OFF THE RECORD: మహిళా కమిషన్ లో ఎం జరుగుంది? రేవంత్ ఫుల్ స్టాప్ పెడతారా ?

OFF THE RECORD: తెలంగాణ మహిళా కమిషన్‌లో వర్గపోరు, అంతర్గత వివాదాలు కలకలం. చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, మంత్రి సీతక్క మధ్య దూరం. ప్రభుత్వానికి నివేదికలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 Nov 2026 8:41 AM IST
OFF THE RECORD
X

OFF THE RECORD: మహిళా కమిషన్ లో ఎం జరుగుంది? రేవంత్ ఫుల్ స్టాప్ పెడతారా ?

OFF THE RECORD: మహిళల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటైన సంస్థ.. మహిళా కమిషన్. ఉమ్మడి రాష్ట్రం నుంచి కొనసాగుతున్న ఈ వ్యవస్థ.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ మహిళా కమిషన్‌గా ప్రత్యేక రూపం దాల్చింది. మహిళలకు న్యాయం చేయడం, వేధింపుల బాధితులకు అండగా నిలవడం, ప్రభుత్వానికి సూచనలు చేయడం దీని ప్రధాన బాధ్యత. అయితే ప్రస్తుతం మహిళా కమిషన్ కార్యకలాపాల కంటే.. అంతర్గత వివాదాలే ఎక్కువ చర్చకు కారణమవుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, కొందరు సభ్యులు, సంబంధిత శాఖ మధ్య సమన్వయం లోపించిందన్న ప్రచారం రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కమిషన్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల నుంచే కొన్ని ఘటనలు వివాదాలకు దారి తీసినట్లు చెబుతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లలో శాఖ మంత్రికి ప్రాధాన్యం ఇవ్వలేదన్న అభ్యంతరాలు వ్యక్తమయ్యాయట. అదే సమయంలో కొందరు సభ్యులు కార్యక్రమానికి దూరంగా ఉండటం కూడా చర్చనీయాంశమైంది. అక్కడితో మొదలైన విభేదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయన్న ప్రచారం సాగుతోంది.

ఇటీవల గాంధీభవన్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఈ గుసగుసలకు మరింత బలం చేకూర్చాయంటున్నారు. సంబంధిత శాఖ మంత్రి సీతక్క, చైర్‌పర్సన్ నేరెళ్ల శారద మధ్య దూరం స్పష్టంగా కనిపించిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగింది. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం, వేర్వేరుగా కనిపించడం చర్చకు కారణమైందంటున్నారు. అంతేకాదు.. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో జరిగిన బతుకమ్మ కార్యక్రమాల్లోనూ కొత్త వివాదం తెరపైకి వచ్చినట్లు సమాచారం. వ్యక్తిగత లేదా ఆహ్వానిత కార్యక్రమాలకు హాజరైన సందర్భంలో మహిళా కమిషన్ అధికారిక అవగాహన బ్యానర్లు ఎందుకు ప్రదర్శించారనే ప్రశ్నలు తలెత్తాయట. ముఖ్యంగా చైర్‌పర్సన్ మాట్లాడే సమయంలో మాత్రమే ఆ ఫ్లెక్సీలు కనిపించడం.. వెంటనే మాయమవ్వడం మరిన్ని అనుమానాలకు తావిచ్చిందని చెబుతున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో అయితే చైర్‌పర్సన్ ప్రసంగించే సమయంలో మాత్రమే కమిషన్ సిబ్బంది ప్రత్యేక పోస్టర్లు ప్రదర్శించారని, అనంతరం పాల్గొన్న వారితో సంతకాలు సేకరించే ప్రయత్నాలు కూడా చేశారని సమాచారం. దీంతో సంబంధిత వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక కమిషన్ ఆంతరంగిక వ్యవహారాల్లోనూ అసంతృప్తి పెరుగుతోందనే ప్రచారం ఉంది. ఇటీవల ఒక సభ్యురాలు తన సొంత జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. దానిపై చైర్‌పర్సన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. సభ్యురాలికి నోటీసులు జారీ చేసే స్థాయికి వ్యవహారం వెళ్లిందన్న వార్తలు వినిపించాయి. అయితే అలాంటి చర్య కమిషన్ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని న్యాయ నిపుణులు సూచించడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు సమాచారం.

మరోవైపు కొన్ని సభ్యుల వ్యవహారశైలిపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళల సమస్యల కంటే వ్యక్తిగత ప్రాధాన్యతలు, అధికార ప్రదర్శనలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు సభ్యులు తమకు కూడా ప్రత్యేక భద్రత, పీఆర్వో, ప్రత్యేక కార్యాలయ సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చైర్‌పర్సన్, సభ్యులకు దేశంలోనే అత్యధిక వేతన ప్యాకేజీలు అందుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో అదనపు సౌకర్యాల డిమాండ్ ప్రభుత్వ వర్గాల్లో ఆశ్చర్యానికి గురిచేస్తోందట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. ఈ డిమాండ్లు ఎంతవరకు సమంజసమన్న చర్చ సాగుతోంది. అంతర్గత ఒత్తిళ్ల ప్రభావం ఉద్యోగులపై కూడా పడుతున్నట్లు సమాచారం. కమిషన్‌లో ఉన్న పరిమిత సిబ్బంది, కౌన్సిలర్లపై పని భారం పెరిగిందని, రోజుకు అనేక కౌన్సిలింగ్ కేసులు నిర్వహించాల్సి వస్తోందని తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కీలక అధికారులు బదిలీల కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం కూడా వినిపిస్తోంది.

మహిళల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన కమిషన్.. ఇప్పుడు అంతర్గత రాజకీయాలు, అధికార పోరు, వివాదాలతో వార్తల్లో నిలవడం ప్రభుత్వాన్ని కూడా అసౌకర్యానికి గురి చేస్తోందని రాజకీయ వర్గాల విశ్లేషణ. ఈ వ్యవహారం శాఖ మంత్రి సీతక్కతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా వెళ్లినట్లు చెబుతున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయన్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్