Off The Record: తెలంగాణ ఆర్టీసీ విలీనం ఎప్పుడు!

Off The Record: తెలంగాణలో దశాబ్దం తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు ముగిసినా ముందుకు పడని విలీన ప్రక్రియ. జనవరిలోపు స్పష్టత లేకుంటే ఉద్యమానికి కార్మికుల సిద్ధం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Nov 2026 7:48 AM IST
Off The Record
X

Off The Record: తెలంగాణ ఆర్టీసీ విలీనం ఎప్పుడు!

Off The Record: ప్రత్యేక తెలంగాణ ఏర్పడి పన్నెండేళ్లు దాటిపోయినా ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వ విలీనం ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ తెలంగాణలో మాత్రం ప్రతి ఎన్నికల సమయంలో హామీలు వచ్చినా ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఘనంగా ప్రకటించింది. ఉద్యోగులూ అదే నమ్మారు. కానీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా విలీన ప్రక్రియపై స్పష్టత రాకపోవడంతో ఉద్యోగుల్లో అసహనం పెరిగింది. పెద్దఎత్తున ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం.. ముందుగా ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు జరిపి, ఆ తర్వాత విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. మొదట దీనిని వ్యతిరేకించిన కార్మిక సంఘాలు... చివరకు ప్రభుత్వం మాట నమ్మి ఎన్నికలకు అంగీకరించాయి.

అలా తెలంగాణ ఆర్టీసీలో దాదాపు దశాబ్దం తర్వాత కార్మిక సంఘాల ఎన్నికలకు తెరలేచింది. అక్టోబర్ 9న పోలింగ్ జరగగా... అక్టోబర్ 15న అధికారిక ఫలితాలు వెలువడ్డాయి. అన్ని యూనియన్లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో పోరు హోరాహోరీగా సాగింది. చివరకు ఈయూ-టీఎంయూ-ఎన్‌ఎంయూ కూటమి ఆధిపత్యం సాధించింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.. ఫలితాలు కూడా వచ్చాయి.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైందని కార్మికులు చెబుతున్నారు. ఎన్నికల తర్వాత వెంటనే ప్రారంభం కావాల్సిన తదుపరి ప్రక్రియ ఎక్కడా కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం గుర్తింపు పొందిన సంఘాల అధికారాలు, బాధ్యతలు, యాజమాన్యంతో చర్చల విధానం వంటి అంశాలను ఇప్పటికైనా ప్రకటించాల్సి ఉంటుందని చెబుతున్నారు. కానీ ఎన్నికలు ముగిసి వారాలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి గానీ, యాజమాన్యం నుంచి గానీ స్పందన లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఇక్కడే కార్మిక సంఘాలు కీలక ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో ఆధిక్యం సాధించకపోవడమే ఆలస్యానికి కారణమని అంటున్నాయి. తమకు అనుకూల యూనియన్ విజయం సాధించి ఉంటే ఇప్పటికి మిగతా ప్రక్రియ పూర్తి అయ్యేదని కొందరు నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ తదుపరి చర్యలు ముందుకు సాగడం లేదని చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. అదే సమయంలో కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ యాజమాన్యాన్ని సంప్రదిస్తే.. "కొద్దిరోజులు ఆగండి", "త్వరలో జరుగుతుంది" అనే సమాధానాలు తప్ప స్పష్టత రావడం లేదని చెబుతున్నారు. ఇది ప్రభుత్వ మౌనమా..? లేక యాజమాన్య నిర్లక్ష్యమా..? లేక ఇంకేదైనా కారణమా..?అనే ప్రశ్నలు ఇప్పుడు ఆర్టీసీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి.

నిజానికి ప్రస్తుతం నిలిచిపోయిన ఈ ప్రక్రియ పూర్తికాకుండా అసలు విలీన అంశం ముందుకు వచ్చే అవకాశం లేదు. ముందుగా గుర్తింపు పొందిన కార్మిక సంఘాలకు అధికారిక బాధ్యతలు అప్పగించాలి. ఆ తర్వాతే విలీన కమిటీ ఏర్పాటు, చర్చలు, విధివిధానాలు, చట్టపరమైన ప్రక్రియలు ప్రారంభమవుతాయి. కానీ మొదటి మెట్టే ముందుకు పడకపోవడంతో మొత్తం వ్యవహారం నిలిచిపోయినట్లే కనిపిస్తోంది. కొంతమంది అధికారులు కావాలనే ఫైళ్లను ముందుకు కదలకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. విలీనంపై ప్రభుత్వం సానుకూలంగానే ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్నప్పటికీ... క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటి సంకేతాలు కనిపించడం లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి. అసలు ప్రభుత్వం మనసులో ఏముందో అర్థంకాక ఉద్యోగులు సతమతమవుతున్నారట.

ఇక విలీన అంశం ప్రాధాన్యం గురించి చెప్పాలంటే.. ఇది కేవలం పరిపాలనా నిర్ణయం కాదు. దాదాపు 38 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన అంశం. ప్రభుత్వ ఉద్యోగుల హోదా వస్తే ఉద్యోగ భద్రత నుంచి పదవీ విరమణ ప్రయోజనాల వరకు అనేక అంశాల్లో స్పష్టత వస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు. అందుకే ఈ అంశాన్ని అత్యంత కీలకంగా చూస్తున్నారు. అయితే సమయం మాత్రం వేగంగా గడిచిపోతోంది. ప్రస్తుతం ప్రభుత్వానికి మిగిలింది దాదాపు ఏడాదిన్నర సమయమేనని కార్మిక సంఘాలు గుర్తుచేస్తున్నాయి. ఆ తర్వాత ఎన్నికల హడావిడి మొదలైతే విలీన అంశం మరోసారి పక్కకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మరోసారి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో సమావేశం కావడానికి కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. ఆ చర్చల తర్వాత కూడా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకపోతే ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి. గతంలో మాదిరిగానే సమ్మె సహా అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నాయి. జనవరిలోపు విలీన ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. అలా జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టే దిశగా జేఏసీ నాయకత్వం వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్