Off The Record: కాంగ్రెస్ బీజేపీ మధ్య మోదీ ఫోటో పంచాయతీ!

Off The Record: తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై ఫొటో వార్. మోదీ ఫొటో ఉండాలని బీజేపీ, ఉచిత బియ్యంపై హక్కు తమదేనని కాంగ్రెస్ సవాల్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Aug 2026 11:42 AM IST
Off The Record
X

Off The Record: కాంగ్రెస్ బీజేపీ మధ్య మోదీ ఫోటో పంచాయతీ!

Off The Record: తెలంగాణలో ఫోటో వార్ హీట్ పుట్టిస్తోంది. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో.. రాజకీయ వేడి కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇస్తున్న రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఎందుకు లేదంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లతోపాటు... ఉచిత రేషన్ పథకానికి కేంద్రం నుంచి నిధులు వస్తున్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటోందని బీజేపీ ఎంపీలు మండిపడుతున్నారు.

రేషన్ కార్డు అంటే నేరుగా పేద కుటుంబాలకు సంబంధించిన అంశం. అందుకే... పేదల ఓటు బ్యాంకు మీద ఎవరి ముద్ర ఉండాలి..? కేంద్రం ఇచ్చే సాయంపై క్రెడిట్ ఎవరికి దక్కాలి..? రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రచారం ఎవరిది..?అన్న లెక్కలే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. “కేంద్రం వాటా ఉంది... ప్రధాని ఫొటో ఉండాల్సిందే” అంటోంది బీజేపీ. రాష్ట్ర పథకాలకు కేంద్రం ఫొటో ఎందుకు?” అంటోంది కాంగ్రెస్ పార్టీ.

పైసలు మోదీవి... సోకు రేవంత్ రెడ్డిదా..? అంటూ బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తున్నారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మోదీ ఫొటో కోసం అడుక్కోవడం లేదని, కానీ ప్రోటోకాల్ పాటించాల్సిందేననీ బీజేపీకి చెందిన ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేస్తున్నారు. అంతటితో ఆగక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇళ్లు ఇస్తే.. వాటికి ఇందిరమ్మ ఇళ్లని పేరు ఎలా పెడతారు?”

అంటూ మరో ఎంపీ ఈటట ప్రశ్నించారు.“రేషన్ కార్డుల మీద మీ ఫొటోలు పెట్టడానికి మీ అయ్య జాగీరా?” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంపీ రఘునందన్ రావు కూడా రేషన్ బియ్యంలో కేంద్రం వాటాను ప్రస్తావిస్తూ.. ప్రధాని ఫొటో ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒకడుగు ముందుకేసి నేరుగా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశారు. పైసలు ఇచ్చేది మోదీ.. నీ ఫొటో ఎలా పెడతావు?”అంటూ నిలదీశారు.

బీజేపీ నేతల వరుస దాడులకు కాంగ్రెస్ కూడా గట్టిగానే ఎదురుదాడి చేస్తోంది. దేశవ్యాప్తంగా పేదలకు సన్నబియ్యం అందిస్తేనే రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫొటో వేస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రధాని ఫొటో తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఎక్కడా లేదని ఆయన చెప్పుకొచ్చారు.

తెలంగాణ ప్రజలు పన్నులు కడుతున్నారు.. కేంద్రం నుంచి తిరిగి నిధులు వస్తున్నాయి.. ఇందులో గొప్పలు చెప్పుకోవాల్సింది ఏముంది?”అంటూ బీజేపీని ఎదురు ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్. రాజకీయాల కోసం చిల్లర విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

ఇంతకీ ఈ ఫొటో వార్... ఎన్నికల వార్‌గా మారుతుందా..? రాబోయే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఈ ఫొటో ఫైట్ ఎక్కడి వరకు దారితీస్తుంది..? ఎవరికి రాజకీయంగా అన్నం పెడుతుంది..? ఎవరికి షాక్ ఇస్తుంది..? అన్నది ఆసక్తికర పరిణామంగా మారింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story