Burning Topic: దేశవ్యాప్తంగా మూడో దశ SIR మొదలు

Burning Topic: దేశవ్యాప్తంగా మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 May 2026 6:49 AM IST
Burning Topic
X

Burning Topic: దేశవ్యాప్తంగా మూడో దశ SIR మొదలు

Burning Topic: గత సంవత్సరం బిహార్ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ - ఎస్ఐఆర్ ప్రక్రియ జరగడం తెలిసిందే. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో పాటు 9 రాష్ట్రాల్లో రెండో దశ ఎస్ఐఆర్‌ను చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పుడు దేశవ్యాప్తంగా మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు ఆదేశించింది.. ఈ దశలో 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఢిల్లీ, ఒడిశా, మిజోరం, సిక్కిం, మణిపూర్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హరియాణా, చండీగఢ్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, ఝార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, దాద్రానగర్ హవేలి, డామన్ డయ్యూలో మూడో దశ ఎస్ఐఆర్​ ప్రక్రియ జరగనుంది. అయితే, మంచు ప్రభావిత ప్రాంతాలైన హిమాచల్​ ప్రదేశ్​, జమ్ము కశ్మీర్​, లద్ధాఖ్​ ప్రాంతాల్లో వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్ఐఆర్​ షెడ్యూల్​ను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది.

ఎస్ఐఆర్​మూడో దశలో భాగంగా 3.94 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి దాదాపు 36.73 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. వీరికి రాజకీయ పార్టీలు నియమించిన 3.42 లక్షల బూత్ లెవల్ ఏజెంట్లు లు సహకరించనున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్‌కు తప్పనిసరిగా BLAలను నియమించాలని ఎన్నికల సంఘం కోరింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా బూత్ లెవల్ ఆఫీసర్ల నియామకం, శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. అనంతరం 2002 జాబితా ప్రకారం ఓటర్ల సవరణకు ఈసీ సిద్ధమైంది. ఓటర్ల జాబితాలో అర్హుల పేర్లు మాత్రమే ఉండేలా చూడటానికే ‘సర్‌’ నిర్వహిస్తున్నామని తెలిపారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్. అనర్హుల పేర్లు ఉండటానికి వీల్లేదు. అందుకే ఓటర్లంతా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, ఎన్యుమరేషన్‌ ఫారాలు నింపాలి అని సూచించారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంగా పూర్తి చేసేందకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హరియాణా, చండీగఢ్ ప్రాంతాల్లో జూన్‌ 5 నుంచి 14 వరకు సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత జూన్ 15 నుంచి జులై 14 వరకు వారు ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరించనున్నారు. అనంతరం జులై 21న ముసాయిదా జాబితా వెల్లడించారు. ఆగస్టు 20 వరకు అభ్యంతరాలను స్వీకరించి, మార్పులు చేర్పుల అనంతరం సెప్టెంబర్‌ 22న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు. తెలంగాణలో, పంజాబ్ రాష్ట్రాల్లో జూన్‌ 15 నుంచి 24 వరకు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత జూన్‌ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటి సర్వే జరుగుతుంది. జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించి.. అదే రోజు నుంచి సెప్టెంబర్‌ 28 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అక్టోబర్‌ 1న తుది జాబితా ప్రకటించనున్నారు.

ఎస్‌ఐఆర్ తొలి దశ పైలట్‌ ప్రాజెక్టు కింద బిహార్‌లో మొదలు పెట్టారు. అక్కడ 47 లక్షల మంది ఓటర్లను తొలగించారు. రెండోదశతో 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగింది. మొత్తంగా 7.36 కోట్ల మంది ఓటర్లను తొలగించారు. ఈ దశలో కొత్తగా 2.18 కోట్ల మంది ఓటర్లను జతచేశారు. దీంతో నికర ఓటర్ల తొలగింపు 5.18 కోట్లకు చేరింది. సర్‌ రెండో విడతకు ముందు 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 50.99 కోట్లు ఉండగా, తర్వాత 45.81 కోట్లకు తగ్గింది. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 2.05 కోట్ల ఓటర్ల తొలగింపు జరిగింది. తర్వాతి స్థానాల్లో పశ్చిమబెంగాల్‌ 83.86లక్షలతో, తమిళనాడు 74 లక్షలతో ఉన్నాయి. కొత్తగా ఓటర్ల జాబితాలో చేరినవారి పేర్లు అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నాయి. అక్కడ 92.4 లక్షల ఓట్లు చేరాయి, తమిళనాడులో 35 లక్షలు,, కేరళలో 20.4 లక్షలు చేర్చారు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముఖ్య ఉద్దేశం ఏమింటే.. ఓటర్ లిస్టు నుంచి చనిపోయిన, డూప్లికేట్, శాశ్వతంగా తరలిపోయిన, అనర్హుల పేర్లను డిలీట్ చేసి.. అర్హుల పేర్లు మాత్రమే ఉండేలా రూపొందించడం. ఈ ప్రక్రియలో భాగంగా బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశీలిస్తారు. ఓటర్లు భర్తీ చేసిన ఎన్యుమరేషన్‌ ఫారాలను.. పాత ఓటరు డేటాతో పోల్చి వివరాలను చెక్ చేస్తారు. కొత్త ఓటర్ల కోసం ఫామ్ 6, డిక్లరేషన్​ను సేకరిస్తారు. ఈ ఫామ్​లో ఓటర్లు తమ వివరాలను నింపాల్సి ఉంటుంది. ప్రతి ఓటర్​ను కనీసం మూడు సార్లు కలిసి వివరాలను ధ్రువీకరించుకుంటారు అధికారులు. ఓటర్ల జాబితా నుంచి అనర్హులను తొలగించడం, కొత్త ఓటర్లను చేర్చే ప్రక్రియలో ప్రతి ఓటరు 11 ఐడెంటిటీ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందిఇప్పటివరకు మన దేశంలో ఎనిమిదిసార్లు SIR ప్రక్రియను చేపట్టారు. 1951-2004 మధ్యకాలంలో ఇది జరిగింది. 2001-04 మధ్య కాలంలో చివరిగా ఈ ప్రక్రియ జరిగింది.

ఓటరు గుర్తింపు కోసం ఫొటో ఐడీ డాక్యుమెంట్స్​ను సేకరిస్తారు. ఇందుకోసం ఆధార్ కార్డు, పాస్​పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డు, పాన్ కార్డు వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఓటరు వయసుకు సంబంధించిన వివరాల కోసం బర్త్ సర్టిఫికెట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్, మాట్రిక్యులేన్,ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ వంటి వాటిల్లో ఏదో ఒకటి సమర్పించాలి. నివాస ప్రాంతం ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, యుటిలిటీ బిల్, బ్యాంక్ పాస్​బుక్ లేదా క్యాన్సిల్ అయిన చెక్, ప్రస్తుత అడ్రస్​తో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్, రెంటల్​కు సంబంధించి యజమానితో ఏదైనా అగ్రిమెంట్ ఉంటే వాటి పత్రాలు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ పైన చెప్పిన పత్రాలు పూర్తిగా అందుబాటులో లేనప్పుడు వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా వేరే డాక్యుమెంట్లను అధికారులకు సబ్మిట్ చేయొచ్చు.ఎన్నికల అధికారులు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురించిన తర్వాత ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ పత్రాలను అందించి పరిష్కారం చేసుకోవచ్చు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story