Off The Record: సీఎం రేవంత్ కు ఆర్టీసీ సంఘాలు బిగ్ షాక్?
Off The Record: తెలంగాణ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనంపై తాజా పరిస్థితి ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైంది?
Off The Record: సీఎం రేవంత్ కు ఆర్టీసీ సంఘాలు బిగ్ షాక్?
Off The Record: రాష్ట్ర రవాణా వ్యవస్థలో అత్యంత కీలకం తెలంగాణ ఆర్టీసీ. తెలంగాణ వ్యాప్తంగా 10,000 బస్సులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. 38 వేల మంది కార్మికులు ఆర్టీసీలో పని చేస్తున్నారు. 2014 తర్వాత ఉమ్మడి సంస్థ.. ఏపీఎస్ఆర్టీసీ, టీజీఎస్ఆర్టీసీలుగా విడిపోయాయి. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది నాటి జగన్ సర్కార్. దీంతో ఇక్కడ కూడా తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారంటూ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన కేసీఆర్ సర్కార్ విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లింది. గవర్నర్ సంతకం పూర్తై గెజిట్ కూడా విడుదలైంది..అపాయింట్ డే ప్రకటించే లోపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా ఆర్టీసీ విలీనం డిమాండ్‌ను వినిపిస్తూనే ఉన్నారు కార్మికులు. ఐనా సర్కార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో..ఇక వేచి చూడలేం అంటూ.. గత నెలలో ఏకంగా సమ్మెకు దిగారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, బకాయిల చెల్లింపు వంటి ప్రధాన డిమాండ్స్‌తో.. మొత్తం 32 అంశాలతో సమ్మెకి వెళ్ళింది ఆర్టీసీ జేఏసీ. రెండు రోజులు సమ్మె పూర్తైన తర్వాత ప్రభుత్వంతో చర్చలు సఫలమయ్యాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు కమిటీని వేసినట్టు, త్వరలోనే ఆ ప్రయత్నం ఉంటుందని కూడా తెలిపింది ప్రభుత్వం. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆర్టీసీ జేఏసీ నేతలతో మాట్లాడి జూన్ 2న శుభవార్త వింటారు అంటూ తెలిపారు. దీంతో ఆర్టీసీ కార్మికులు.. తామ త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులుగా మారబోతున్నామనే సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
సీన్ కట్ చేస్తే జూన్-2 వచ్చింది. వెళ్ళింది. విలీనంపై మాత్రం సీఎం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు మొదట నిర్వహిస్తామని, ఆ తర్వాత విలీనం ఉంటుందంటూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాంబు పేల్చారు.. దీంతో మళ్లీ ఆర్టీసీ కార్మికుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న మొన్నటి వరకు ఓకే అన్న ప్రభుత్వం సడన్‌గా ఎందుకు మాట మార్చిందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు కార్మికులు. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే ఉద్యోగుల కేడర్ సర్దుబాటు, పీఎఫ్, గ్రాట్యుటీ బకాయిలు, PRC లాంటి ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఉన్నాయి. వీటన్నింటిపై స్పష్టత రాకపోవడమే ఈ జాప్యానికి ప్రధాన కారణంగా ఉన్నతాధికారుల నుంచి సమాచారం. వీటికి తోడు ప్రస్తుతం ప్రభుత్వంపై ఏటా రెండు వేల కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత విలీన సమస్య పరిష్కారానికి ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ప్రభుత్వం రెండు నాలుకల ధోరణిని ప్రదర్శిస్తోందంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమ్మె చర్చల్లో ఒకటి చెప్పి ఇప్పుడు మరొకటి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా శాఖ మంత్రితో సహా ఇతర మంత్రులను, ఆర్టీసీలోని ఉన్నతాధికారులను కలిసి తమ మెమొరాండం ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ భావిస్తోంది. ఇటీవలే అన్ని కార్మిక సంఘాలను కలిచి ఎలా ముందుకు వెళ్లాలి అనేదానిపై చర్చించింది జేఏసీ. ఇక జేఏసీలో సమన్వయ లోపం ప్రభుత్వానికి కలిసి వస్తోందనే వాదన కూడా ఉంది. కొన్ని యూనియన్లు ఒక మాట చెప్తే.. మరికొన్ని యూనియన్లు ఇంకో మాట చెబుతున్నాయి. దీంతో వాళ్లలో వాళ్లకే యూనిటీ లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే ప్రభుత్వాలకు కలిసి వస్తున్నాయి.
విలీన ప్రక్రియలో వేగం పెంచేలా.. ఎలాగైనా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జేఏసీ నేతలు ఇటీవల ఇంటర్నల్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వంలో విలీనం లేకపోతే భవిష్యత్ కార్యాచరణకు సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఎన్నికలు లేకపోయినా ఫర్వాలేదు కానీ ముందు ప్రభుత్వంలో విలీనం చేయాలని అంటున్నారు కార్మికులు. ప్రభుత్వం దారికి రాకపోతే జులై నెలలో మరోసారి సమ్మె సైరన్ మోగించాలని నిశ్చయించుకున్నట్టు సమాచారం.
విలీన ప్రక్రియపై ఓవైపు ప్రభుత్వం వాయిదాలు, మరోవైపు కార్మికుల ఎదురుచూపులు. వేరసి రాబోయే రోజుల్లో మరో ఆర్టీసీ సమ్మె రాబోతుందా అన్నది చూడాల్సిందే.




