Big Story: ఆర్థిక భద్రతకు చిహ్నంగా బంగారం!

Big Story: మానవ చరిత్రను, ఆర్థిక వ్యవస్థలను శాసిస్తున్న బంగారం ప్రాముఖ్యత, ప్రపంచ నిల్వలు, సాంకేతికతలో దాని పాత్ర మరియు కేంద్ర ప్రభుత్వ విధానాలపై సమగ్ర విశ్లేషణ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 Oct 2026 1:13 PM IST
Big Story
X

Big Story: ఆర్థిక భద్రతకు చిహ్నంగా బంగారం!

Big Story: బంగారం కేవలం ఒక విలువైన లోహం మాత్రమే కాదు, శతాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అలాగే రాజకీయాలను మానవ చరిత్రను శాసిస్తున్న ఒక శక్తివంతమైన సాధనం. ప్రక్రుతిలో అనేక లోహాలున్నాయి. అయితే బంగారం రేంజ్ పూర్తిగా వేరు. ఇందుకు అనేక కారణాలున్నాయి.

బంగారాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడి గా అన్ని దేశాల ప్రజలు భావిస్తారు. ప్రపంచంలో తరచూ యుద్దాలు జరగడం అందరికీ తెలిసిందే. అలాగే అనేక దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు తలెత్తుతాయి. కొన్ని దేశాలలో ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణం. ప్రపంచ సామాజిక పరిస్థితులను గమనించిన వారికి ఇవి తెలియనవి కావు.

ఇటువంటి అనూహ్య పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రభుత్వాలు, ప్రజలు కాగితపు కరెన్సీల కంటే...బంగారంపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారు. షేర్ మార్కె్ట్లు పడిపోతుంటాయి. లేస్తుంటాయి. అనేక ఒడిదుడుకులకు షేర్ మార్కెట్ లోనవుతూ ఉంటుంది.అయితే బంగారం విలువ మాత్రం స్థిరంగా ఉంటుంది. లేదంటే బంగారం ధర పెరుగుతుంది.

ప్రపంచంలోని అగ్రరాజ్యాల కేంద్ర బ్యాంకులు అంటే అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు అలాగే మనదేశానికి చెందిన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ...తమ దేశాల కరెన్సీ విలువను కాపాడుకోవడానికి టన్నుల కొద్దీ బంగారాన్ని నిల్వ ఉంచుతాయి. కాగా అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాల దగ్గర అత్యధిక బంగారు నిల్వలు ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవలి కాలంలో భారత్ అలాగే చైనా కూడా తమ బంగారం నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి.

డాలర్ ..అమెరికా కరెన్సీ అలాగే రూపాయి భారత కరెన్సీ. ఇది అందరికీ తెలిసిందే. అయితే డాలర్, రూపాయి వంటి కరెన్సీల విలువ ఒక్కోసారి పడిపోవచ్చు. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతే...డాలర్, రూపాయి కరెన్సీల పై ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది.ఫలితంగా డాలర్, రూపాయి కరెన్సీల విలువ ఒక్కోసారి తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే బంగారం విలువ మాత్రం ఎప్పటికీ తగ్గదు. వీలైతే పెరగడమే తప్ప బంగారం ధర తగ్గడం అనేది ఉండదు. ఈ మొత్తం ఎపిసోడ్ లో డబ్బు విలువ పడిపోకుండా కాపాడుకోవడానికి బంగారం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందన్నమాట.

బంగారాన్ని టెక్నాలజీతో పాటు ఇతర పరిశ్రమలలోనూ ఉపయోగిస్తారు. కేవలం ఆభరణాల రూపంలోనే కాకుండా, ఆధునిక సాంకేతికతలో కూడా బంగారం కీలక పాత్ర పోషిస్తోంది.స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, శాటిలైట్లలో విద్యుత్ ప్రసారం అద్భుతంగా జరగడం కోసం కొన్నిసార్లు బంగారాన్ని ఉపయోగిస్తారు.

అంతేకాదు వైద్యరంగంలోనూ బంగారం వినియోగం ఉంటుంది. కొన్న రకాల క్యా్న్సర్ చికిత్సల్లో అలాగే దంత వైద్యంలో కూడా బంగారాన్ని వినియోగిస్తారు. వీటన్నిటితో పాటు అంతరిక్ష పరిశోధనల్లోనూ బంగారం వినియోగం ఉంటుంది. స్పేస్ సూట్లు, వ్యోమనౌకలపై సూర్యుని హానికరమైన కిరణాల నుంచి రక్షణ కోసం బంగారు పూతను ఉపయోగిస్తారు.

అనేక దేశాల్లో బంగారానికి సంస్కృతి పరంగా ఓ పెద్ద హోదా ఉంది. ఇందులో భారత్ , చైనా వంటి ఆసియా దేశాలు ముందువరుసలో ఉంటాయి. ప్రధానంగా ఆసియా దేశాల్లో బంగారానికి సాంస్కృతిక ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. ఆసియా దేశాల్లో పెళ్లిళ్లు, పండుగలలో బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు.

అంతేకాదు బంగారాన్ని ఒక కుటుంబ ఆర్థిక భద్రతకు అలాగే సామాజిక హోదాకు చిహ్నంగా భావిస్తారు. అంతేకాదు కాగితపు కరెన్సీ ఎప్పుడైనా తన విలువను కోల్పోవచ్చు, కానీ బంగారం విలువ ఎప్పటికీ తగ్గదు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ సరసన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే ఏకైక సహజ లోహంగా బంగారం నిలిచింది.

బంగారానికి ఘనమైన చరిత్ర ఉంది.వేలాది సంవత్సరాలుగా మానవ చరిత్రలో అత్యంత విలువైన లోహంగా బంగారం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

రాజుల ఆభరణాల నుంచి సాధారణ ప్రజల వివాహాల వరకు బంగారం ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది. అంతేకాదు దేశాల వాల్ట్‌ల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని రిజర్వుల వరకు.. బంగారం అనే లోహం ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోంది.

అయితే భూమిపై మొత్తం ఎంత బంగారం ఉందో చూద్దాం. ఇప్పటి వరకూ అనేక దేశాలు, కంపెనీలు, మైనింగ్ సంస్థలు భూమి నుంచి తవ్వి తీసిన మొత్తం బంగారాన్ని "అబోవ్–గ్రౌండ్ గోల్డ్" అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వెలికితీసిన బంగారం మొత్తం 2,16,265 టన్నులు. ఈ బంగారం నాలుగు ప్రధాన విభాగాలలో చలామణి అవుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో ఎక్కువ భాగం ఆభరణాల రూపంలోకి మారిపోయింది.

నెక్లెస్‌లు, ఉంగరాలు, గాజులు, చెవిపోగులు వంటి అలంకరణ వస్తువులుగా ఉన్న బంగారం మొత్తం 97,149 టన్నులు. భారతదేశం, చైనా వంటి దేశాల్లో ఆభరణాల డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగా ఉండటం కూడా ఈ శాతం పెరగడానికి కారణం.ఇక రెండో విభాగం...బంగారం బార్లు అలాగే నాణేలు.ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణం లేదా సంక్షోభ సమయంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆస్తిగా భావిస్తారు.

ప్రపంచదేశాల సెంట్రల్ బ్యాంకులు తమ ఆర్థిక వ్యవస్థల స్థిరత్వానికి బంగారం నిల్వలను వినియోగిస్తున్నాయి. అమెరికా, చైనా, ఇండియా వంటి పలు దేశాల్లో భారీ స్థాయిలో గోల్డ్ రిజర్వులు ఉన్నాయి. మొత్తం కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం 37,755 టన్నులు అని గణాంకాలు చెబుతున్నాయి. ఇక

మిగిలిన బంగారం పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌ తయారీలో, హైఎండ్ సర్కిట్స్‌లో, వైద్య పరికరాల్లో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది.

ఇప్పటికే భూమిని తవ్వి అలాగే భూగర్భంలో ఉన్న టన్నులను కలిపితే ప్రపంచంలోని బంగారం మొత్తం 3,48,383 టన్నులు అవుతుంది. ఇది భూగోళ స్థాయిలో ఉన్న మొత్తం 'సువర్ణ సంపద' అని చెప్పవచ్చు. ఇప్పుడున్న రేటు ప్రకారం చూస్తే ఈ మొత్తం బంగారం విలువ రూ.536 లక్షల కోట్ల పైమాటగానే ఉంది.

అయితే ఇది అంచనా మాత్రమే. ప్రాంతాన్ని బట్టి మారే అవకాశం ఉంది.బంగారం విలువ కాలక్రమంలో పెరుగుతూ ఉండటం, మార్కెట్‌లో విశ్వసనీయత కలిగి ఉండటం, దేశాలకు కూడా ఆర్థిక భద్రత ఇవ్వడం — ఇవన్నీ బంగారాన్ని ఎప్పటికీ ప్రత్యేకమైనదిగా నిలబెడుతున్నాయి. ముఖ్యంగా 2025లో బంగారం ధరలు భారీగా పెరగడంతో పెట్టుబడిదారుల దృష్టి మరింతగా దీని వైపు మళ్లింది. అలంకరణ, పెట్టుబడి, రిజర్వు—ఎలాంటి రూపంలో చూసినా బంగారం తన ప్రాధాన్యం కోల్పోకుండా కొనసాగుతూనే ఉంది.

భారతదేశంలోని పలు ప్రధాన దేవాలయాల్లో వేల టన్నుల కొద్దీ బంగారం నిల్వలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం, సహా కేరళలోని అనంత పద్మనాభ స్వామి వంటి ఆలయాల వద్ద భారీ స్థాయిలో బంగారు ఆభరణాలు, ఇతర ఆభరణాలు ఉన్నాయని చెబుతుంటారు. అంతకుముందు కొన్ని ఆలయాలు.. గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్‌లో కూడా పాల్గొన్నాయి.

ఇదిలా ఉంటే, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మేనెలలో పలు కీలక ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చమురు వినియోగాన్ని తగ్గించుకోవాలని.. బంగారం కొనుగోళ్లు ఏడాది పాటు నిలిపివేయాలని.. వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇక్కడ బంగారం కొనుగోళ్లను పెళ్లిళ్లు, పండగల వేళ కూడా నిలిపివేయాలని ఆయన కోరారు. తర్వాత దీనిపై నియంత్రణ కోసం.. దిగుమతి సుంకాల్ని కూడా 6 నుంచి 15 శాతానికి పెంచేసింది కేంద్రం. దీంతో అప్పటినుంచి సోషల్ మీడియాలో నెటిజెన్లు తమ తమ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇళ్లలో బంగారం బయటికి తీయిస్తారని.. కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తారని ఇలా రకరకాల వదంతులు తెరపైకి వచ్చాయి.

అంతేకాదు దేవాలయాల్లోని బంగారాన్ని ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురాబోతుందన్న పోస్టులు నెట్టింట హల్ చల్ చేశాయి.ఆలయాల్లోని పసిడి నిల్వల్ని కేంద్రం వెనక్కి తీసుకొని.. అందుకు బదులుగా గోల్డ్ బాండ్లను ఆలయాలకు కేంద్రం జారీ చేస్తుందన్న ప్రకటనలు కూడా కనిపించాయి. ఆలయ గోపురాలపై ఉన్న బంగారాన్ని దేశ వ్యూహాత్మక నిల్వలుగా ప్రకటిస్తారని కొందరు పోస్టులు చేశారు. ఇవి నెట్టింట వైరల్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో బంగారం పై జరుగుతున్న అసత్య ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దేవాలయాల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం గానీ.. లేదా వాటికి బదులుగా గోల్డ్ బాండ్లు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించట్లేదని కేంద్రం స్పష్టం చేసింది. అసలు అలాంటి ప్రతిపాదనే తమ దగ్గర లేదని కేంద్రం కుండబద్దలు కొట్టింది. అంతేకాదు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు పూర్తిగా అబద్ధమని.. ప్రజల్ని అధికారిక ప్రకటనలనే నమ్మాలని సూచించింది.

కాగా బంగారానికి సంబంధించిన కొన్ని పారిభాషిక పదాలున్నాయి. అవేమిటో చూద్దాం. వీటిలో సావరిన్ గోల్డ్ బాండ్స్ ముఖ్యమైనవి. సావరిన్ గోల్డ్ బాండ్స్ అంటే ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే గోల్డ్ ఆధారిత ప్రభుత్వ సెక్యూరిటీలన్నమాట. సావరిన్ గోల్డ్ బాండ్స్ భౌతికంగా బంగారం కాదు. పసిడి భౌతిక కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్రం గతంలో తీసుకొచ్చిన పసిడి పెట్టుబడి విధానం ఇది. 2015లో కేంద్రం ఈ స్కీమ్ ను తీసుకువచ్చింది. అయితే ప్రభుత్వంపై అధిక భారం పడుతున్న నేపథ్యంలో 2024 నుంచి కొత్త సావరిన్ బాండ్లను జారీ చేయట్లేదు.

గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్...ఇదొక కేంద్ర ప్రభుత్వ పథకం.2015 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది.ఇళ్లు, సంస్థల దగ్గర వద్ద నిరుపయోగంగా ఉన్నటువంటి బంగారాన్ని.. బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడమే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ప్రధాన లక్ష్యం.

ఇలా సేకరించిన బంగారాన్ని.. జువెల్లరీ సెక్టార్ లేదా ఇతర అవసరాలకు వినియోగించి విదేశీ దిగుమతుల్ని తగ్గించుకోవాలని కేంద్రం భావించింది. అయితే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కు ప్రభుత్వం ఆశించినంత స్థాయిలో స్పందన రాలేదు. దీంతో...ఈ పథకం దాదాపుగా మూలనపడినట్లే భావించాలి.

బంగారం విలువ క్రమంగా ఎలా పెరిగిందంటే, అది మానవ చరిత్ర దిశనే మార్చేసింది. వాణిజ్య వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో, రాజ్యాలను బలోపేతం చేయడంలో మరియు యుద్ధాలకు నిధులు సమకూర్చడంలో బంగారం కీలక పాత్ర పోషించింది. సామాజిక స్థితిని చూపించే ప్రమాణంగా కూడా ఇది మారింది. ముఖ్యంగా, బంగారం కాలక్రమేణా తుప్పు పట్టదు, రంగు మారదు, ఆకర్షణ కోల్పోదు. ఈ లక్షణాలే ఇతర లోహాలతో పోలిస్తే బంగారాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి.

ప్రస్తుత కాలంలో బంగారం మరింత అరుదైన లోహంగా మారింది. భూమిలో ఉన్న బంగారం నిల్వలు పరిమితంగా ఉండటం, గనుల నుంచి తవ్వడం చాలా కష్టసాధ్యంగా మారడం వల్ల ధరలు పెరుగుతున్నాయి. అంతేకాదు, నేటి ఆధునిక సాంకేతికతలో కూడా బంగారం కీలక పాత్ర పోషిస్తోంది.

మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ చిప్స్, ఉపగ్రహాలు, అంతరిక్ష సాంకేతికత, అలాగే కొన్ని వైద్య పరికరాలు మరియు మందుల తయారీలో బంగారం ఉపయోగించబడుతోంది. ఈ అన్ని కారణాల వల్ల బంగారంపై డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అందుకే బంగారం విలువ ఎప్పటికీ తగ్గకుండా, కాలక్రమేణా మరింత పెరుగుతూనే ఉంది.

కాలం మారినా, నాగరికతలు మారినా వేలాది సంవత్సరాలుగా బంగారం ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదు.బంగారం అంటే ఇష్టం లేని వారు చాలా అరుదు. పురాతన కాలం నుంచే బంగారం సంపదకు, శక్తికి, పవిత్రతకు ప్రతీకగా నిలిచింది. ఏమైనా పేదలు మరియు సామాన్య ప్రజలకు బంగారం కొనడం ఒక పెద్ద సవాలుగా మారింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్