Off The Record: తిరుపతి మేయర్ పీఠం దక్కేది ఎవరికి!
Off The Record: తిరుపతి మేయర్ పీఠంపై తీవ్ర పోటీ. రిజర్వేషన్ల లెక్కలతో పాటు టీడీపీ, జనసేన ఆశావహుల జాబితా ఆధారంగా విశ్లేషణ.
Off The Record: తిరుపతి మేయర్ పీఠం దక్కేది ఎవరికి!
Off The Record: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే తిరుపతిలో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. రిజర్వేషన్ జనరల్ లేదా జనరల్ మహిళకు వస్తే.. తిరుపతి మేయర్ రేసులో బలిజ సామాజిక వర్గం నుంచి పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందని టాక్. ఈ లెక్కల్లో టీడీపీకి చెందిన ఎడిఫై విద్యాసంస్థల అధినేత ప్రణీత్ పేరు ముందు వరుసలో వినిపిస్తోందట. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటూ.. బలిజ సామాజిక వర్గంలోనూ పరిచయాలు ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్‌గా మారుతుందని అనుచరులు భావిస్తున్నారట. మరోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంతో ఉన్న పరిచయాలు.. సినీ హీరో నారా రోహిత్‌తో సత్సంబంధాలు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఉన్న పరిచయాలు కూడా ప్రణీత్‌కు కలిసి వచ్చే అంశాలుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఒకవేళ మేయర్ స్థానం మహిళలకు రిజర్వ్ అయితే.. ప్రణీత్ తల్లి పెనుమాదుల సులోచనమ్మ పేరు కూడా పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇదే సామాజిక వర్గం నుంచి తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనవరాలు కీర్తి పేరు కూడా వినిపిస్తోంది. సుగుణమ్మ ఇప్పటికే కీర్తిని పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా తీసుకెళ్తుండటంతో.. భవిష్యత్ రాజకీయాలకు ఆమెను సిద్ధం చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. అయితే.. తిరుపతి ఎమ్మెల్యేగా ఇప్పటికే బలిజ సామాజిక వర్గానికే చెందిన జనసేన నేత ఆరణి శ్రీనివాసులు ఉండటంతో.. మేయర్ పదవి విషయంలో అధిష్ఠానం సామాజిక సమతుల్యత పాటిస్తుందా.. లేక మరోసారి అదే వర్గానికే అవకాశం ఇస్తుందా.. అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇక మేయర్ స్థానాన్ని బీసీ కేటగిరీకి కేటాయిస్తే మాత్రం.. తిరుపతి రాజకీయాల్లో లెక్కలు పూర్తిగా మారే అవకాశం ఉందట. ఈ రేసులో యాదవ సామాజిక వర్గానికి చెందిన ధంపూరి భాస్కర్ యాదవ్ పేరు బలంగా వినిపిస్తోందట. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీతో అనుబంధం ఉన్న కుటుంబం కావడం.. గతంలో తిరుపతి టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేయడం.. రాష్ట్ర టీడీపీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించడం.. ఇవన్నీ ఆయనకు ఉన్న ప్లస్ పాయింట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 1985లోనే ఆయన తల్లి రాజ్యలక్ష్మి తిరుపతి మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేయడం కూడా కుటుంబ రాజకీయ నేపథ్యానికి నిదర్శనంగా చూపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ అప్పగించిన బూత్‌లలో టీడీపీకి మెజార్టీ తీసుకురావడం ద్వారా అధిష్ఠానం దృష్టిలో పడిన నేతగా భాస్కర్ యాదవ్‌కు పేరు ఉందట. వివాదాలకు దూరంగా ఉండటం.. పార్టీ కోసం చాలాకాలంగా పనిచేయడం ఆర్థికంగా కూడా బలంగా ఉండటం ఇవన్నీ మేయర్ రేసులో ఆయనకు అనుకూల అంశాలుగా మారుతున్నాయట. అంతేకాదు.. మేయర్ పదవి మహిళలకు రిజర్వ్ అయితే తన భార్య దంపూరి లావణ్యను బరిలోకి దించేందుకు కూడా దంపూరి భాస్కర్ యాదవ్ సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే బీసీ సామాజిక వర్గం నుంచి అన్నా అనిత పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అన్నా అనిత ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూనే.. ఇటీవలే ఆమె అన్నా రామచంద్రయాదవ్‌తో కలిసి అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. అయితే.. యాదవ సామాజిక వర్గానికి మేయర్ పదవిపై అధిష్ఠానం స్థాయిలో ఇప్పటికే సానుకూలత ఉందనే ప్రచారం నేపథ్యంలో.. భాస్కర్ యాదవ్ పేరు రేసులో ముందంజలో ఉందనే చర్చ కూటమి వర్గాల్లో నడుస్తోందట.
ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు ఉన్నారట. విస్తృత పరిచయాలు.. నియోజకవర్గంలో కేడర్‌తో అనుబంధం.. రాజకీయ కుటుంబ నేపథ్యం.. ఇవన్నీ కలిసొచ్చే అంశాలుగా ఉన్న మబ్బు దేవనారాయణరెడ్డి పేరు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే మబ్బు రామ్‌రెడ్డి కుమారుడిగా రాజకీయ నేపథ్యం ఉండటంతో పాటు.. తిరుపతి రాజకీయాల్లో మబ్బు కుటుంబానికి ఉన్న పరిచయాలు ఆయనకు బలంగా మారుతాయని అనుచరుల అంచనా. అయితే మేయర్ రేసులో సామాజిక సమీకరణాలే కీలకం కానున్న నేపథ్యంలో.. రెడ్డి సామాజిక వర్గానికి అధిష్ఠానం ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరోవైపు.. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన కూడా మేయర్ పీఠంపై కన్నేసిందనే చర్చ జరుగుతోంది. జనసేన నుంచి తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్‌తో పాటు సుభాషిణి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయట. తిరుపతిలో తమకూ రాజకీయ బలం ఉందని.. కూటమి విజయానికి తమ పార్టీ కూడా కీలకంగా పనిచేసిందని జనసేన నేతలు చెబుతున్నారట. అసలు మేయర్ అభ్యర్థి ఎవరు అన్నదానికంటే ముందు.. డివిజన్ల పంపకమే కూటమికి అసలు అగ్నిపరీక్షగా మారే అవకాశం కనిపిస్తోందట. తిరుపతి కార్పొరేషన్‌లో డివిజన్ల సంఖ్య 66కు పెరగడంతో.. ప్రతి డివిజన్‌పైనా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కన్నేసినట్లు సమాచారం. గత ఎన్నికల్లో కూటమి విజయానికి తామే కీలకమని చెబుతున్న మిత్రపక్షాలు.. వార్డుల పంపకంలో తమకు తగిన వాటా కావాలని ఇప్పటికే అధిష్ఠానానికి సంకేతాలు పంపుతున్నాయట. దీంతో.. మేయర్ కుర్చీ కంటే ముందు డివిజన్ల సర్దుబాటే కూటమి సమన్వయానికి పెద్ద పరీక్షగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొత్తానికి.. తిరుపతి మేయర్ రేసులో ఆశావహుల జాబితా చాంతాడంతా ఉన్నప్పటికీ అసలు లెక్క మాత్రం రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతే తేలనుంది. జనరల్ అయితే ఒక లెక్క.. జనరల్ మహిళ అయితే మరో లెక్క. బీసీ రిజర్వేషన్ వస్తే ఇంకో లెక్క. దీనికితోడు టీడీపీ.. జనసేన.. బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు కూడా కీలకంగా మారనుంది. అంటే.. తిరుపతి మేయర్ కుర్చీ కోసం పోటీ కేవలం వ్యక్తుల మధ్యే కాదు.. సామాజిక సమీకరణాలు, రాజకీయ బలాబలాలు, మిత్రపక్షాల ఒత్తిళ్లు.. అన్నింటి మధ్య జరగబోతున్నాయన్న మాట. ఇప్పటికే ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నారట.. ఎవరి లెక్కల్లో వాళ్లు ఉన్నారట. కానీ.. చివరి నిమిషంలో అధిష్ఠానం వేసే ఒక్క అడుగు.. ఇప్పటివరకు ఉన్న మొత్తం పొలిటికల్ లెక్కనే మార్చేయొచ్చన్నది తిరుపతి రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరి.. తిరుపతి రెండో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుంది..? కూటమి అధిష్ఠానం ఎవరికి జై కొడుతుంది..? ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే.. రిజర్వేషన్ల ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.




