS ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో అధికార, విపక్షాల మధ్య పీక్స్‌లో మాటల తూటాలు పేలుతున్నాయి. ఫలితంగా ఇటీవలి కాలంతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గులాబీ కేడర్‌లో ఉత్సాహం నింపడానికి ఇలాంటి దూకుడు అవసరమని BRS భావిస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంతో పాటు, తాము బలహీనపడలేదని నిరూపించుకోవడానికి బిఆర్‌ఎస్ బృందం శ్రమిస్తోందట. అటు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా వీటికి ధీటుగానే బదులిస్తోంది. రైతు భరోసా, రుణమాఫీ వంటి అంశాలను అడ్డం పెట్టుకుని BRS చేస్తున్న యాత్రలను అడ్డుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతోంది. మొత్తానికి వరంగల్ సభతో మొదలైన ఈ కౌంటర్ పాలిటిక్స్ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపై ప్రెస్ మీట్లు, సభలు కేవలం పథకాల గురించి కాకుండా.. పరస్పర దూషణలు, కౌంటర్ అటాక్‌లకే పరిమితమయ్యేలా ఉన్నాయన్నది రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తున్న టాక్.

కరీంనగర్‌లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ కార్యాలయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో బీజేపీ కార్యకర్తలు వచ్చి దాడులు చేయడం.. ఒక్కసారిగా అక్కడి నాయకులు ఉలిక్కి పడ్డారు. ఎందుకు దాడి చేశారో.. ఎవరు దాడి చేస్తున్నారో అర్ధం కాక నేతలు కార్యాలయం లోపాలనే తలదాచుకున్నారు. కానీ కార్యాలయం పార్కింగ్ ప్లేస్‌లో ఉన్న కారుపై దాడి చేయడం, అనంతరం కార్యాలయంలోకి చొచ్చుకొనిపోవడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు అద్దాలను పగులగొట్టడమే చేయడమే కాక.. మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసులోని అద్దాలు, పూల కుండీలను కూడా ధ్వంసం చేశారు. ఉద్రిక్తత చేయిదాటిపోవడంతో.. పోలీసులు జోక్యం చేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధుల కార్యాలయాలపై దాడి చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని కేటీఆర్ అన్నారు. పోలీసులు కూడా చోద్యం చూస్తూ కూర్చున్నారని, లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో విఫలమయ్యారని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. బీఆర్ఎస్ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా దీటుగా బదులిచ్చారు. బీఆర్ఎస్ హయాంలోనే బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయన్నారు. తమ సహనానికి కూడా హద్దులు ఉంటాయని, బీజేపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని బండి సంజయ్ హెచ్చరించారు.

రాజకీయాల్లో ఒక పార్టీ వారిని ఇంకొకరు తిట్టుకోవడం సహజమే.. కానీ దాడులు చేసుకోవడం మాత్రం రాజకీయ పార్టీ నేతల్లో ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఇలా పార్టీ నేతలు, కేడర్ మధ్య ఘర్షణ వాతావరణ చూస్తుంటే.. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో ముందెన్నడూ లేని ఘర్షణ రాజకీయాలు ఎటువైపు దారితీస్తాయోన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story