Burning Topic: బ్యాంకాక్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు!
Burning Topic: థాయ్‌లాండ్‌లో భారీ వర్షాలు, వరదల బీభత్సం. బ్యాంకాక్‌తో సహా పలు ప్రాంతాలు జలమయం, 23 మంది మృతి. సుమారు రూ.2,700 కోట్ల వరకు ఆర్థిక నష్టం అంచనా.
Burning Topic: బ్యాంకాక్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు!
Burning Topic: చరిత్రలోనే ఎన్నడూ చూడని దుస్థితిని ఎదుర్కొంటున్నారు థాయ్‌లాండ్ ప్రజలు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. కేవలం 48 గంటల్లోనే 300 మిల్లీమీటర్లకు పైగా భారీ వర్షపాతం నమోదైంది. ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ నీరు చేరడం నగర వ్యవస్థలను అతలాకుతలం చేసిం.
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బ్యాంకాక్ సహా దేశంలోని 41 ప్రావిన్సులు వరదల బారినపడ్డాయి. వరదల ప్రభావం 5.8 లక్షలకు పైగా ఇళ్లపై పడింది. దేశవ్యాప్తంగా 26 లక్షలకు పైగా ప్రజలు, 9 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు ఈ వరదల వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఈ వరదల కారణంగా ఇప్పటి వరకూ 23 మంది ప్రాణాలు కోల్పోయారు.
బ్యాంకాక్‌లో నలుగురు, సముత్ ప్రకాన్‌లో ఎనిమిది మంది, సా కాయోలో ఆరుగురు చనిపోగా, మిగిలిన మరణాలు చంతబురి, అయుత్తయ, శరబురి ప్రాంతాలలో నమోదయ్యాయి. ముఖ్యంగా బ్యాంకాక్‌ను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత వారం రెండు, మూడు రోజుల్లోనే బ్యాంకాక్‌లో సుమారు 320 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బ్యాంకాక్‌లో ఉన్న కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ ఒకేసారి వచ్చిన భారీ వర్షపు నీటిని తట్టుకోలేకపోయాయి.
నగరంలోని అన్ని ప్రధాన కాలువలు అప్పటికే నీటితో పూర్తిగా నిండిపోవడంతో, వరద నీరు వెనక్కి తన్ని రోడ్లు, కాలనీలు, నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించింది. దీంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. వాహనాలు కూడా నీట మునిగిపోయాయి. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయి సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. బ్యాంకాక్‌లోని మొత్తం 50 జిల్లాలను విపత్తు ప్రాంతాలుగా ప్రకటించారు. దీంతో థాయ్ ప్రభుత్వం కార్యాలయాలు, విద్యాలయాలకు రెండు రోజుల పాటు ప్రత్యేక సెలవులను ప్రకటించేసింది
వరదల కారణంగా థాయ్‌లాండ్ రాజధాని బీభత్సంగా మారింది. వరదలకు బ్యాంకాక్‌లో 3.29 లక్షల కుటుంబాలు.. దాదాపు 7 లక్షల మంది ప్రభావితమైనట్లు అధికారులు వెల్లడించారు. వీరి కోసం 234 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు బాధితులకు ఆహారం అందించేందుకు మొబైల్ వంటశాలలు, పడవలను రంగంలోకి దించారు. వరదలు తగ్గేంతవరకు రోజుకు మూడు పూటలా ఆహారం అందించడంతోపాటు.. నీరు తగ్గిన తర్వాత మరో ఏడు రోజుల పాటు సహాయం కొనసాగించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు తెలిపారు.
వరద ప్రభావం బ్యాంకాక్ సువర్ణభూమి విమానాశ్రయానికీ తాకింది. వరదల కారణంగా గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది విధులకు చేరుకోవడం కష్టమైంది. దీంతో బ్యాగేజీ నిర్వహణలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 6 వేల బ్యాగేజీలు ఆలస్యమైనట్లు సమాచారం. కొన్ని బ్యాగేజీ ట్రాలీలు కూడా పనిచేయకపోవడంతో టెర్మినల్‌లో లగేజీ భారీగా పేరుకుపోయింది.
ఇలాంటి పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు బ్యాంకాక్ ప్రజలు. వరద ప్రవాహాల కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా.. రోడ్లపై అడుగు పెట్టాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. రోడ్లు, మార్కెట్లు నీట మునగడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. కొన్ని చోట్ల కార్లు కిటికీల వరకు, మరికొన్ని చోట్ల దాదాపు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. అపార్ట్‌మెంట్ ప్రాంగణాల్లో పార్క్ చేసిన వాహనాల్లో పైకప్పులు మాత్రమే కనిపించే పరిస్థితి ఏర్పడింది.
వరద నీటిలో చేపలతో పాటు పాములు, మొసళ్లు కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. బ్యాంకాక్‌లో వర్షం కొంత తగ్గుముఖం పట్టడంతో నీటిని బయటకు పంపేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు థాయ్ వాతావరణ శాఖ దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నదులు పొంగిపొర్లడం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది.
భౌగోళికంగా బ్యాంకాక్ మైదాన ప్రాంతాలు చావో ఫ్రయా నది డెల్టా ముఖద్వారం ఆనుకుని లోతట్టు ప్రాంతంలో ఉన్నాయి. సముద్ర మట్టానికి కేవలం 1.5 మీటర్ల ఎత్తులో భారీ నిర్మాణాలతో అభివృద్ధి చెందింది. దీంతో భారీ వర్షాలు పడ్డప్పుడు నీరు సముద్రంలోకి వెళ్లే నగరం అంతా విస్తరిస్తుంది. పోటు వచ్చినప్పుడు నది ద్వారా వచ్చే వరద నీరు సముద్రంలోకి వేగంగా కలవదు. దీనివల్ల నదీ తీర ప్రాంతాలు, కాలువల పక్కన ఉన్న ఇళ్ళు త్వరగా ముంపునకు గురవుతాయి.
వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద నీరు ఇంకా వీధుల్లోనే ఉండటంతో ప్రజలు నిత్యావసరాల కోసం నడుములోతు నీటిలోనే బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యాపారులు ప్లాస్టిక్ బాక్సులు, డ్రమ్ములను తేలియాడే స్టాళ్లుగా మార్చి వాటిపై సరుకులు ఉంచి విక్రయిస్తున్నారు. వినియోగదారులు నీటిలోకి రావడానికి ఇష్టపడటం లేదు. అందుకే తామే నీటిలో నిలబడి వారికి సరుకులు విక్రయిస్తున్నాం అని ఓ వ్యాపారి తెలిపారు.
ఇక బ్యాంకాక్‌కు తూర్పున ఉన్న తీర ప్రాంత ప్రావిన్స్ రయాంగ్‌లోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అక్కడి రెండు రిజర్వాయర్లు సామర్థ్యాన్ని మించిపోయే స్థాయికి నీటిమట్టం చేరడంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. గత ఏడాది దక్షిణ థాయ్‌లాండ్‌లో సంభవించిన భారీ వరదల విషాదం ఇంకా మరువకముందే తాజా వరదలు ఆ దేశాన్ని మరోసారి వణికిస్తున్నాయి. అప్పట్లో మూడు రోజుల్లోనే 630 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో కనీసం 145 మంది ప్రాణాలు కోల్పోయారు.
33 వేలకుపైగా ఇళ్లు నీట మునిగాయి. పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు వంటి కీలక మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు బ్యాంకాక్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాలను వరదలు చుట్టుముట్టడంతో.. వర్షాలు తగ్గి నీరు ఎప్పుడు దిగుతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
భారీ వరదల కారణంగా థాయ్‌లాండ్ ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ తగిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కనీసం 11 బిలియన్ భాట్‌లు అంటే సుమారు రూ.2,700 కోట్లు మేర ఆర్థిక నష్టం వాటిల్లవచ్చని చెబుతున్నారు. రాజధాని బ్యాంకాక్ ఒక్కటే వరదల కారణంగా సుమారు 7 బిలియన్ భాట్‌లు అంటే దాదాపు రూ.1,700 కోట్లు నష్టపోయే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు పరిస్థితులు మెరుగుపడకపోతే నష్టం మరింత పెరగవచ్చని పేర్కొన్నారు.
ఈ ఏడాది థాయ్‌లాండ్ జీడీపీ వృద్ధి రేటుపై వరదల ప్రభావం పడే అవకాశం ఉందని.. సుమారు 0.3 శాతం పాయింట్ల మేర వృద్ధి తగ్గి 2.1 శాతానికి చేరవచ్చని ఆయన అంచనా వేశారు. బ్యాంకాక్, తూర్పు ప్రాంతాల్లో హోల్‌సేల్, రిటైల్ వ్యాపారాలపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని.. ఇతర ప్రాంతాల్లో పరిశ్రమలు, వ్యవసాయ రంగం దెబ్బతినే అవకాశం ఉందని వివరించారు.




