Off The Record: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్
Off The Record: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. మహాలక్ష్మి పథకం కింద మహిళల ఉచిత ప్రయాణానికి ఇకపై 'స్మార్ట్ కార్డులు'.
Off The Record: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్
Off The Record: తెలంగాణ RTC అతిపెద్ద నెట్వర్కుల్లో ఒకటిగా పేరుగాంచింది. ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు దాదాపుగా 35 లక్షల మందికి పైగా ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు కొనసాగిస్తుంటారు. గ్రేటర్ లో ఈ సంఖ్య 15 లక్షలు. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ పరిధిలో పదివేల బస్సులు ఉన్నాయి. ఇటీవల కాలంలో బస్సులను ఆధునీకరించడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. కర్ణాటకలో ఉచిత బస్సు పథకం అక్కడ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేసింది. 2023 డిసెంబర్ 9న అధికారం చేపట్టగానే మొదట మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రకటించారు.
ఈ పథకం అమలులోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నారు. గతంలో తెలంగాణ వ్యాప్తంగా 69% ఆక్యుపెన్సి రేసియా ఉంటే.. ఇప్పుడది 115 శాతానికి చేరుకుంది. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. 2023 డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు దాదాపుగా 330 కోట్ల టికెట్లను జారీ చేసింది TGSRTC. దీని విలువ దాదాపుగా పదివేల కోట్ల రూపాయలుగా ఉన్నట్టు రవాణా శాఖ మంత్రి చెబుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం.. ఆధార్ కార్డును ధ్రువీకరణ పత్రంగా వాడుతున్నారు. ఆధార్ చూపించిన తెలంగాణ మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తున్నారు.
అయితే మహాలక్ష్మి పథకాన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ముఖ్యంగా ఆధార్ కార్డులను స్కాన్ చేస్తు నకిలీ వాటితో తిరుగుతున్నట్టు గమనించారు. కొన్నిచోట్ల నకిలీ ఆధార్ కార్డులను తీసుకొస్తూ కండక్టర్లకు పట్టుబడిన ఘటనలూ ఉన్నాయి. దీనిపై కండక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యామ్నాయం ఆలోచించగా మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. డిజిటల్ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం, TGSRTC కసరత్తు పూర్తి చేశాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిన జూన్ రెండవ తేదీన ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ లాంఛనంగా ప్రారంభం కానున్నట్టు ఆర్టీసీ నుంచి సమాచారం.
స్మార్ట్ కార్డుల అమలు విధానంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. తొలిదశలో ప్రయోగాత్మకంగా ప్రతీ జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి ఈ కార్డులను జారీ చేస్తారు. ఆ తర్వాత దీని ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మరో 6 నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేలా కసరత్తులు చేస్తున్నారు. ఎంపిక చేసిన మండలంలో ముందుగా మహిళలకు ఏటీఎం కార్డు తరహాలో డిజిటల్ చిప్, క్యూఆర్ కోడ్ మరియు మహిళ ఫొటోతో ఉన్న కార్డును ఇస్తారు. కండక్టర్లు బస్సులోనే ప్రత్యేక స్మార్ట్ కార్డ్ రీడర్ల ద్వారా దీనిని స్కాన్ చేసి వేగంగా టికెట్ జారీ చేస్తారని సమాచారం.. మీసేవ కేంద్రాలు అలాగే ఆర్టీసీ బస్సు కౌంటర్లలో కూడా వీటిని జారీ చేసే విధంగా ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. 50 రూపాయలు చెల్లించి ఆధార్ వివరాలు, అలాగే ఫోటోని ఇవ్వాల్సి ఉంటుంది. ఐతే మారుమూల గ్రామాల్లోని మహిళలకు ఇవి చేరువ అవుతాయా..?
అందుకు ఎదురయ్యే సవాళ్లు ఎంటి..? వాటిని ఎలా అధిగమిస్తారు అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఆ మేరకు మహిళలకు అవగాహన కల్పిస్తారా..? స్మార్ట్ కార్డులు పొందని వారి సంగతేంటి..? అనే సందేహాలు సైతం కలుగుతున్నాయి.
మొదటి విడతలో తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 5లక్షల కార్డులు సిద్ధం చేసినట్టు సమాచారం. ఇందులో దాదాపు రెండు లక్షల స్మార్ట్ కార్డులను గ్రేటర్ పరిధిలో ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే కార్డుల పంపిణీ వరకు బాగానే ఉన్నా.. స్మార్ట్ కార్డులు, ఈ రీడింగ్ లతో మొదట్లో కొంత ఇబ్బంది తప్పదని అధికారులు భావిస్తున్నారు. గతంలో డిజిటల్ పేమెంట్లను ప్రారంభించినప్పుడు పేమెంట్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆరు నెలల లోపల అంతా సెట్ రైట్ అవుతుందని భావిస్తున్నారు. ఎవరైనా డిజిటల్ కార్డులను క్లోన్ చేసినా ఈ స్మార్ట్ రీడర్ వెంటనే గుర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. దాదాపు రెండేళ్ల క్రితమే ఈ ఆలోచన వచ్చినా.. ఇప్పటివరకు కేవలం 5 లక్షల కార్డులు మాత్రమే అందుబాటులోకి తీసుకురాగలిగారు.. మరొక 30 లక్షల కార్డులు తీసుకురావాలంటే ఎంత సమయం పడుతుందో అని అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జూన్ రెండో తేదీన కార్డుల పంపిణీ తర్వాత ఆరు నెలల్లో అందరికీ ఇచ్చే విధంగా ప్రణాళికను సిద్ధం చేశారు.




